ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రానికి దక్కాల్సిన సేంద్రియ విశ్వవిద్యాలయం చేజారింది. కేంద్రానికి సకాలంలో ప్రతిపాదనలు పంపకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వస్తున్నాయి. మనకు దక్కాల్సిన విశ్వవిద్యాలయం గుజరాత్‌కు తరలిపోవడంతో వ్యవసాయశాఖ నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతేడాది ఫిబ్రవరిలో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) సేంద్రియ విశ్వవిద్యాలయాల స్థాపనకు తీర్మానం చేసింది. వాతావరణ జోన్లను ఆధారంగా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రైతాంగానికి ఎంతో మేలు
సేంద్రియ విశ్వవిద్యాలయం స్థాపన వల్ల రాష్ట్రంలో రసాయన పురుగు మందుల వాడకం తగ్గించడానికి వీలుంటుంది. అలాగే సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడానికి ఉన్న అవకాశాలపై మరిన్ని పరిశోధనలు జరుగుతాయి. రాష్ట్ర అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా జరిగే పరిశోధనల ప్రభావం రైతులపై ఉంటుంది. రాష్ట్రంలో రసాయన పురుగు మందుల వాడకం తగ్గి సేంద్రియ పంటలు ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే రైతులు పండించే సేంద్రియ ఆహార ఉత్పత్తులకు మార్కెట్, ప్రాసెసింగ్ ప్రక్రియ కూడా జరుగుతుంది. సేంద్రియ ఉత్పత్తులకు ధరలు, సూపర్ మార్కెట్లు వంటివి ఏర్పాటు చేసే అవకాశముంది. రాష్ట్రంలో సేంద్రియ ఆహారంపై ప్రజల్లోనూ అవగాహన ఏర్పడుతుంది.
ఇప్పటికైనా ప్రతిపాదనలు పంపొచ్చు..
తెలంగాణకు సేంద్రియ విశ్వవిద్యాలయం తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఐకార్ జనరల్ బాడీ సభ్యుడు, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి కొండెల సాయిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతిపాదనలు పంపిస్తే విశ్వవిద్యాలయాన్ని తీసుకురావడానికి ప్రయత్నించవచ్చని ‘సాక్షి’తో చెప్పారు. సేంద్రియ విశ్వవిద్యాలయానికి కేంద్రం కనీసం 50 శాతం నిధులు ఇస్తుందన్నారు. ఇప్పటికే సిక్కింలో సేంద్రియ విశ్వవిద్యాలయం ప్రారంభమైందని తెలిపారు. గుజరాత్‌లో వచ్చే ఏడాదికి విశ్వవిద్యాలయం పూర్తికానుందన్నారు. సేంద్రియ విశ్వవిద్యాలయం ఏర్పాటుపై తాను సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని.. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా దీనిపై విన్నవించామన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రానికి రాలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment