సాక్షి, మెదక్: రైతుబీమా పథకం అన్నదాత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. జిల్లాలోని వేలాది మంది రైతులకు మేలు జరుగనుంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది మరికొందరు కొత్తగా ఈ బీమాపథకంలో చేరే అవకాశం ఉంది. ఆ దిశగా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులు ప్రమాదవశాత్తు లేక ఏదైనా కారణంతో చనిపోతే వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల తరఫున ఎల్‌ఐసీకీ బీమా ప్రీమియం చెల్లించి రూ. 5 లక్షల బీమా మొత్తాన్ని తక్షణం అందించేలా ఈ పథకాన్ని గత ఏడాది ప్రవేశపెట్టింది. రైతు కుటుంబంలో భరోసా పెంచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని మరో ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియం పెరిగిన ప్రభుత్వం పథకం అమలును కొనసాగిస్తుంది. గతేడాదికి సంబంధించి బీమా గడువు ఈనెల 14తో ముగిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 14వ తేదీ కాలపరిమితికి ప్రీమియం రూపంలో ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.3457 చొప్పున ప్రీమియం చెల్లిస్తోంది. భూములు కలిగిన వారికి ఈ నెల 14 నుంచి 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు రైతుల పేర్లను నమోదు చేస్తున్నారు. ఇది నిరంతర పక్రియగా కొనసాగనుంది.
615 మంది రైతు కుటుంబాలకు పరిహారం
జిల్లాలో మొత్తం 2.20 లక్షల మంది రైతులు ఉండగా వారిలో బీమా పథకానికి అర్హులైన వారు 1.8 లక్షల మందిరైతులు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో 675 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా వారిలో 615 మంది రైతులకు రూ.30.7 కోట్లు పరిహారం చెల్లించారు. ఇంకా 60 మంది రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది.
యువరైతుల నమోదు ఇలా...
రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకునే వారు 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల లోపు ఉండాలి. 18 ఏళ్లు నిండిన యువరైతుల పేర్లు నమోదు చేస్తారు. వీరు స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి రైతుపట్టాపాస్‌బుక్ జిరాక్స్‌తో పాటు ఆధార్ కార్డు ఇస్తే సంబంధిత అధికారులు రైతుబీమాలో నమోదు చేసుకోవాలి.ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఈ పథకం ఒక్క ఏడాదితో ఆగేదికాదు గతేడాది ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఏడు సైతం దాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఇది నిరంతర పక్రియగా కొనసాగుతోంది. 18 ఏళ్లు నిండిన రైతులు వారి పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
– జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్
Comments
Please login to add a commentAdd a comment