కృష్ణా జలాలే శరణ్యం | only way prevention problem of Fluoride | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలే శరణ్యం

Published Fri, Dec 5 2014 12:46 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM

కృష్ణా జలాలే శరణ్యం - Sakshi

కృష్ణా జలాలే శరణ్యం

 సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యను అధిగమించడానికి కృష్ణాజలాల సరఫరానే  బ్రహ్మాయుధమని అంటున్నారు జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన సంస్థ ఇన్‌చార్జ్ డాక్టర్ అర్జున్.ఎల్.కందారే. ఫ్లోరోసిస్ నివారణకు ప్రభుత్వాలతోపాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అన్నివర్గాల వారి భాగస్వామ్యం అవసరమని ఆయన అభిప్రాయపడుతున్నారు. కేంద్రప్రభుత్వం

 జిల్లాలో ఏర్పాటు చేసిన జాతీయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఫ్లోరోసిస్ నివారణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకుంటామని చెబుతున్నారాయన. గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఫ్లోరోసిస్ నివారణ క్రమంలో ఎదురవుతున్న సమస్యలు, తన అనుభవాల గురించి మాట్లాడారు కందారే. పూర్తి వివరాలు

 ఆయన మాటల్లోనే...
 ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం ఏ ఒక్కరి చేతుల్లోనో లేదు. చట్టాలు తయారు చే సే ప్రజాప్రతినిధుల నుంచి సామాన్య ప్రజలవరకు అన్నివర్గాలు ఇందులో చేయీచేయీ కలపాల్సి ఉం టుంది. అలా అందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఫ్లోరైడ్ నాలెడ్జ్ అండ్ యాక్షన్ నెట్‌వర్క్ పేరుతో జాతీయస్థాయిలో వివిధ రంగాల ప్రముఖులను, ఎన్జీఓలను భాగస్వాములను చేసే ప్రయత్నం జరుగుతోంది. అందరూ సహకరిస్తే ఫ్లోరోసిస్ నివారణ పెద్ద సమస్యేమీ కాదు. అయితే, చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది.
 
 అన్నిచోట్లా ఇదే సమస్య
 మన దేశంతోపాటు చాలాచోట్ల ఈ ఫ్లోరోసిస్ సమస్య ఉంది. ఈ ఏడాది నవంబర్ 25-28 తేదీల్లో మధ్య థాయిలాండ్‌లోని చాంగ్మై పట్టణంలో ఫ్లోరోసిస్ నివారణపై అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఇందులో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం నాకు దక్కింది. నాతోపాటు శ్రీలంక, పాకిస్తాన్, థాయిలాండ్, స్పెయిన్ దేశాల ప్రతినిధులూ వచ్చారు. వారంతా తాము కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టు వారి ప్రజెంటేషన్లలో చెప్పారు. ఇటలీనుంచి వచ్చిన ప్రతినిధి కూడా ఇదే చెప్పారు. ఈ సమావేశం ఇన్‌పుట్స్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్లోరైడ్ నివారణపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు ఫ్లోరోసిస్ నివారణమార్గాలు ఏంటన్న దానిపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది.
 
 బోన్‌చార్.. ఓకే.. కానీ
 ఫ్లోరోసిస్ సమస్యకు నదీజలాలతో పాటు మరో ముఖ్యమైన పరిష్కారం ‘బోన్‌చార్’. అంటే జంతువు ఎముకలను నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణీత ఉష్ణోగ్రతలో వేడి చేయడం ద్వారా ఆ ఎముకల్లో ఉన్న ప్రొటీన్లు, కొవ్వును కరిగించవచ్చు. దీనినే బోన్‌చారింగ్ అంటారు. తర్వాత ఆ ఎముకలను పొడి చేసి క్యాండిల్స్ మాదిరిగా తయారు చేసి రక్షిత మంచినీటి పథకాల్లో ఇమడ్చడం ద్వారా ఫ్లోరోసిస్ సమస్యను నివారించవచ్చు. కానీ ఇందులో ఏ జంతువు ఎముకలు వాడాలి అనే దానిపై కొన్ని సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రక్రియ సరిగ్గా జరగకపోతే మరికొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయేమోననే దానిపై చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఈ విధానం ఫ్లోరోసిస్ నివారణకు ఉత్తమ మార్గమనేది నా అభిప్రాయం. అయితే దీనిని ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే సందేహం మాత్రం ఉంది.
 
 వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలి
 వర్షపు నీటిని నిల్వ చేసి సద్వినియోగం చేసుకోవడం కూడా ఫ్లోరోసిస్ ప్రధాన పరిష్కారమార్గాల్లో ఒకటి. ఈ విధానం వల్ల నదీజలాలను ప్రజలకు తాగిస్తే ప్రయోజనం ఉంటుంది. నార్కట్‌పల్లి మండలంలోని మాధవ యడవల్లి గ్రామ ప్రజల విజయరహస్యం ఇదే. అక్కడ ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న వారిలో క్రమంగా మార్పు వస్తోంది. ఎందుకంటే ఆ గ్రామానికి  ఆరేడేళ్లుగా కృష్ణా జలాలను అందిస్తున్నారు. ఇప్పుడు అక్కడి యువత, చిన్నారుల్లో పెద్దగా ఫ్లోరోసిస్ సమస్యల్లేవు. దంత ఫ్లోరోసిస్ మాత్రమే కనిపిస్తోంది. స్కెలెటిన్ ఫ్లోరోసిస్ కేసులు ఇప్పుడు అసలు రావడం లేదు.
 
 మేం త్వరలోనే లైన్‌లోకి వస్తున్నాం
 ఇక, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలంలోని మల్కాపూర్ గ్రామపరిధిలో ఏర్పాటు చేస్తున్న జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన సంస్థ పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. ఇందులో ఫ్లోరోసిస్ నివారణకు ఔషధాలు, ఇతర మార్గాలు, భౌగోళిక సంబంధ పరిశోధనలు జరుగుతాయి. ఈ సంస్థకు భూమి కేటా యింపు ప్రక్రియ కూడా పూర్తయింది. సంస్థ పేరిట ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం. త్వరలోనే దీనిపై కేంద్రప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశంలో సంస్థ ఏర్పాటుకు అవసరమైన నిధుల వివరాలు, కల్పించాల్సిన మౌలిక సౌకర్యాలపై చర్చిస్తాం. ఇందుకు సంబంధించిన నివేదికను ఇప్పటికే పంపాం. అయితే, ఈ సంస్థ ఏర్పాటయ్యేం దుకు రూ.150 కోట్లు అవసరమని అంచనా. కానీ, ప్రస్తుతమున్న నిధులతో కార్యకలాపాలు ప్రారంభించి అనంతరం కేంద్రం నుంచి అవసరమైతే రాష్ట్రం నుంచి నిధులు తీసుకుంటాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement