పాదయాత్రగా వస్తున్న వీహెచ్‌పీ, హెచ్‌డీపీఎస్ నాయకులు
యాదగిరిగుట్ట (ఆలేరు) : శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని అరెస్ట్, నగర బహిష్కరణ చేయడం బాధకరమని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కట్టెగొమ్ముల రవీందర్‌రెడ్డి, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు పుల్ల శివ, విశ్వహిందూపరిషత్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తోట భానుప్రసాద్ అన్నారు. స్వామీజీని వెంటనే విడుదల చేసి, ఎక్కడ ఉన్నారో చెప్పాలని కోరుతూ బుధవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భువనగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు.
ఈ పాదయాత్రకు యాదగిరిగుట్టలో బీజేపీ, హెచ్‌డీపీఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. శాంతియుతంగా చేపట్టిన ధర్మాగ్రహయాత్రను అడ్డుకొని, స్వామీజీని ఎవరికి తెలియని ప్రదేశానికి తీసుకెళ్లడం శోచనీయమన్నారు.
హిందూ దేవుళ్లను, ఆచారాలను గౌరవించే స్వామీజీలను అరెస్ట్ చేస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. స్వామీజీకి ప్రభుత్వం రక్షణ కల్పించి, పాదయాత్ర సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీశైలం, మండల అధ్యక్షుడు రచ్చ శ్రీనివాస్, హెచ్‌డీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె పవీణ్, నవీన్ ఠాగూర్, నర్సింహారావు, లెంకలపల్లి శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment