సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకు వచ్చారని పెనమలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే లక్ష 27 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశంసించారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరిగిందని, వెనకబడిన కులాలకు చెందినవారు, మహిళలు, రైతు కుమారులు ఉన్నతమైన ర్యాంకులు సాధించారని తెలిపారు. గతంలో లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా చంద్రబాబు నాయుడు భర్తీ చేయలేదని విమర్శించారు. ప్రజల్లో అపోహలు, చిచ్చు పెట్టేందుకు ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని, ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేకనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తొందని పార్థసారథి మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి 20 లక్షల మంది ఉద్యోగం కోసం పరీక్షలు రాసిన సందర్భం ఇంతవరకు లేదన్నారు. ఏపీపీఎస్సీలో పనిచేసే వారి కుటుంబ సభ్యులకు ఉన్నత ర్యాంకులు రాకూడదా అని, అంటే ఐఏఎస్ కుమారుడికి ఐఏఎస్ ఉద్యోగం వస్తే అది కాపీ కొట్టినట్లా అని ప్రశ్నించారు. బలహీన వర్గాల పిల్లలకు ఉద్యోగాలు వస్తే చంద్రబాబు సహించలేకపోతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీపీఎస్సీలో ముఖ్యమైన పనులను ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించారని, రివర్స్ టెండర్ ద్వారా 274 కోట్ల టెండర్లలో 58 వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశారని వెల్లడించారు. ఒక్క రూపాయి లేకుండా చంద్రబాబు రాష్ట్ర ఖజానాను దోపిడి చేశారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేశారని దుయ్యబట్టారు. దానిని గాడిలో పెట్టడానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment