► రూ.27 వేల కోట్ల పనులకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల ఆరంభానికి నేడో, రేపో తొలి అడుగు పడనుంది. ప్రాజెక్టు టెండర్ నోటిఫికేషన్ సోమవారంగాని, మంగళవారంగాని విడుదల కానుంది. మొత్తంగా 18 ప్యాకేజీలకుగానూ రూ.27 వేల కోట్ల పనులు చేసేందుకు అధికారులు టెండర్లు ఆహ్వానించనున్నట్లుగా తెలిసింది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 14 రోజులపాటు కాంట్రాక్టు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 62 మండలాల్లో 1,131 గ్రామాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ.35,200 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల అంచనాలు సైతం ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇక సివిల్, ఎలక్ట్రోమెకానికల్ పనులను విభజించాలన్న సూచనను పక్కన పెట్టి, అన్ని పనులకు ఒకే టెండర్ పిలవాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు టెండర్ పనులను రెండువారాల్లో పూర్తి చేయాలని గత సమీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దానికి అనుగుణంగా కదలిన అధికారులు ప్యాకేజీల్లో చిన్న, చిన్న మార్పులు చేసి టెండర్ల ప్రక్రియకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రానికి సాంకేతిక అంశాలను సరి చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు నిర్ణయం చేశారని ఉన్నతాధికార వర్గాల ద్వారా తెలిసింది.