
అసెంబ్లీలో ఆమె
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి: లక్ష్మణ్ గారూ... మీ ప్రసంగం త్వరగా ముగించాలండీ... సమయం మించిపోతోంది.
బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్: అధ్యక్షా... గౌరవ మంత్రి వర్యులు హరీష్‌రావు గారు అవసరమైతే 50 గంటలు 100 గంటలు సభ కొనసాగిద్దాం అని చెప్పారు. మీరేమో సమయం మించి పోతుంది అంటున్నారు. మేం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి..! (కొంత ఆవేశం... మరికొంత వెటకారంతో)
ఉప సభాపతి: మీ తర్వాత చాలా మంది గౌరవ సభ్యులు ఉన్నారు.. వాళ్ల సలహాలు, సూచనలు కూడా వినాలి కదా... మొత్తం మీరే మాట్లాడుతా అంటే ఎలా?
లక్ష్మణ్: లేదు అధ్యక్షా... ముగించేస్తున్నా....
ఇది మంగళవారం శాసనసభలో జరిగిన ఓ సన్నివేశం. మంగళవారం పద్మాదేవేందర్‌రెడ్డి ఆద్యంతం అన్నీ తానై సభ నడిపించారు. శాసనసభ సంప్రదాయాలను పాటిస్తూ...ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి స్వపక్ష, విపక్షాలను సమన్వయం చేశారు. ఈ నెల 5న ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభలో తనకు అవకాశం వచ్చిన సమయంలో వాదోపవాదనలు... గందరగోళం మధ్య విలువైన సభాసమయం క్షణం కూడా వృథా కాకుండా అర్థవంతంగా సభను నడిపిస్తున్నారు.
బంగారు తెలంగాణ కోసం ప్రతి సభ్యుని మదిని తడిమి చూసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం విపక్షాల అభిప్రాయాలను గౌరవిస్తూ...నిర్మాణాత్మకమైన చర్చకు స్వాగతం పలుకుతూ...వినూత్నమైన సాంప్రదాయానికి తెరలేపారు.
కొంత ఉత్కంఠత ఉంది
సీనియర్ల మధ్య సభ నిర్వహించడం కొంత ఉత్కంఠగా ఉన్నా, బాగానే ఉంది. తొలి అసెంబ్లీ సమావేశాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్థాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సమస్యలపై మాట్లాడే అవకాశం ఉండేదే కాదు, ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం తెలంగాణపై అర్థవంతమైన చర్చ కొనసాగుతోంది. ప్రతిపక్షాలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాయి. వాళ్లిచ్చే సలహాలు కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం, అంతా కలిసి ఐక్యంగా నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర అభివృద్ధిని సాధిస్తాం.
విద్యుత్ సమస్యపై 7 గంటలపాటు ఏకధాటిగా చర్చ కొనసాగింది. విద్యుత్ సమస్య అధికమించడానికిప్రతిపక్షాలు ఇచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించాం. విద్యుత్ సమస్యపై అఖిల పక్షంతో కలిసి త్వరలోనే కేంద్రం వద్దకు వెళ్తాం. తెలంగాణ ప్రజల కష్టాలను వివరించే ప్రయత్నం చేస్తాం. - పద్మాదేవేందర్‌రెడ్డి,డిప్యూటీ స్పీకర్