మాట్లాడుతున్న పార్థసారథి, చిత్రంలో పార్టీ నేతలు రామచంద్రరావు, వెంకట్రావు
గన్నవరం: గుడిని, గుడిలోని లింగాన్ని మింగేసినట్లుగా బ్రహ్మయ్య లింగం చెరువులో మట్టి తవ్వకాల పేరుతో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ నిధులను స్వాహా చేశారని, తవ్విన మట్టిని అమ్ముకుని రూ.కోట్లు దండుకున్నారని వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. మట్టి దందాపై సీబీఐ విచారణకు సిద్ధమంటూ టీడీపీ ఎమ్మెల్యే వంశీమోహన్ చేసిన సవాల్‌కు తమ పార్టీ తరుపున ప్రతి సవాల్ చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే ప్రెస్‌మీట్‌ను ఆధారంగా చేసుకుని మట్టి దోపిడీపై విచారణ కోరుతూ సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాస్తామని చెప్పారు.
శుక్రవారం కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్సార్‌సీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పార్థసారథి విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మయ్య లింగయ్య చెరువులో ఇప్పటివరకు ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వారో స్పష్టంగా చెప్పాలని అన్నారు.
తవ్విన మట్టిని ఏయే వ్యవసాయ క్షేత్రాలకు పంపారో ఎమ్మెల్యే గానీ, ఆయన అనుచరులు గానీ వస్తే పరిశీలనకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మట్టి దోపిడీ విషయంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు. టీడీపీ నేతల ఇసుక, మట్టి దోపిడీ గురించి ప్రజలకు అర్థమైందన్నారు. తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు సీబీఐ విచారణకు సిద్ధపడాలని వంశీమోహన్‌కు సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment