పంచాయతీ నిధులకు ఫ్రీజింగ్
- నిలిచిన 14వ ఆర్థిక సంఘం, రాష్ర్ట ఆర్థిక సంఘం నిధులు
- {V>Ð]l*ÌZÏ అభివృద్ధి పనులకు ఆటంకం
- అప్పులు చేయాల్సి వస్తుందంటున్న సర్పంచులు
- పనులకు నిధుల గ్రహణం
- నిలిచిన ప్రభుత్వ నిధులు
- ఆందోళనలో సర్పంచులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న బోరుబావి చిప్పలపల్లి గ్రామంలో వేసినది. ఇటీవల చిప్పలపల్లిలో తాగునీటికి ఇబ్బందులున్నాయని సర్పంచ్ గాడిచెర్ల దేవయ్య విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ బోరుబావి మంజూరు చేయించి బోరు వేయించారు. అక్కడ టీఎఫ్‌సీ నిధులతో సర్పంచ్ దేవయ్య రూ.35వేలు వెచ్చించి బోరుమోటారు బిగించారు. ఇక మంచినీటి సరఫరా జరుగుతుందనగా.. మోటారు ఇచ్చిన కంపెనీ డీలర్ బిల్లు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. టీఎఫ్‌సీ నిధులు రూ. 35వేలు డ్రా చేసేందుకు సిరిసిల్ల ఎస్‌టీవోకు వెళ్లారు. అక్కడ టీఎఫ్‌సీ నిధుల చెల్లింపులు నిలిపివేశామని అధికారులు చెప్పడంతో సర్పంచ్ దేవయ్య ఖంగుతిన్నారు. ఇప్పుడెలా అంటూ అప్పు చేసైనా డీలర్‌కు బిల్లులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు.
పంచాయతీ కార్మికులు సమ్మెతో పల్లెల్లోని డ్రెయినేజీల్లో దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే మరోవైపు పంచాయతీ నిధుల విడుదలకు గ్రహణం పట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27వ తేదీ నుంచి పంచాయతీ నిధుల చెల్లింపులకు బ్రేక్ వేసింది. సిబ్బంది వేతనాలకు మాత్రమే గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ.. ఇతర పనులకు సంబంధించిన నిధుల విషయంలో ఫ్రీజింగ్ విధించింది.
ఆవేదన వ్యక్తం చేస్తున్న సర్పంచులు..
జిల్లాలో 1208 గ్రామాల పంచాయతీలకు నిధుల చెల్లింపులు నిలిపివేయడంపై సర్పంచులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల చెల్లింపులను ఎస్‌టీవోలు పూర్తిగా నిలిపివేశాయి. దీంతో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నామని చెప్పుకుంటున్నా పంచాయతీ నిధుల చెల్లింపులపై ఆంక్షలు విధించడం సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. 2011లో పంచాయతీ నిధులపై ఫ్రీజింగ్ విధించిన ప్రభుత్వం మరోసారి తెలంగాణ ఏర్పాటు అనంతరం మొదటిసారిగా చెల్లింపులపై ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అడుగడుగునా ఆటంకాలు..
టీఎఫ్‌ఎసీ, ఎస్‌ఎఫ్‌సీ నిధుల చెల్లింపులపై ఆంక్షలు ఉండడంతో పల్లెలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గడచిన పదిరోజుల్లో చెల్లింపులు నిలిచిపోవడంతో పలు అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా వీధిదీపాలు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, మురుగుకాల్వల నిర్వహణ తదితర పనులపై ప్రభావం చూపుతోంది. అసలే పంచాయతీ పారిశుధ్య సిబ్బంది సమ్మె చేస్తుండగా, మరోవైపు ట్రెజరీల్లో ఆంక్షలు విధించడం పంచాయతీ సర్పంచులపై పెనుభారం మోపుతోంది. మోటార్ల రిపేరు, వీధిదీపాల అమరిక వంటి అంశాలను సర్పంచులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. తక్షణమే ఫ్రీజింగ్ ఎత్తివేయాలని వారు కోరుతున్నారు.
ఫ్రీజింగ్ తక్షణమే ఎత్తివేయాలి
పంచాయతీలకు అసలే నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మరోవైపు ఫ్రీజింగ్ పెట్టడంతో నీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఎస్‌టీవో చుట్టూ నిత్యం తిరుగుతున్నాం. ఫ్రీజింగ్ తక్షణమే ఎత్తివేయాలి.
- గాడిచెర్ల దేవయ్య, సర్పంచ్, చిప్పలపల్లి