మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ చేసిన వాహనాలు, బేగంపేట్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ఫీజు పట్టిక
నగరవాసులకు మెట్రో ప్రయాణం మరింత భారమైంది. స్టేషన్లలో పార్కింగ్ ఫీజులను అమాంతం పెంచడంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్ సదుపాయం ఉండగా... అదీ ఎత్తేశారు. ఇక నగరమంతటా పెయిడ్ పార్కింగ్‌లే. దీంతో ప్రయాణికులు మెట్రో ప్రయాణంపై పెదవి విరుస్తున్నారు. ఉచితంగా పార్కింగ్ సదుపాయం కల్పించాల్సిన బాధ్యత
మెట్రోదేనని పేర్కొంటున్నారు.
నగర మెట్రో స్టేషన్లలో పార్కింగ్ చార్జీలు మోత మోగుతున్నాయి.ఈ ఫీజును అమాంతం పెంచడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో సేవల్లో భాగంగా ఉచిత పార్కింగ్‌సదుపాయం కల్పించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా చార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపడంతో పాటు.. అధికంగా పెంచడంపై సర్వత్రా వ్యతిరేకతవ్యక్తమవుతోంది. మరోవైపుఇప్పటి వరకు ‘ఉచిత పార్కింగ్’సదుపాయం ఉన్న కొన్నిస్టేషన్లలో కూడాఆ సదుపాయాన్ని తొలగించిన మెట్రో అధికారులు అన్నిచోట్లా పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నగరంలోని పలు స్టేషన్లలోపార్కింగ్ సదుపాయాలు, చార్జీల వసూళ్లపై ‘సాక్షి’ విజిట్‌నిర్వహించింది. పార్కింగ్ చార్జీల బాదుడుపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సాక్షి,సిటీబ్యూరో/నెట్‌వర్క్: మెట్రో ద్వారా ప్రయాణికులకు మెరుగైన, సుఖవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తున్నప్పటికీ పార్కింగ్ రేట్లు మాత్రం వాహనదారులకు షాకిస్తున్నాయి. ఉదాహరణకు మెట్రో ప్రారంభమైన తొలినాళ్లలో బేగంపేట్ స్టేషన్‌లో వాహనాలకు పార్కింగ్ ఫీజును వసూలు చేయలేదు. ఏడాది తర్వాత నామమాత్రంగా రోజంతా బండి నిలిపితే రూ.10 తీసుకొనేవారు. ఇప్పుడు ద్విచక్ర వాహనానికి 2 గంటలకు రూ.5, 3 గంటలకు రూ.10 చొప్పున గుంజుతున్నారు. 5 గంటల పాటు పార్కింగ్ చేస్తే బైక్‌కు రూ.15 చొప్పున చెల్లించాలి. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు ద్విచక్ర వాహనం పార్కింగ్‌లో ఉంచితే రూ.20 చెల్సించాల్సిందే. ఇక కార్లకైతే పార్కింగ్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. కనిష్టంగా 2 గంటలకు రూ.15 చొప్పున వసూలు చేస్తుండగా, గరిష్టంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలిపే వాహనాలకు రూ.50 వరకు చదివించుకోవాల్సి వస్తోంది. ఒక్క బేగంపేట్ స్టేషన్‌లోనే కాకుండా నగరంలోని దాదాపు అన్ని మెట్రో స్టేషన్లలో ఇదే పరిస్థితి ఉంది. ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ వరకు 29 కి.మీ మార్గంలో, నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు 28 కి.మీ మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు మార్గాల్లో 50 స్టేషన్లు ఉండగా వీటిలో సుమారు 30 స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం ఉంది. అమీర్‌పేట్ వంటి ప్రధాన స్టేషన్‌లో గతంలో పూర్తిగా ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పించారు. అలాగే ఉప్పల్‌లోనూ ఈ సదుపాయం ఉండేది. కానీ ఇప్పుడు అన్నిచోట్ల పెయిడ్ పార్కింగ్‌గా మార్చడం గమనార్హం. మెట్రో రైళ్లలో ప్రతిరోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో చాలామంది సొంత వాహనాల్లో మెట్రో స్టేషన్ వరకు వచ్చి అక్కడ పార్కింగ్ చేసి కార్యాలయాలకు వెళుతున్నారు. ఇలా వస్తున్న వారంతా మెట్రో ప్రయాణ చార్జీ కంటే వాహనాల పార్కింగ్ చార్జీలే ఎక్కువవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదేం దోపిడీ బాబోయ్..
మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఎల్ అండ్ టీ, పార్క్ హైదరాబాద్ సంస్థలు పార్కింగ్ సదుపాయాలు కల్పించాయి. టూ వీలర్‌కు నెల పాస్‌కు రూ.250, ఓవర్ నైట్ చార్జ్ రూ.30, ఫోర్ వీలర్‌కు ఒకరోజు పాస్‌కు రూ.40, నెల పాస్‌కు రూ.750, ఓవర్ నైట్ చార్జ్ రూ.40 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. హెచ్‌ఎంఆర్ సంస్థ తరపున ‘పార్క్ హైదరాబాద్’ పార్కింగ్ సదుపాయం
కల్పిస్తోంది.
♦ ఎల్‌బీనగర్‌లో ఇప్పటి వరకు లేని పార్కింగ్ ఫీజును కొత్తగా ప్రారంభించారు. ఇక్కడ కనీసం పార్కు చేసుకోవటానికి అనువైన స్థలం లేదు. గుంతలమయంగా ఉన్న స్థలంలో వాహనాలు నిలిపితేనే పార్కింగ్ రుసుం వసూలు చేయడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఎల్‌బీనగర్ స్టేషన్‌లో ప్రయాణికులకు సరిపోయేత పార్కింగ్ స్థలం లేదు.
♦ మిరాజ్ థియేటర్ సమీపంలోని చైతన్యపురి మెట్రో స్టేషన్ వద్ద పార్కంగ్ స్థలం మట్టికుప్పలతో నిండిపోయింది. ఎగుడుదిగుడుగా ఉండటంతో వాహనం ఎప్పుడు కిందపడుతుందో తెలియదు.
♦ దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఒక వైపు బస్‌స్టాండ్, మరోవైపు తోపుడు బండ్లు ఉండడంతో అధికారులు ఇంకా ఎటువంటి పెయిడ్ పారింగ్Š బోర్డులు ఏర్పాటు చేయలేదు.
పార్కింగ్ సక్రమంగా లేదు
ఎల్‌బీనగర్ పరిధిలోని మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ స్థలాల్లో కనీసం సిమెంట్ ప్లోరింగ్ కూడా చేయలేదు. ప్రస్తుతం గుంతలు, మట్టి కుప్పలు ఉన్న స్థలాల్లోనే ద్విచక్రవాహనాలు పార్కు చేస్తున్నారు. వాటిని సక్రమంగా ఏర్పాటు చేయకుండానే పార్కింగ్ రుసుం ఎలా తీసుకుంటారు? కార్లు పెట్టుకునేందుకు స్టేషన్ల వద్ద స్థలం లేదు.. కానీ ‘కారు పెయిడ్ పార్కింగ్’ అని బోర్డులు పెట్టారు. కొన్ని స్టేషన్ల వద్ద ఫుట్‌పాత్‌లు కూడా సక్రమంగా లేవు. మెట్రో ప్రయాణికులకు స్టేషన్ సమీపంలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసిన తర్వాతే పార్కింగ్ రుసుం తీసుకోవాలి.– బి.చందర్‌రావు, ఎల్‌బీనగర్
పార్కింగ్ రుసుం తగ్గించాలి
మెట్రో స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ రుసుం అధికంగా ఉంది. రోజువారి పాస్ తీసుకున్న వారికి అదనంగా నైట్ అవర్స్ రుసుం లేకుండా చూడాలి. అప్పుడే వాహనదారులకు భారం తగ్గుతుంది. నెలవారీ పాస్ తీసుకున్న వారికి సౌకర్యంగా ఉంది. వాహనాలు పార్కింగ్ చేసే స్థలంలో ఎలాంటి షెడ్లు లేకపోవడంతో వర్షానికి తడిసి, ఎండకు ఎండిపోతున్నాయి. ఈ విషయంలో మొట్రో అధికారులు చర్యలు తీసుకోవాలి.
– రాకేష్, చందానగర్
నెలకు రూ.600 ఫీజు
బేగంపేట్ మెట్రో స్టేషన్ వద్ద వాహనం పార్కు చేసి పనులు పూర్తయిన తర్వాత వస్తా. గతంలో రోజంతటికీ రూ.10 మాత్రమే వసూలు చేసేవారు. ఇటీవల దానిని రూ.20 పెంచారు. ప్రతిరోజూ రూ.20 చొప్పున అంటే నెలకు పార్కింగ్‌కు రూ.600 పార్కింగ్ ఫీజుగానే కట్టాల్సి వస్తోంది. ఇది తగ్గిస్తే మంచిది.– రాఘవేంద్ర రెడ్డి, రైల్వే సివిల్ వర్క్స్
Comments
Please login to add a commentAdd a comment