![Extortion of toll tax on outer ring road hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/31/1477.jpg.webp?itok=PhTCMcU-)
హైదరాబాద్‌కు చెందిన ఓ వాహనదారుడు మూడు రోజుల క్రితం గచ్చిబౌలి నుంచి ఔటర్ మీదుగా టీఎస్‌పీఏ (అప్పా) వరకు వెళ్లారు. నిబంధనల మేరకు ఈ రూట్‌లో ఒకసారి వెళితే రూ.20, వెళ్లివస్తే రూ.30 చెల్లించాలి. కానీ సదరు వాహనదారుడి ఖాతా నుంచి ఏకంగా రూ.80 కోత పడింది. దీనిపై సంస్థ ప్రతినిధులను నిలదీయగా ‘సారీ’ అంటూ చేతులు దులిపేసుకున్నారు.
కొద్దిరోజుల క్రితం మరో వాహనదారుడు గౌరెల్లి నుంచి ఘట్‌కేసర్ వరకు వెళ్లాడు. నిబంధనల మేరకు రూ.20 తీసుకున్నారు. కానీ తిరిగి అదేరోజు ఘట్‌కేసర్ నుంచి గౌరెల్లికి తిరిగి రాగా ఏకంగా రూ.115 వసూలు చేశారు. నిబంధనల మేరకు రిటర్న్ జర్నీకి రూ.10 చార్జీ చెల్లించాలి. ఒకవేళ నిర్ణీత సమయం మించితే వన్‌వే జర్నీ కింద రూ.20 తీసుకోవాలి.
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై టోల్ ట్యాక్స్ దోపిడీ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా టోల్ చార్జీలను వసూలు చేస్తున్నట్లు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుట్టుగా వాహనదారుల ఖాతాల్లోంచి కొట్టేస్తున్నట్లు నిర్వహణ సంస్థకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గట్టిగా నిలదీసిన వాళ్లకు 25 రోజుల గడువులోపు తిరిగి చెల్లిస్తామంటున్నారు.. కానీ సకాలంలో ఖాతాలో జమ కావడంలేదని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. 158 కి.మీ. ఔటర్ మార్గంలో రోజూ వేలాది మంది వాహనదారులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. అధికంగా వసూలు చేసినట్లు గుర్తించిన వాహనదారులకు మాత్రమే తిరిగి చెల్లిస్తామని చెబుతున్నారు. కానీచాలామంది తమకు తెలియకుండానే మోసపోతున్నారు.
హెచ్‌ఎండీఏ నియంత్రణ ఏమైనట్లు..
జాతీయ రహదారులపై విధించే టోల్ చార్జీల నిబంధనలే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్‌కు వర్తిస్తాయి. ఔటర్‌పై ప్రస్తుతం 21 ఇంటర్‌ఛేంజ్‌ల నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రింగ్‌రోడ్డును ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థకు ప్రభుత్వం టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో 30 ఏళ్ల లీజుకిచి్చంది. ఐఆర్‌బీ అనుబంధ సంస్థ అయిన ఐఆర్‌బీ గోల్కొండ సంస్థ టోల్ చార్జీలను వసూలు చేస్తోంది. నిబంధనల మేరకు హెచ్‌ఎండీఏ అనుమతితోనే టోల్ చార్జీలను పెంచుకొనేందుకు ఐఆర్‌బీకి అవకాశం ఉన్నా సొంతంగా పెంచేందుకు అవకాశం లేదు. ఐఆర్‌బీ అడ్డగోలుగా టోల్ వసూలు చేస్తున్నప్పటికీ హెచ్‌ఎండీఏ చర్యలు తీసుకోకపోవడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విచారిస్తాం
ఔటర్‌పై అధికంగా టోల్ వసూలు చేయడానికి వీల్లేదు. వాహనదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారిస్తాం. ఎక్కువ డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే తిరిగి వాళ్ల ఖాతాల్లో జమ అవుతాయి. – బీఎల్‌ఎన్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్, హెచ్‌ఎండీఏ
టోల్ దోపిడీ దారుణం
టోల్ ట్యాక్స్ దోపిడీ దారుణంగా ఉంది. అవకతవకలను వాహనదారులు గుర్తించినప్పుడు మాత్రమే తిరిగి చెల్లిస్తామని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ చాలామంది తమకు తెలియకుండానే నష్టపోతున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. – కేతిరెడ్డి కరుణాకర్‌రెడ్డి దేశాయ్, వాహనదారుడు
Comments
Please login to add a commentAdd a comment