హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో భారీ జలాశయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సుమారు 1.5 లక్షల గ్యాలన్ల సామర్థ్యం కలిగిన సంపు, లక్ష లీటర్ల ఓవర్‌హెడ్ రిజర్వాయర్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా సర్కారు అంగీకారం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు పాండుయాదవ్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, జలమండలి అధికారులు ఇక్రిశాట్ ఫేజ్-2లోని స్థలాన్ని ఇందుకోసం పరిశీలించారు. అంతేకాకుండా ఓల్డ్‌బోయిన్‌పల్లిలోని ట్రెంచింగ్ గ్రౌండ్ స్థలంలో మరో భారీ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.