parthasaraty
-
ఉద్యోగం వస్తే అది కాపీ కొట్టినట్లా?
సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకు వచ్చారని పెనమలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే లక్ష 27 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశంసించారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరిగిందని, వెనకబడిన కులాలకు చెందినవారు, మహిళలు, రైతు కుమారులు ఉన్నతమైన ర్యాంకులు సాధించారని తెలిపారు. గతంలో లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా చంద్రబాబు నాయుడు భర్తీ చేయలేదని విమర్శించారు. ప్రజల్లో అపోహలు, చిచ్చు పెట్టేందుకు ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని, ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేకనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తొందని పార్థసారథి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి 20 లక్షల మంది ఉద్యోగం కోసం పరీక్షలు రాసిన సందర్భం ఇంతవరకు లేదన్నారు. ఏపీపీఎస్సీలో పనిచేసే వారి కుటుంబ సభ్యులకు ఉన్నత ర్యాంకులు రాకూడదా అని, అంటే ఐఏఎస్ కుమారుడికి ఐఏఎస్ ఉద్యోగం వస్తే అది కాపీ కొట్టినట్లా అని ప్రశ్నించారు. బలహీన వర్గాల పిల్లలకు ఉద్యోగాలు వస్తే చంద్రబాబు సహించలేకపోతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీపీఎస్సీలో ముఖ్యమైన పనులను ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించారని, రివర్స్ టెండర్ ద్వారా 274 కోట్ల టెండర్లలో 58 వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశారని వెల్లడించారు. ఒక్క రూపాయి లేకుండా చంద్రబాబు రాష్ట్ర ఖజానాను దోపిడి చేశారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేశారని దుయ్యబట్టారు. దానిని గాడిలో పెట్టడానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు సమీకృత సాఫ్ట్వేర్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర, కొనుగోలుకు సంబంధించి సమీకృత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. కొనుగోలు సమయంలో రైతులకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల వివరాలను సంబంధిత సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేసి, కొనుగోలు సంస్థలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఖరీఫ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలపై సంబంధిత ప్రభుత్వ శాఖల సన్నద్ధతపై అధికారులతో శుక్రవారం పార్థసారథి సమీక్షించారు. ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థ, పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ, ఇతర పంటలకు సంబంధించి నాఫెడ్‌లు ఇప్పటికే నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతో వివిధ సాఫ్ట్వేర్లను రూపొందించాయన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ల్లోని లోటుపాట్లను సవరిస్తూ సమీకృత సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయాలన్నారు. రైతుల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్న సమాచారాన్ని మార్కెటింగ్ సంస్థలకు అందించేందుకు త్వరలో జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తద్వారా రాబోయే సీజన్లో పంటల వారీగా కొనుగోలు కేంద్రాలు, ఇతర ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించడం మార్కెటింగ్ సంస్థలకు సులభమవుతుందన్నారు. పంట వేయక ముందే ఎంత ధర పలుకుతుందనే సమాచారమిచ్చే వ్యవస్థను ఇప్పటికే మార్కెటింగ్ శాఖ సహకారంతో వ్యవసాయ వర్సిటీ రూపొందించిందన్నారు. ఈ సమాచారాన్ని రైతు వద్దకు తీసుకెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్, హాకా ఎండీ భాస్కరాచారితో పాటు మార్క్‌ఫెడ్, హాకా, నాఫెడ్, గిడ్డంగుల సంస్థ, ఎఫ్‌సీఐ, సీసీఐ, వ్యవసాయ వర్సిటీ, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
‘రైతుబంధు’తో సామాజిక ఆర్థిక భద్రత
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతలకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించాయని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. రోమ్‌లో శుక్రవారం ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) నిర్వహించిన ‘వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణలు’అనే అంశంపై జరుగుతున్న అంతర్జాతీయ సింపోజియంలో పార్థసారథి ప్యానల్ స్పీకర్ హోదాలో మాట్లాడారు. తెలంగాణ నాలుగున్నరేళ్ల క్రితం ఏర్పాటైన కొత్త రాష్ట్రమని, వర్షాభావ పరిస్థితులతో నిరంతరం కరువు కాటకాలతో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కువమంది సన్న,చిన్నకారు రైతులేనని, ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ‘రైతుబంధు’పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. అప్పులకు పోకుండా నిరోధించాం రైతుబంధు పథకం ద్వారా రైతులు ప్రైవేటు అప్పులకు పోకుండా నిరోధించగలిగామని పార్థసారథి తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతీ రైతుకు ఎకరాకు రూ.4 వేల చొప్పున అందజేస్తున్నామని, ఈ మొత్తం వ్యవసాయ సీజన్ ప్రారంభంలో విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 51 లక్షలమంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా రూ.5,200 కోట్లు ఇచ్చామన్నారు. మరోవైపు రైతు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని సర్కారు తీసుకొచ్చిందని పార్థసారథి తెలిపారు. ఇప్పటివరకు రైతుబీమా కింద లబ్ధిపొందిన వారిలో 90% సన్న,చిన్నకారు రైతులేనని స్పష్టం చేశారు. రైతు కుటుంబాలకు పది రోజుల్లోగా రూ.5 లక్షలు బీమా పరిహారం ఆ కుటుంబానికి అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. -
మట్టి దోపిడీపై సీబీఐ విచారణకు సిద్ధమా?
గన్నవరం: గుడిని, గుడిలోని లింగాన్ని మింగేసినట్లుగా బ్రహ్మయ్య లింగం చెరువులో మట్టి తవ్వకాల పేరుతో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ నిధులను స్వాహా చేశారని, తవ్విన మట్టిని అమ్ముకుని రూ.కోట్లు దండుకున్నారని వైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. మట్టి దందాపై సీబీఐ విచారణకు సిద్ధమంటూ టీడీపీ ఎమ్మెల్యే వంశీమోహన్ చేసిన సవాల్‌కు తమ పార్టీ తరుపున ప్రతి సవాల్ చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే ప్రెస్‌మీట్‌ను ఆధారంగా చేసుకుని మట్టి దోపిడీపై విచారణ కోరుతూ సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాస్తామని చెప్పారు. శుక్రవారం కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్సార్సీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పార్థసారథి విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మయ్య లింగయ్య చెరువులో ఇప్పటివరకు ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వారో స్పష్టంగా చెప్పాలని అన్నారు. తవ్విన మట్టిని ఏయే వ్యవసాయ క్షేత్రాలకు పంపారో ఎమ్మెల్యే గానీ, ఆయన అనుచరులు గానీ వస్తే పరిశీలనకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మట్టి దోపిడీ విషయంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు. టీడీపీ నేతల ఇసుక, మట్టి దోపిడీ గురించి ప్రజలకు అర్థమైందన్నారు. తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు సీబీఐ విచారణకు సిద్ధపడాలని వంశీమోహన్‌కు సవాల్ విసిరారు. -
తక్షణమే స్పందించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో బోటు ప్రమాదానికి గురైతే ప్రభుత్వ యంత్రాంగం నుంచి తక్షణ స్పందన కరువైంది. వైఎస్సార్సీపీ నేతలు కొలుసు పార్థసారథి, జోగి రమేష్, ఉదయభాను తమ అనుచరులతో కలసి పది నిమిషాల్లోనే ప్రమాద స్థలికి చేరుకున్నారు. అప్పటికి అధికారులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకోలేదు. వైఎస్సార్సీపీ నేతలే స్థానికులతో కలసి సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను పిలిపించి నదిలోకి పంపించారు. బోల్తా పడిన బోటు కింద పర్యాటకులు ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు గుర్తించారు. బోటును కొంతమేర పగుల కొట్టి నీటిలో ఉన్న పర్యాటకులను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. నీట మునిగి ఉన్న మరికొందరు పర్యాటకులను బయటకు తీశాయి. అంబులెన్స్‌ల రాక ఆలస్యం కావడంతో బాధితులను ఆటోల్లోనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఘటన జరిగి దాదాపు 45 నిమిషాలయ్యాక వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్న వైఎస్సార్సీపీ నేతలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు అక్కడే ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ నేతలను నెట్టివేసేందుకు ప్రయత్నించారు. -
కమల్‌హాసన్ ముస్లిమా..? అసలు పేరు..
హీరో కమల్‌హాసన్ ముస్లిమా?. కాదు. కానీ, ఆదివారం ఓ జాతీయ దినపత్రికలో వచ్చిన కాలమ్‌లో లెజండరీ హీరో హిందూ వ్యతిరేక కామెంట్లు చేశారని, ఆయన ఇస్లాంను నమ్ముతారని కాలమిస్టు ఆరోపించారు. కాలమ్ వివాదాస్పదంగా మారడంతో ఆన్లైన్ వెర్షన్ లోని కాలమ్ నుంచి వివాదాస్పద పేరాగ్రాఫ్‌ను తొలగించారు. కమల్ తన మతాన్ని మరచి హిందూ, ముస్లింల మధ్య భేదాలను పొడసూపేలా ప్రవర్తిస్తున్నారని కాలమిస్టు తొలగించిన పేరాగ్రాఫ్‌లో వ్యాఖ్యానించారు. ఆయన మతానికి చెందిన వాళ్లే మహిళను అవమానించారనే విషయాన్ని మరిచిపోయి ఓ ముస్లింలా మాట్లాడుతున్నారని అన్నారు. మహాభారతం లాంటి వాటిపై కామెంట్లు చేయడం కన్నా.. సమకాలీన సమస్యలైన త్రిపుల్ తలాక్ లాంటి వాటిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. మతాలపై మాట్లాడటప్పుడే ఒళ్లు దగ్గరపెట్టుకుంటే బాగుంటుందని అన్నారు. అసలు కాలమిస్టు కమల్‌ను ఓ ఇస్లామిస్టుగా పేర్కొనడానికి కారణం.. ఆయన మహాభారతాన్ని ఉద్దేశించి చేసిన ఓ కామెంట్. కొద్ది రోజుల కిందట కమల్ ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వూ ఇచ్చారు. రెండు కుటుంబాల గొడవల్లో ఓ మహిళను పెట్టి జూదం ఆడిన వాళ్ల పండుగను దేశంలో ఎందుకు జరుపుకుంటారో తనకు అర్ధం కాదని అన్నారు. కమల్ అసలు పేరు ఇది.. తాను దేవుడిని నమ్మనని కమలే చెప్పారు. కమల్ 1952లో తమిళ బ్రహ్మణులైన అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. చెన్నైలోని పల్లవుల కాలానికి చెందిన ఓ గుడిలో 'పార్ధసారధి' అని తల్లిదండ్రలు నామకరణం చేశారు. కొద్దికాలం తర్వాత తండ్రి శ్రీనివాసన్ పార్ధసారధి పేరును కమల్‌హాసన్‌గా మార్చారు. అయితే, కమల్‌హాసన్ అని పేరును మార్చడం వెనుక కొన్ని ఇతర కారణాలున్నాయని గతంలో ఆన్లైన్లో న్యూస్ హాల్చల్ చేసింది. యాకూబ్ హసన్ అనే తన ఫ్రెండ్ గుర్తుగా శ్రీనివాసన్ కమల్‌కు కమల్‌హాసన్ అని పేరు పెట్టారని దీని సారాంశం. ఈ వార్తలను అప్పట్లో కమల్ ఖండించారు. కమల్ అంటే పద్మం అని, హాసన్ అనే పదం హాస్యం నుంచి వచ్చిందని చెప్పారు. కాగా, జాతీయ దినపత్రికలో వచ్చిన కాలమ్ దేశంలో పెచ్చరిల్లుతున్న మత ఆపాదనలను ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా స్వేచ్చగా మాట్లాడే హక్కును ఇది హరిస్తుంది.