ఔటర్ ‘టోల్’ టెండర్ ఖరారు
హెచ్‌ఎండీఏకు రెట్టింపైన ఆదాయం
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్‌రోడ్డుపై ‘టోల్’ వసూలు టెండర్‌ను ఈగిల్ సంస్థ దక్కించుకొంది. నెలకు రూ.3.8 కోట్లు చె ల్లించేలా అధికంగా కోట్ చేసి టెండర్‌ను సొంతం చేసుకొంది. ఔటర్ రింగ్‌రోడ్డుపై టోల్ టెండర్ కోసం 9 ఏజెన్సీలు పోటీపడగా మూడు అర్హత సాధించాయి. గత నెల 16న బిడ్స్ ఓపెన్ చేసిన అధికారులు సాంకేతిక మూల్యాంకనం చేయగా, రాజ్‌దీప్ సంస్థ రూ.3.5 కోట్లు, ఎఫ్‌కాన్ సం స్థ రూ.3 కోట్లు, ఈగల్ సంస్థ రూ.3.8 కోట్లు కోట్ చేసినట్లు తేలింది. దీంతో అధికంగా కోట్ చేసిన ఈగల్ సంస్థకే ఔటర్‌పై టోల్ వసూలు అవకాశం దక్కింది.
గతంలో నెలకు రూ. రూ.1.66 కోట్లు మాత్రమే వచ్చే ఆదాయం తాజా టెండర్‌తో నెలకు రూ.3.8 కోట్లకు పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు ఔటర్‌పై ట్రాఫిక్ పెరగడంతో నెలకు రూ.2.94 కోట్లు కనీస మొత్తంగా నిర్ణయించి హెచ్‌ఎండీఏ ఇటీవల టెండర్ పిలిచింది. అయితే, అధికారులు ఊహించిన దాని కంటే నెలసరి ఆదాయం రెట్టింపైంది.
18 నెలల వరకే అవకాశం
ఔటర్‌పై అత్యాధునిక టోల్ వ్యవస్థ ఏర్పాటుకు 18 నెలల సమయం పట్టనుంది. అప్పటివరకు ఈ మార్గంలో టోల్ వసూలు బాధ్యతను ఈగల్ ఏజెన్సీ చేపడుతుంది. ఈ నెల 6న హెచ్‌ఎండీఏ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో అధికారికంగా నిర్ణయించి ఈగల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔటర్‌పై 14-15 చోట్ల మ్యాన్యువల్ టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేసి దారి సుంకం వసూలు చేస్తారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నగరం చుట్టూ 158 కి.మీ. మేర నిర్మిస్తున్న ఔటర్ రింగ్‌రోడ్డు ఇప్పటికే 120 కి.మీ. అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజా టెండర్‌తో 18 నెలల్లో టోల్ రూపంలో హెచ్‌ఎండీఏకు వచ్చే ఆదాయం రూ.68 కోట్లకు పైగా ఉంటుందని అధికారుల అంచనా.