పాలమూరుకు సేవచేయడం నా అదృష్టం | palmuru collector sakshi interview | Sakshi
Sakshi News home page

పాలమూరుకు సేవచేయడం నా అదృష్టం

Published Mon, Jul 7 2014 2:51 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

పాలమూరుకు సేవచేయడం నా అదృష్టం - Sakshi

పాలమూరుకు సేవచేయడం నా అదృష్టం

- వందరోజుల ప్రణాళికతో సమస్యలకు పరిష్కారం
- రెండేళ్లు పూర్తిచేసుకున్న కలెక్టర్
కలెక్టరేట్: ‘జిల్లా అన్నిరంగాల్లో వెనుకబడిపోవడం కొంత విచారమే.. అభివృద్ధి చేసేందుకు కావాల్సిన వనరులు ఉన్నాయి. దీనికితోడు ప్రేమ ఆప్యాయతలు కలిగిన ప్రజలున్న పాలమూరు జిల్లాకు కలెక్టర్‌గా సేవచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా..’అని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు.  జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆదివారంతో రెండేళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు.  

రెండేళ్ల పాలన రెండురోజులా గడిచిపోయిందని, అవకాశం ఉంటే ఇక్కడే సేవచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను జిల్లాకు వచ్చిన కొత్తలో అన్నిశాఖల్లో ఖాళీలతోపాటు పెండింగ్ సమస్యలతో కొంత ఇబ్బంది కలిగిందని, వాటిపై దృష్టిసారించడంతో 80శాతం పురోగతి సాధించామన్నారు. ప్రతీశాఖకు విధించిన వందరోజుల ప్రణాళికతో చాలా ఫలితాలు వచ్చాయన్నారు. ఆయన పాలనానుభవాలు కలెక్టర్ మాటల్లోనే..
 
సాక్షి: రెండేళ్లలో పరిష్కరించిన ముఖ్యమైన సమస్యలేవి?
కలెక్టర్
: ప్రారంభంలో 800కు పైగా గ్రామాల్లో తాగునీటిసమస్య ప్రధానంగా ఉండేది. దీనిపై ప్రత్యేక దృష్టిసారించడంతో పరిష్కరించగలిగా..ఇప్పుడు కేవలం 68 గ్రామాల్లో మాత్రమే ఆ సమస్య ఉంది. దీన్ని కూడా అధిగమించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం.
 
సాక్షి: ముఖ్యమైన రంగాల్లో సాధించిన ప్రగతి ఏమిటి?
కలెక్టర్:
డీఆర్‌డీఏ శాఖను ముందుకు తీసుకొచ్చేందుకు కొత్త ప్రణాళికను సిద్ధంచేశాం. మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.737కోట్ల రుణాలు ఇప్పించి ప్రథమస్థానంలో నిలిచాం. అదేవిధంగా ఇళ్లనిర్మాణంలో 19వ స్థానంలో ఉన్న జిల్లా నాలుగోస్థానంలో నిలబెట్టాం.
 
సాక్షి: జిల్లా అభివృద్ధికి తీసుకున్న ప్రత్యేకచర్యలు ఉన్నాయా?
కలెక్టర్:
జిల్లా పరిస్థితులను చూశాక బాధేసింది. ఇందుకోసం వెంటనే ప్రతీ శుక్రవారం ‘పల్లెవికాసం’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతీగ్రామానికి అన్ని శాఖల అధికారులను పంపించి సమస్యలు పరిష్కరించాను. అలాగే ‘పాలమూరు పచ్చదనం’ కార్యక్రమంతో 10 లక్షల మొక్కలు నాటాం.. ‘మన ఊరు- మన పీహెచ్‌సీ’ కార్యక్రమంతో గ్రామాల్లోని ప్రతీ ఇంటికి వైద్యాన్ని తీసుకెళ్లాం.

దీంతోపాటు పాలమూరు సేవాట్రస్ట్‌తో విరాళాలు సేకరించి 30 మంది పేద ఆడపిల్లలకు ఉన్నత విద్యను అందించేందుకు ఆర్థిక సహాయం అందించాం. రెవెన్యూశాఖపై బాగా కసరత్తు చేశా. పెండింగ్ సమస్యలతోపాటు రికార్డుల నిర్వాహణ, ఆన్‌లైన్ విధానాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చా. ఇప్పు డు రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డుల నమో దు ‘ఆన్‌లైన్’లో జరిగేలా చేస్తున్నాం.
 
సాక్షి: జిల్లాలో మిగిలిపోయిన కార్యక్రమాలు ఏమైనా?
కలెక్టర్:
సోలార్ పవర్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గట్టు, ధరూర్ మండలాల్లో ఐదువేల ఎకరాల భూమిని సిద్ధంచేశాం. ఆ భూమిలో ఎవరైనా ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తే జిల్లాకు 24గంటల పాటు అక్కడినుంచే విద్యుత్‌ను అందించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ నిర్ణయం కావడంతో పెండింగ్‌లోనే ఉండిపోయింది.
 
సాక్షి: రాజకీయపరమైన ఒత్తిళ్లను ఎలా అధిగమించారు?
కలెక్టర్:
ఒత్తిళ్లు సహజం. కానీ వాటికి లోనుకాకుండా నిబంధనల ప్రకారం నడుచుకున్నా.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేశాను.
 
సాక్షి: ఈ ఏడాది ఏ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు?
కలెక్టర్:
ప్రధానంగా  ఎస్సీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన వారందరికీ అందించేందుకు కృషిచేస్తున్నా.. జిల్లాలో ఉన్న వనరులను వినియోగంలోకి తెచ్చి ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నా..వాటిని కచ్చితంగా అమలుచేసి తీరుతాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement