‘ఆ కొడుకులు ఉన్నా ఒకటే.. పోయినా ఒక్కటే’ | Parents Of Accused Feeling Ashamed After Disha Murder In Mahabubnagar District | Sakshi
Sakshi News home page

ఇలాంటి కొడుకులను కన్నామా!?

Published Mon, Dec 2 2019 9:06 AM | Last Updated on Mon, Dec 2 2019 1:41 PM

Parents Of Accused Feeling Ashamed After Priyanka Murder In Mahabubnagar District - Sakshi

సాక్షి, నారాయణపేట: ‘ఇలాంటి కొడుకులను కన్నామా.. లోకమంతా అమ్మాయిని పాడు చేసి కాల్చారని చెబుతుంటే వినేందుకు గుండె జల్లుమంటుంది.. ఆ కొడుకులు ఉన్నా ఒకటే.. పోయినా ఒక్కటే..’ అంటూ జస్టిస్‌ ఫర్‌ దిశను దారుణంగా హత్య చేసిన వారికి ఏ శిక్ష పడినా బాధపడబోమని మహ్మద్‌పాషా, శివ, నవీన్‌కుమార్, చెన్నకేశవుల తల్లిదండ్రులు కన్నీరు పెట్టారు.

మరో నిందితుడు అంటూ హల్‌చల్‌..
‘జస్టిస్‌ ఫర్‌ దిశ’ హత్య కేసులో మరో నిందితుడు ఉన్నాడంటూ శనివారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అయింది. ఊట్కూర్‌ మండలంలోని చిన్నపొర్ల గ్రామానికి చెందిన వ్యక్తి ఉన్నరంటూ వదంతులు వచ్చాయి. దానిపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. ఆ మండల పోలీస్‌ బాస్‌ చిన్నపొర్లకు వెళ్లి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేరంటూ తెలింది. అయితే గుడిగండ్ల నవీన్‌కుమార్‌ చిన్నపొర్లలో వారి బంధువుల ఇంటా ఉండి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై తల్లి లక్ష్మిని ప్రశ్నించగా చిన్నపుడు చిన్నపొర్లలలో చదువుకున్నాడంటూ తెలిపింది.  

దేశమంతటా గుడిగండ్ల, జక్లేర్‌ మాటే.. 
జస్టిస్‌ ఫర్‌ దిశని హత్య చేసిన నిందితులు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల, జక్లేర్‌గ్రామాలకు చెందిన మహ్మద్‌పాషా, నవీన్‌కుమార్, చెన్నకేశవులు, శివలనే నిర్ధారణ అనంతరం పోలీసులు అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ జైలుకు పంపారు. ఈ సంఘటన దేశమంతటా కలకలం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాతో జాతీయ మీడియా సైతం జస్టిస్‌ ఫర్‌ దిశ హత్యకు సంబంధించిన వార్త కథనాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడంతో మారుమూల గ్రామాలైన గుడిగండ్ల, జక్లేర్‌ల పేర్లు దేశమందరి నోటా వినిపించినట్లయింది. రాయిచూర్‌ టూ హైదరాబాద్‌కు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు సైతం హత్యచేసింది ఇదే గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామ యువకులంటూ చెప్పుకున్నారు. ఈ సంఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లు వెంటనే ట్విట్‌ చేశారు. దీంతో జాతీయ నేతలు సైతం స్పందించడంతో ప్రతి ఒక్కరి నోటా ఇదే మాటా వినిపిస్తుంది. 

నేను బతికున్నా.. సచ్చినట్లు అనిపిస్తోంది
ఎప్పుడైతే పదో తరగతి ఫెయిల్‌ అయ్యాడో అప్పటి నుంచి నా కొడుకు గాడిదికిందపడేనప్పా.. అంటూ మహ్మద్‌పాషా అలీయాస్‌ ఆరీఫ్‌ తండ్రి హుస్సేన్‌ భార్య మౌలానీబీతో కలసి కన్నీరుపెట్టారు. ఏదో పెట్రోల్‌ బంకులో పనిచేస్తానంటే సరే అంటిమి.. లారీ డ్రైవర్లతో కూనమై హైదరాబాద్‌పాయే.. వాడు ఇంత లంగపనులు చేస్తాడని ఏ తండ్రి  అనుకుంటాడో చెప్పండి. దునియాల చాలా మంది లారీ డ్రైవర్లుగా పనిచేస్తుండ్రు... కానీ ఇలా చేశారని నేను ఎక్కడ వినలేదబ్బా. నాకు ఒక బిడ్డా ఉంది. ఆ ఆడపిల్లను కాల్చిచంపిండు అని వినగానే నేను బతికున్నా సచ్చినట్లు అనిపిస్తోందబ్బా. నీ కొడుకు కేసు మీదా సంతకం చేయమని చెప్పి షాద్‌నగర్‌ పోలీసులు చెబితే శనివారం వెళ్లా. వారు ఇచ్చిన కాగితాలపై సంతకాలు పెట్టా. బయట ఎక్కడ చెప్పొద్దు తండ్రివని చంపుతారని పోలీసులు చెప్పారు. నన్ను టోల్‌ప్లాజా దగ్గర వదిలిపెట్టారు. అక్కడి నుంచి ఊరికి వచ్చా. – మహ్మద్‌ పాషా తండ్రి హుస్సేన్‌ ఆవేదన 

నా కొడుకని చెప్పుకొనేందుకు పానం ఒప్పడం లేదు
నా కొడుకు శివ అని చెప్పుకునేందుకు పానం ఒప్పడం లేదు. వాడు చేసిన పనికి ఉరితీసిన పోను.. కోర్టుకు పిలిచిన వెళ్లను అంటూ తండ్రి గొర్రెల కాపరి రాజప్ప గొల్లుమని ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిని నీ కొడుకు శివ మరో ముగ్గురితో కలిసి కాల్చిచంపిన కేసులో జైలుకు పంపుతున్నమంటూ షాద్‌నగర్‌ నుంచి పోలీసులు రమ్మని చెబితే శనివారం అక్కడికి వెళ్లాను. పోలీసులు కేసు నమోదుచేసిన కాగితాలపై సంతకం చేయాలని చెప్పారు. ఏడుస్తూ నా కొడుకును ఉరితీసినా రాను అంటూ సంతకం పెట్టి వచ్చానని తెలిపాడు.      – శివ తండ్రి రాజప్ప 

పరువు తీసిండ్రు
జస్టిస్‌ ఫర్‌ దిశను అత్యాచారం చేసి దారుణంగా కాల్చి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి. ఈ దారుణానికి పాల్పడింది మక్తల్‌ మండలం జక్లేర్, గుడిగండ్ల గ్రామాల వారు అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయిని హత్యచేసి మక్తల్‌ పరువు తీశారు. వారికి తగిన శిక్ష పడినప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు.  – చిట్టెం రాంమోహన్‌రెడ్డి, మక్తల్, ఎమ్మెల్యే  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement