సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయాన్ని అమలుచేస్తున్నారని, ఇంత గొప్పగా ఎప్పుడూ జరగలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు, చంద్రబాబు, లోకేశ్ చేసే విమర్శలను ప్రజాప్రతినిధులు, పార్టీ ఇతర నేతలంతా ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని ఓ హోటల్‌లో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగానికి చెందిన ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీలకు సంబంధించి తాజా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీలో సీఎం జగన్ మినహా మిగిలిన వారందరూ కార్యకర్తలేనన్నారు. ఎవరి బాధ్యతలు వాళ్లు సక్రమంగా నిర్వర్తిస్తే పార్టీ మరింతగా బలోపేతమవుతుందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రకులాల్లోని పేదలలో ఆత్మవిశ్వాసం పెంపొందింది. ఈ పథకాలతో లబ్ధిదారులు తమ భవిష్యత్తు మరింత మెరుగ్గా మారుతుందనే విషయాన్ని గుర్తించేలా వారిలో చైతన్యం తేవాలి. మంత్రి ఆదిమూలపు సురేష్‌పై జరిగిన రాళ్ల దాడి విషయంలో టీడీపీ ఓ కార్పొరేట్ స్థాయిలో దుష్ప్రచారానికి ఒడిగట్టింది.
అయితే, ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు చంద్రబాబు కుట్రలను, కుయుక్తులను మరింతగా తిప్పికొట్టాల్సి ఉంది. ఓ వైపు దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేస్తున్న విధానాలను, పథకాలను వివరిస్తూనే ప్రతిపక్షాల కుట్రలను సైతం తిప్పికొట్టాలి. ఇందుకు ప్రధాన మీడియాతో పాటు డిజిటల్, సోషల్ మీడియాను వినియోగించుకోవాలి. మనం చేసిన సామాజిక న్యాయాన్ని ప్రతి గడపకూ చేరవేయాలి. ఈ సమావేశంలో నేతలందరి అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం. బాబు, లోకేశ్‌కు బుద్ధి చెప్పేది దళితులే: నారాయణస్వామి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్‌కు బుద్ధిచెప్పేది దళితులు మాత్రమేనన్నారు.
పచ్చపత్రికలను దుష్ప్రచారానికి వాడుతున్నారనే విషయం ప్రజలకు తెలుసునని.. టీడీపీలోని దళితులతో అబద్ధాలు చెప్పిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రవాణా శాఖ మంత్రి పినిసే విశ్వరూప్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల అండ జగన్‌కే ఉందన్నారు. దళితులను అపహాస్యం చేస్తున్న చంద్రబాబులాంటి దుష్టుడ్ని పల్లెల్లోకి రానీయొద్దని పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో దళితులకు రూ.53వేల కోట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మూలసూత్రాలైన పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
ఈ నాలుగేళ్లలో దళిత కుటుంబాలకు రూ.53 వేల కోట్లకు పైగా లబ్ధి చేకూరిందన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మొండితోక అరుణ్‌కుమార్, కైలే అనిల్‌కుమార్, ఎంపీ నందిగం సురేష్, జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అన్నారు. దళితులు వైఎస్సార్‌సీపీకి ఎల్లప్పుడూ తరగని ఆస్తి అని వారు తెలిపారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి, నాడు–నేడు వంటి పథకాలవల్ల దళితుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిందన్నారు. దళితులను అనేక రకాలుగా అవమానించిన చంద్రబాబుకు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఆయన తీరు మారలేదన్నారు. రానున్న ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయంగా అంతర్థానం అవుతారని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకెళ్తున్న సీఎం జగన్‌కు ప్రతి దళితుడు అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశానికి మంత్రి మేరుగు నాగార్జున అధ్యక్షత వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి కూడా పాల్గొన్నారు.
(చదవండి: వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు )
Comments
Please login to add a commentAdd a comment