
పాలమూరు పరవశించాలె
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ‘తెలంగాణ ఉద్యమంలో జిల్లాకు చెందిన బిడ్డ సువర్ణతో పాటు అనేక మంది బలిదానాలు చేశారు. లాఠీదెబ్బలు తిని జైళ్లకు వెళ్లారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
‘తెలంగాణ ఉద్యమంలో జిల్లాకు చెందిన బిడ్డ సువర్ణతో పాటు అనేక మంది బలిదానాలు చేశారు. లాఠీదెబ్బలు తిని జైళ్లకు వెళ్లారు. ఎంతో ఆదరణతో నన్ను ఇక్కడ నుంచి ఎంపీగా గెలిపించారు. మహబూబ్‌నగర్ ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించా. మహబూబ్‌నగర్ నా గుండెల్లో ఉంది, చెరువులు, కుంటలు, పచ్చదనం, పారిశ్రామిక విధానంతో జిల్లా అద్భుత ప్రగతి సాధించాలి. నిరుద్యోగ భూతం పారిపోయి జిల్లా ముఖ చిత్రం మారిపోవాలి. పాలమూరు గడ్డమీద నిలబడి చెప్తున్నా, నాలుగైదు ఏళ్లలో పాలమూరు పరవశించి పులకించి పోతుంది. పచ్చని పంటలతో తులతూగుతుంది’ అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. అడ్డాకుల మండలం వేముల, కొత్తూరు మండలం పెంజర్ల శివారులో గురువారం జరిగిన మూడు ప్రైవేటు పరిశ్రమల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మహబూబ్‌నగర్ జిల్లాలో 34,184 ఎకరాలు భూమి పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉంది. ఇందులో సుమారు 13,500 ఎకరాలు ఇప్పటికిప్పుడు పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉంది. ప్రయత్నం చేస్తే జిల్లాకు రూ.50వేల కోట్ల నుంచి రూ.80వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముంది’ అని సీఎం వెల్లడించారు. ‘నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఎత్తిపోతల ప థకాలకు వచ్చే బడ్జెట్‌లో రూ.800 కోట్లు కేటాయిస్తే వచ్చే యేడాది జూన్ నాటికి ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు. రూ.1100 కోట్లు ఇచ్చేందుకైనా సిద్ధం. జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తే కర్నాటక కూలీలు పాలమూరు వరి పొ లాల్లో కోతలకు వస్తారు’ అంటూ సీఎం తన స్వప్నాన్ని ఆవి ష్కరించారు. ‘జూరాల- పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకాల సర్వే కోసం సుమారు రూ.11కోట్లు విడుదల చే శాం. త్వరలో నివేదికలు రానున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లి వద్ద 10 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించే రిజర్వాయర్ నుం చి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందిస్తాం. జిల్లాలో దెబ్బతిన్న 6100 చెరువులు, కుంటలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తాం.
నిరుద్యోగ భూతాన్ని తరిమేద్దాం
‘జిల్లాలో రూ.200కోట్లతో కోజెంట్ గ్లాస్, రూ.450 కోట్లతో జాన్సన్ అండ్ జాన్సన్, రూ.900కోట్లతో ప్రాక్టర్ అండ్ గాంబుల్ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. భవిష్యత్తులో ఈ పరిశ్రమలు విస్తరించే అవకాశముంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే పెంజర్లలో పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేసేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధంగా ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు స్థానికులు, అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలి. పరిశ్రమల నిర్వాహకులు కూడా తప్పనిసరిగా అర్హత ఉన్న స్థానికులకు నిబంధనల మేరకు ఉద్యోగాలు కల్పించాలని’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డితో పాటు టీఆర్‌ఎస్ నాయకులు, కలెక్టర్ ప్రియదర్శిని, జేసీ శర్మన్ తదితరులు పాల్గొన్నారు.
అతిథుల ఆకలి కేకలు..!
కేసీఆర్ సమావేశానికి వచ్చిన అతిథులు ఆకలితో అలమటించారు. సమావేశం అనంతరం భోజనాల కోసం వెళ్లగా అక్కడ భోజనం అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల నాయకులు, కార్యకర్తలు ఆకలితో తిరుగు ముఖం పట్టారు. విధుల్లో ఉన్న పోలీసులు కూడా భోజనాలు లేక ఇబ్బంది పడ్డారు. .
పాసుల కోసం పడిగాపులు
పాసుల కోసం వీఐపీలు కూడా పడిగాపులు పడ్డారు. పరిశ్రమ లోపలికి కొద్దిమందికే వెళ్లే అవకాశం రావడంతో చాలామంది గేటు వద్దకు వచ్చి నిరాశగా వెనుదిరిగారు. సీఎం కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వచ్చిన విలేకరులను పాసులు లేవని గంటల తరబడి పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి చొరవ తీసుకుని పాసులను పంపడంతో లోపలికి వెళ్లగలిగారు. జర్నలిస్టులకు పాసులు ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.