రోడ్డెక్కిన ఉస్మానియా
హైదరాబాద్: నిరసనలు, ఆందోళనలతో గత 25 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడుకుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు వేర్వేరు రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. శుక్రవారం ఓయూ క్యాంపస్ కళాశాలల అధ్యాపకులతో పాటు నిజాం, కోఠి మహిళా కళాశాల, సైఫాబాద్, సికింద్రాబాద్ పీజీ కాలేజీలు, జిల్లా పీజీ కేంద్రాల అధ్యాపకులు ఆర్ట్స్ కళాశాల నుంచి పాలన భవనం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
అనంతరం సెనేట్ హాలులో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్‌కుమార్ సమక్షంలో సమావేశమై తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ చైర్మన్ ప్రొ.భట్టు సత్యనారాయణ, ఉస్మానియా వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ.. ఓయూకు తక్షణం రెగ్యులర్ వీసీని, పాలక మండలి సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు.
ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. లేదంటే ఈ నెల 24న సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో పర్యావరణ వేత్త ప్రొ.పురుషోత్తమరెడ్డి, విశ్రాంత అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ప్రొ.ముర ళీమనోహర్, ఔటా కార్యదర్శి ప్రొ.లక్ష్మీకాంత్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఓయూలోని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా విధులను బహిష్కరించి శుక్రవారం వంటావార్పుతో నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వం పంతానికి పోకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ వర్సిటీల బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కంచి మనోహర్ మాట్లాడుతూ.. ఓయూకు వీసీ లేనందున ఉద్యోగుల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నేతలు పార్థసారథి, జ్ఞానేశ్వర్, దీపక్‌కుమార్, అశోక్, తక్కెళ్ల మల్లేశ్, ఖదిర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌డీ విద్యార్థుల ఆందోళన...
పీహెచ్‌డీ ప్రవేశాలకు 2009, 2011 సంవత్సరాలలో అనుసరించిన విధానాన్ని అమలు చేయాలని విద్యార్థులూ ఆందోళన చేపట్టారు. ప్రవేశ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు 15 మార్కులు, బీసీలకు 20, ఓసీలకు 25 మార్కుల విధానాన్ని అమలు చేయాలని రిజిస్ట్రార్‌ను కోరారు. దీనిపై ఇన్‌చార్జ్ వీసీ ఆచార్యకు వివరిస్తామని వారి నుంచి అనుమతి వస్తే మార్కులను తగ్గిస్తామని రిజిస్ట్రార్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.7 కోట్ల మెస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆందోళనలు నిర్వహించారు.