కమల్‌హాసన్ ముస్లిమా..? అసలు పేరు..
హీరో కమల్‌హాసన్ ముస్లిమా?. కాదు. కానీ, ఆదివారం ఓ జాతీయ దినపత్రికలో వచ్చిన కాలమ్‌లో లెజండరీ హీరో హిందూ వ్యతిరేక కామెంట్లు చేశారని, ఆయన ఇస్లాంను నమ్ముతారని కాలమిస్టు ఆరోపించారు. కాలమ్ వివాదాస్పదంగా మారడంతో ఆన్‌లైన్ వెర్షన్ లోని కాలమ్ నుంచి వివాదాస్పద పేరాగ్రాఫ్‌ను తొలగించారు.
కమల్ తన మతాన్ని మరచి హిందూ, ముస్లింల మధ్య భేదాలను పొడసూపేలా ప్రవర్తిస్తున్నారని కాలమిస్టు తొలగించిన పేరాగ్రాఫ్‌లో వ్యాఖ్యానించారు. ఆయన మతానికి చెందిన వాళ్లే మహిళను అవమానించారనే విషయాన్ని మరిచిపోయి ఓ ముస్లింలా మాట్లాడుతున్నారని అన్నారు. మహాభారతం లాంటి వాటిపై కామెంట్లు చేయడం కన్నా.. సమకాలీన సమస్యలైన త్రిపుల్ తలాక్ లాంటి వాటిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. మతాలపై మాట్లాడటప్పుడే ఒళ్లు దగ్గరపెట్టుకుంటే బాగుంటుందని అన్నారు.
అసలు కాలమిస్టు కమల్‌ను ఓ ఇస్లామిస్టుగా పేర్కొనడానికి కారణం.. ఆయన మహాభారతాన్ని ఉద్దేశించి చేసిన ఓ కామెంట్. కొద్ది రోజుల కిందట కమల్ ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వూ ఇచ్చారు. రెండు కుటుంబాల గొడవల్లో ఓ మహిళను పెట్టి జూదం ఆడిన వాళ్ల పండుగను దేశంలో ఎందుకు జరుపుకుంటారో తనకు అర్ధం కాదని అన్నారు.
కమల్ అసలు పేరు ఇది..
తాను దేవుడిని నమ్మనని కమలే చెప్పారు. కమల్ 1952లో తమిళ బ్రహ్మణులైన అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. చెన్నైలోని పల్లవుల కాలానికి చెందిన ఓ గుడిలో 'పార్ధసారధి' అని తల్లిదండ్రలు నామకరణం చేశారు. కొద్దికాలం తర్వాత తండ్రి శ్రీనివాసన్ పార్ధసారధి పేరును కమల్‌హాసన్‌గా మార్చారు. అయితే, కమల్‌హాసన్ అని పేరును మార్చడం వెనుక కొన్ని ఇతర కారణాలున్నాయని గతంలో ఆన్‌లైన్‌లో న్యూస్ హాల్‌చల్ చేసింది.
యాకూబ్ హసన్ అనే తన ఫ్రెండ్ గుర్తుగా శ్రీనివాసన్ కమల్‌కు కమల్‌హాసన్ అని పేరు పెట్టారని దీని సారాంశం. ఈ వార్తలను అప్పట్లో కమల్ ఖండించారు. కమల్ అంటే పద్మం అని, హాసన్ అనే పదం హాస్యం నుంచి వచ్చిందని చెప్పారు. కాగా, జాతీయ దినపత్రికలో వచ్చిన కాలమ్ దేశంలో పెచ్చరిల్లుతున్న మత ఆపాదనలను ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా స్వేచ్చగా మాట్లాడే హక్కును ఇది హరిస్తుంది.