తెలంగాణ ఏర్పాటుపై కేరళీయుల ఆసక్తి
రాష్ట్ర ప్రభుత్వ పాలనను వివరించిన మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన అంశాలపై కేరళ పంచాయతీరాజ్ అధికారులు అమితాసక్తిని కనబరిచారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు వెళ్లిన మంత్రి జూపల్లి తన రెండ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం త్రిశూర్ జిల్లా వెంకిటంగు గ్రామపంచాయతీని సందర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ సాగించిన ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాలతో పాటు కొత్త రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారికి మంత్రి వివరించారు. కేరళ స్థానిక పరిపాలన శాఖ మంత్రి కేటీ జలీల్‌తోనూ జూపల్లి బృందం సమావేశమయింది. పర్యటనలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూకుమారి, జాయింట్ కమిషనర్ వెస్లీ ఉన్నారు.