సింగూరుతో సిరులు కురిపిస్తాం
- వచ్చే ఖరీఫ్ నాటికి 40 వేల ఎకరాలకు సాగునీరు
- గత ప్రభుత్వ అలసత్వం..
- అధికారుల నిర్లక్ష్యం వల్లే ముందుకు సాగని కాలువ పనులు
- నియోజకవర్గానికి ఒక్కరే డిప్యూటీ ఈఈ ఉండాలి
- ఇరిగేషన్ ఏఈల డిప్యుటేషన్ల రద్దుకు ఆదేశాలు
- నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడి
జోగిపేట: సింగూరు జలాలతో సిరులు కురిపిస్తామని, వచ్చే ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. సోమవారం పుల్కల్ మండలం సింగూరులోని గెస్ట్‌హౌస్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు కాలువ నిర్మాణం పనులు గత ప్రభుత్వ అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం వల్ల ముందుకు సాగలేదని ఆరోపించారు. నవంబర్ మాసంలోగా 10 వేల ఎకరాలకు ప్రాజెక్టు ద్వారా సాగునీరును అందించేందుకు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. రాత్రింబవళ్లు పనులు చేపట్టాల్సిందిగా కోరినట్లు తెలిపారు.
కాలువ పనుల్లో భాగంగా నవంబర్ వరకు భూసేకరణ పనులు చేపట్టాలని ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సుమారు 220 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉందని, వీలైతే వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా భూసేకరణ చేపట్టాలన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు పంప్ హౌస్ నిర్మించాల్సి ఉందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్‌తో పాటు ప్రధాన కాలువ పనులకు సంబంధించి చీఫ్ ఇంజినీర్ వారానికి ఒక్క సారి తనకూ, స్థానిక ఎమ్మెల్యేకు నివేదిక సమర్పించాలని ఆదేశించామన్నారు. కాగా నియోజకవర్గానికి ఒక్కరే డిప్యూటీ ఈఈ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అందోలు నియోజకవర్గంలో ముగ్గురు డిప్యూటీ ఈఈలు ఉన్నారని, వెంటనే రీ ఆర్గనైజేషన్ చేపట్టాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. నియోజకవర్గానికి ఒక ఏఈ, డిప్యూటీ ఈఈ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డిప్యుటేషన్లు రద్దు
జిల్లాలో పనిచేస్తున్న ఇరిగేషన్ శాఖకు చెందిన ఏఈలు చాలామంది హైదరాబాద్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు తనకు సమాచారం ఉందని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. వెంటనే డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. తప్పనిసరిగా మండలాల్లో ఏఈలు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
జాలు వాగు పథకానికి మంత్రి గ్రీన్ సిగ్నల్
నియోజకవర్గం పరిధిలోని జాలు వాగు ద్వారా 1,800 ఎకరాలకు సాగుకు నీరందించేందుకు అవకాశం ఉండడంతో వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముంపునకు గురికాకుండా ఎత్తు పెంచేందుకు వీలుందా? లేదా అనే విషయంపై యాక్షన్‌ప్లాన్ తయారుచేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సింగూరు ప్రాజెక్టులో పూడిక తొలగించే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యే పి.బాబూమోహన్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ సీఈ మధుసూదన్, ఎస్‌ఈ అనిల్‌కుమార్, ఈఈ వేణుగోపాల్, డిప్యూటీఈఈలు జగన్నాథం, రమేశ్, ఏఈ బాలగణేష్ మంత్రి వెంట ఉన్నారు.
సింగూరు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి
పుల్‌కల్: మండలంలోని సింగూర్(బాగారెడ్డి) ప్రాజెక్టును మంత్రి హరీష్‌రావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో ఉన్న నిల్వ, పారుదల, తాగునీరు, వంటి వివరాలను తెలుసుకున్నారు. ప్రాజెక్టులో ఉన్న పూడిక, దాని వల్ల వచ్చే నీటి సమస్యను తెలియజేయాలని ఆయన సంబందిత అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా లిఫ్టు ఇరిగేషన్, ఎడుమ కాలువలను పరిశీలించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సింగూరు ప్రాజెక్టును ఏ ప్రభుత్వాలు గుర్తించలేదని, ఇప్పుడైనా ప్రాజెక్టును అభివృద్ధి పరిచేందుకు కృషి చేద్దామని మంత్రి తెలిపారు.