‘హమాలీ' సొమ్ము హాంఫట్ | Palamuru University, the first snatakotsavana, ESL Narasimhan | Sakshi
Sakshi News home page

‘హమాలీ' సొమ్ము హాంఫట్

Published Sat, Nov 29 2014 3:45 AM | Last Updated on Fri, Aug 17 2018 7:42 PM

‘హమాలీ' సొమ్ము హాంఫట్ - Sakshi

‘హమాలీ' సొమ్ము హాంఫట్

మద్యం డిపోలో హమాలీ పోస్టుల కుంభకోణం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒక్కో హమాలీ పోస్టుకు రూ.16లక్షల చొప్పున 26 మందికి ఉద్యోగాలిచ్చేందుకు ఏకంగా రూ.4.16 కోట్లు వసూలు చేయడం చర్చనీయాంశమైంది. హమాలీ పోస్టుకు ఇంత డబ్బులివ్వడమేంట ని జనం విస్తుపోతుండగా... అంత డబ్బు ముట్టజెప్పేందుకు వెనుకాడలేదంటే ఆ పోస్టులో పెద్ద కిక్కే ఉందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

హమాలీల నియామకాల్లో వసూళ్ల పర్వానికి తెరదీసిందెవరు.. వసూలైన మొత్తంలో ఎవరెవరికి వాటాలు దక్కాయనే అంశంపై ఆరా తీస్తే విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. వసూళ్లకు ఓ సూపర్‌వైజర్ సూత్రధారి కాగా.. అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ఇందులో వాటాదారులు కావడం విశేషం. వాటాల్లో అభిప్రాయభేదాలు రావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. కంగుతిన్న సూత్రధారులు ఈ విషయం బయటకు రావడానికి కారకుడైన నాయకుడిని ‘సంతృప్తి’ పర్చేందుకు రంగంలోకి దిగారు.
 -కరీంనగర్‌క్రైం

 
 కరీంనగర్ క్రైం : ‘హమాలీ' పోస్టుందా...పెళ్లికి రెడీ! జిల్లాలో 304 వైన్స్‌లు, 45 బార్లున్నాయి. వీటికి మద్యం సరఫరా చేయడానికి జిల్లా కేంద్రంలోని డీర్ పార్క్ వద్ద మద్యం డిపోను ఏర్పాటు చేశారు. ఇక్కడినుంచి ప్రతిరోజు రూ.కోట్ల విలువైన మద్యం ఎగుమతి, దిగుమతి అవుతుంది. వీటిని దింపడానికి మొత్తం 80 హమాలీలు పనిచేస్తున్నారు. వీరంతా దినసరి కూలీలే.

అయితేనేం... ఒక్కో హమాలీ రోజుకు సగటున రూ.2,500 సంపాదిస్తారు. పండగ సీజన్‌లో అయితే సంపాదన రెట్టింపుగా ఉంటుంది. దీనికితోడు హమాలీలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మిగి లిన హమాలీలంతా తలా ఇంత వేసుకుని రూ.లక్షలు సాయం చేశారు. ఎవ రైనా హమాలీ పని మానేస్తే అతని స్థానంలో కొత్తగా చేరేవారు రూ.16ల క్షలు ఇవ్వాల్సిందే.

ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశమేమిటంటే... సంపాదనకు ఢోకా లేకపోవడంతో సదరు హమాలీకి పిల్లనిచ్చేం దుకు సింగరేణిలో పనిచేసే ఉద్యోగులు ఎగబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగికి పిల్లనిచ్చేందుకు ఏవిధంగా ఆసక్తి చూపుతారో... దాదాపు అదే స్థాయిలో హామాలీకి డిమాండ్ ఉంటోంది.

 సూపర్‌వైజరా... మజాకా...!
 లిక్కర్ డిపోలో హమాలీ పోస్టుకు ఇంత క్రేజీ ఉండటంతో చాలా మంది యువకులు క్యూలో నిలబడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఓ సంస్థకు చెందిన సూపర్‌వైజర్ దీనిని క్యాష్ చేసుకునేలా పథకం వేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న 80 మంది హమాలీలపై పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున మరో 26 మందిని నియమిం చుకుందామని లిక్కర్‌డిపో అధికారులకు ప్రతిపాదించాడు.

దీనికి పై అధికారులు కూడా సై అనడంతో హమాలీ పోస్టు కోసం ఒక్కో వ్యక్తి నుంచి రూ.16 ల క్షలు వసూలు చేశాడు. ఈ లెక్కన 26 మంది వద్ద రూ.4.15 కోట్లు తీసుకున్నారు. సదరు సూపర్‌వైజర్‌కు ఇలా డబ్బులు వసూలు చేయడం ఇదేమీ కొత్త కాదని తెలిసింది. గతంలో ఈ సూపర్‌వైజర్ పనిచేసిన పలు డిపోల్లోనూ ఇలాంటి దందానే నడిపించాడని సమాచారం. ఏ డిపోలోనైతే పనిచేస్తున్నాడో ఆ డిపోలో కొత్తగా హమాలీలను నియమించుకునే వరకు మాత్రమే సదరు సూపర్‌వైజర్ అక్కడ కొనసాగతారని తెలుస్తోంది.

హమాలీ పోస్టులకు డబ్బులు వసూలు చేసి ఎవరి వాటాలను వారికి పంచిన కొద్దిరోజుల తరువాత మరో డిపోకు బదిలీ చేసుకుని వెళుతుంటాడని తెలిసింది. ఎందుకంటే అక్కడ మళ్లీ కొత్తగా హమాలీ పోస్టుల నియామకం దందాకు తెరలేపుతారని సమాచారం. ఇప్పటివరకు సదరు సూపర్‌వైజర్ దాదాపు వంద మందిని వివిధ లిక్కర్ డిపోల్లో నియమించి రూ.కోట్లు దండుకుంటున్నట్లు తెలిసింది.

 పాత హమాలీలకు డబ్బు ఎర
 కొత్త హమాలీలొస్తే తమ సంపాదన తగ్గిపోతుం దని భావించిన పాత హమాలీలు వారి రాకను తొలుత అడ్డుకున్నారు. అయితే ఇలాంటి వ్యవహారాలను చక్కదిద్దడంలో అందెవేసిన సదరు సూపర్‌వైజర్ లిక్కర్ డిపోకు చెందిన ఇద్దరు అధికారులతో కుమ్కకై పాత హమాలీలకు డబ్బు ఎర చూపినట్లు తెలిసింది.

ఒక్కో పాత హమాలీకి రూ.3లక్షల చొప్పున మొత్తం 80 మంది హమాలీలకు రూ.2.4 కోట్లు ముట్టజెప్పేందుకు సిద్ధమయ్యారు. తొలుత హమాలీలంతా అమాయకంగా ఒప్పుకున్నప్పటికీ చివర్లో దీనిని వ్యతిరేకించడంతోపాటు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

 బెడిసికొట్టిందిలా...
 ఇంతవరకు గుంభనంగా సాగిన వ్యవహారం వాటాల్లో తేడాలు రావడంతో ఓ ప్రజాప్రతినిధి దీనిని బయటకు చేరవేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సదరు ప్రజాప్రతినిధి కూడా లిక్కర్ డిపోలో హమాలీగా నియమిస్తానంటూ ఇద్దరు వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకున్నటు తెలిసింది.

అయితే ఆ ఇద్దరిలో  ఏ ఒక్కరినీ హమాలీగా నియమించుకునేందుకు సిద్ధంగా లేకపోవడం, వాటా చెల్లింపులోనూ వివక్ష చూపడంతో తట్టుకోలేని సదరు ప్రజాప్రతినిధి వ్యూహాత్మకంగా బయటపెట్టడం, పాత హమాలీలు జత కట్టడంతో వివాదాస్పదమైంది.

 ‘సంతృప్తి' దిశగా చర్చలు
 హమాలీ పోస్టుల వసూళ్లపర్వం వివాదాస్పదం కావడంతో కంగుతిన్న సూత్రధారులు నష్టనివారణ చర్యల్లో పడ్డారు. అందులో భాగంగా విషయాన్ని బయట పెట్టిన ప్రజాప్రతినిధితో శుక్రవారం చర్చలు మొదలు పెట్టారు. ఇందుకోసం ఓ మధ్యవర్తిని పంపి సంతృప్తికరస్థాయిలో సదరు ప్రజాప్రతినిధికి మంచి ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ వివాదం బయటకు పొక్కడంతో దీనిపై అధికారులు ప్రత్యేక నిఘా వేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement