సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీ హాస్టళ్లలోని దాదాపు 3 లక్షల మంది విద్యార్థుల సౌకర్యాలపై ఎవరికీ ధ్యాస లేకుండా పోయింది. ఇటు ఇంటర్మీడియెట్ బోర్డు, అటు యాజమాన్యాలు విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరో ఒక విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినపుడు బోర్డు అధికారులు మేమున్నామంటూ యాజమాన్యాల వద్దకు వెళ్లడం, వారిచ్చే మామూళ్లతో సరిపుచ్చుకోవడం, ఆ తరువాత మిన్నకుండిపోవడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు హాస్టళ్లకు గుర్తింపు ఇస్తామంటూ చెప్పిన ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులే అడ్డగోలు ఫీజులను నిర్ణయించి, యాజమాన్యాలు కోర్టుకు వెళ్లేలా చేశారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హాస్టళ్లలో సదుపాయాల కల్పనకు, విద్యార్థులకు మేలు చేసేందుకు చర్యలు చేపట్టకుండా, గుర్తింపు ఫీజు వ్యవహారాన్ని వివాదంగా మార్చేసి, విద్యార్థులకు సంబంధించిన సమస్యలను పక్కదోవ పట్టించినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వివాదాస్పదంగా ఇంటర్ బోర్డు వైఖరి
రాష్ట్రంలో ఇంటర్ బోర్డు వైఖరి ప్రతి విషయంలో వివాదాస్పదంగానే ఉంటోంది. అనుబంధ గుర్తింపు, కంప్యూటర్ ప్రాసెసింగ్ ఏజెన్సీ ఖరారు.. ఇపుడు కాలేజీ హాస్టళ్ల గుర్తింపు.. ఇలా ప్రతి విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మామూళ్ల కోసం తాము అనుకున్నదే నిర్ణయంగా అమలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాలేజీ హాస్టళ్ల గుర్తింపునకు ఖరారు చేసిన ఫీజు అసంబద్ధంగా ఉందని యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. అంతమొత్తాన్ని చెల్లించలేమని, పైగా హాస్టళ్లను నియంత్రించే అధికారమే బోర్డుకు లేదని కోర్టులో సవాలు చేశాయి. దీంతో బోర్డు అధికారులు ముందుగా నిర్ణయించిన ఫీజుల ను సగానికి తగ్గించారు. అయినా యాజమాన్యాలు వినడం లేదు. ఇంకా తగ్గిస్తేనే కోర్టులో వేసిన కేసును విత్‌డ్రా చేసుకుంటామంటున్నాయి. ఆ ఫీజలను తగ్గించేందుకు బోర్డు సిద్ధమైంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసింది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అయితే ఫీజులే కాదు విద్యార్థుల సమస్యల పరిష్కారం, సదుపాయాల కల్పన విషయంలోనూ రాజీ పడేందుకు సిద్ధమైనట్లు తల్లిదండ్రుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఏటా ఇన్‌స్పెక్షన్, అనుమతి ఫీజులు..
మొదట నిర్ణయించినవి..
- కార్పొరేషన్ పరిధిలో ఇన్‌స్పెక్షన్‌కు ఏటా రూ. 80 వేలు. అనుమతికి రూ. లక్ష.
- మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇన్‌స్పెక్షన్‌కు రూ. 60 వేలు, అనుమతికి రూ. 80 వేలు.
- గ్రామ పంచాయతీల్లో ఇన్‌స్పెక్షన్‌కు రూ. 50 వేలు, అనుమతికి రూ. 60 వేలు.
తరువాత తగ్గించినవి..
- కార్పొరేషన్లలో ఇన్‌స్పెక్షన్‌కు రూ. 55 వేలు. అనుమతికి రూ. 65 వేలు.
- మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో.. ఇన్‌స్పెక్షన్‌కు రూ. 40 వేలు, అనుమతికి రూ. 50 వేలు.
- గ్రామ పంచాయతీల్లో ఇన్‌స్పెక్షన్‌కు రూ. 30 వేలు, అనుమతికి రూ. 40 వేలు.
యాజమాన్యాల తాజా డిమాండ్..
- కార్పొరేషన్ పరిధిలో ఇన్‌స్పెక్షన్‌కు రూ. 25 వేలు, అనుమతికి రూ. 30 వేలు.
- మున్సిపాలిటీ , నగర పంచాయతీల్లో ఇన్‌స్పెక్షన్‌కు రూ. 20 వేలు. అనుమతికి రూ. 25 వేలు.
- గ్రామ పంచాయతీ పరిధిలో ఇన్‌స్పెక్షన్‌కు రూ. 10 వేలు, అనుమతికి రూ. 15 వేలు.
- ఇవే కాకుండా హాస్టళ్లలో ప్రతి విద్యార్థికి 50 ఎస్‌ఎఫ్‌టీ స్థలం ఉండాలన్న నిబంధనను 30 ఎస్‌ఎఫ్‌టీకి పరిమితం చేయాలని, వార్డెన్లకు పోలీసు క్లియరెన్స్, ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్లను మినహాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. హాస్టల్ ఫీజుల నిర్ణయంలో బోర్డు జోక్యం చేసుకోవద్దని పేర్కొంటున్నాయి.
ఇదీ ఫీజుల పరిస్థితి..
మొదట నిర్ణయించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు..
- 50 మంది వరకు.. రూ. 4 లక్షలు.
- 51 నుంచి 200 మంది విద్యార్థులుంటే.. రూ. 8 లక్షలు.
- 201 నుంచి 500 విద్యార్థులుంటే రూ. 12 లక్షలు.
- 500 కంటే ఎక్కువ ఉంటే రూ. 16 లక్షలు.
తగ్గించిన ఫీజులు..
- 50 మంది విద్యార్థుల వరకు.. 2 లక్షలు.
- 51 – 100 మందికి.. రూ. 3 లక్షలు.
- 101 – 200 మందికి రూ. 4 లక్షలు.
- 201 – 300 మందికి రూ. 5 లక్షలు.
- 301 – 400 మందికి రూ. 6 లక్షలు.
- 401 – 500 వరకు రూ. 7 లక్షలు.
- 501 కంటే ఎక్కువుంటే రూ. 8 లక్షలు.
యాజమాన్యాల తాజా డిమాండ్..
- 200 మంది వరకు రూ. లక్ష.
- 201 – 500 వరకు రూ. 2 లక్షలు
- 501 కంటే ఎక్కువుంటే రూ. 3 లక్షలు.
Comments
Please login to add a commentAdd a comment