కొనుగోళ్లలో లక్ష్యం చేరేనా?
* నీరసించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం జరుపుతున్న ధాన్యం కొనుగోళ్లు నిర్దిష్ట లక్ష్యాలను చేరేలా కనిపించడం లేదు. కొనుగోళ్లు ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు 9 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ ఆరంభమైన నేపథ్యంలో ఇంకా దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు కష్టమేనని తెలుస్తోంది. రాష్ట్రంలో బియ్యం లెవీని 75 శాతం నుంచి 25 శాతానికి తగ్గించిన దృష్ట్యా మిల్లర్లు కొనుగోళ్లను తగ్గించే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం తానే స్వయంగా కొనుగోళ్లు చేసేందుకు సంకల్పించింది.
14.87 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న పౌర సరఫరాల శాఖ ఇందుకోసం 2,130 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు విస్తీర్ణమే 25శాతం తగ్గగా... విద్యుత్ కోతలు, నీటి నిల్వలు అడుగంటడంతో ధాన్యం ఉత్పత్తీ ఆశించినమేర రాలేదు. ఇదిలాఉండగా, బియ్యం లెవీని తగ్గించినా మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు ప్రభుత్వంతో పోటీపడి బహిరంగ మార్కెట్‌లో కొనుగోళ్లు జరిపారు. ప్రభుత్వ రంగ సంస్థల మాదిరే మద్దతు ధర చెల్లించారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా 9 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోళ్లు జరపగా, మిల్లర్లు సైతం మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిపినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో ఆన్‌లైన్‌లో మద్దతు ధర చెల్లించడంలో ప్రభుత్వం చేసిన జాప్యం సైతం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించేందుకు కారణంగా చెబుతున్నారు.
ఇక వరిసాగు ఆశించిన మేర జరగని ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా నీరసించిపోయాయి. రెండు జిల్లాల్లో మొత్తం కొనుగోళ్లను కలుపుకున్నా 50 వేల మెట్రిక్ టన్నులకు మించలేదు.
ఖరీఫ్ ఆలస్యంగా మొదలైన చోట ప్రభుత్వం మరిన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అంచనా వేసినా అది లక్ష మెట్రిక్ టన్నులను మించి ఉండడం సాధ్యం కాదని పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొనుగోళ్లు పూర్తిగా ముగిసిన అనంతరం కారణాలపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి.