మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర, కొనుగోలుకు సంబంధించి సమీకృత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. కొనుగోలు సమయంలో రైతులకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల వివరాలను సంబంధిత సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేసి, కొనుగోలు సంస్థలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఖరీఫ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలపై సంబంధిత ప్రభుత్వ శాఖల సన్నద్ధతపై అధికారులతో శుక్రవారం పార్థసారథి సమీక్షించారు. ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థ, పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ, ఇతర పంటలకు సంబంధించి నాఫెడ్‌లు ఇప్పటికే నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) సహకారంతో వివిధ సాఫ్ట్‌వేర్లను రూపొందించాయన్నారు.
ఈ సాఫ్ట్‌వేర్‌ల్లోని లోటుపాట్లను సవరిస్తూ సమీకృత సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయాలన్నారు. రైతుల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్న సమాచారాన్ని మార్కెటింగ్ సంస్థలకు అందించేందుకు త్వరలో జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తద్వారా రాబోయే సీజన్‌లో పంటల వారీగా కొనుగోలు కేంద్రాలు, ఇతర ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించడం మార్కెటింగ్ సంస్థలకు సులభమవుతుందన్నారు. పంట వేయక ముందే ఎంత ధర పలుకుతుందనే సమాచారమిచ్చే వ్యవస్థను ఇప్పటికే మార్కెటింగ్ శాఖ సహకారంతో వ్యవసాయ వర్సిటీ రూపొందించిందన్నారు. ఈ సమాచారాన్ని రైతు వద్దకు తీసుకెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్, హాకా ఎండీ భాస్కరాచారితో పాటు మార్క్‌ఫెడ్, హాకా, నాఫెడ్, గిడ్డంగుల సంస్థ, ఎఫ్‌సీఐ, సీసీఐ, వ్యవసాయ వర్సిటీ, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment