ఎన్నికల పేరు చెప్పి మందుబాబులు ‘ఫుల్లు’బాట పట్టారు. ప్రచారంలో భాగంగా పెగ్గుమీద పెగ్గేసి మస్త్ మజా చేసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గత నెల రోజుల్లో మద్యం అమ్మకాలు తారస్థాయికి చేరాయి. ఉభయ జిల్లాల పరిధిలోని సుమారు 400 మద్యం దుకాణాలు, 540 బార్లలో సాధారణంగా రోజుకు రూ.15 కోట్ల విలువైన మద్యం, బీర్ల అమ్మకాలు సాగుతుంటాయి. కానీ ఎన్నికల ప్రచారం మొదలుకావడంతో ఈ అమ్మకాలు ఏకంగా రూ.25 కోట్లకు చేరుకోవడం విశేషం. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు కేడర్, అనుచరులను సంతృప్తి పరిచేందుకు మంచినీళ్లలా డబ్బులు ఖర్చుచేశారు. దీంతో నెలరోజుల పాటు మందుబాబులు మద్యంలో మునిగితేలారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఇప్పటికే ఎక్సైజ్‌శాఖ ఆదేశాలు జారీ చేయడంతో మద్యం ప్రియులు ముందే జాగ్రత్త పడ్డారు.
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల ప్రచారంలో మందుబాబులు ‘ఫుల్లు’బాట పట్టి మస్త్ మజా చేశారు. మద్యం అమ్మకాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ముందుకు దూసుకెళుతున్నాయి. నెల రోజులుగా పతాకస్థాయికి చేరుకున్న ఎలక్షన్ లొల్లిలో ఆరు ఫుల్లు బాటిళ్లు.. మూడు బీరు సీసాలు అన్న చందంగా మారింది మందుబాబుల తీరు. ఉభయజిల్లాల పరిధిలోని సుమారు 400 మద్యం దుకాణాలు, 540 బార్లలో సాధారణ రోజుల్లో నిత్యం రూ.15 కోట్ల విలువైన మద్యం, బీర్ల అమ్మకాలు సాగుతుంటాయి. కానీ ఎన్నికల ప్రచారం మొదలుకావడంతో అమ్మకాలు ఏకంగా రూ.25 కోట్లకు చేరుకోవడం విశేషం. మద్యం దుకాణాలకు లైసెన్సు ఫీజుకు ఏడురెట్ల చొప్పున మద్యాన్ని ఆబ్కారీశాఖ సరఫరా చేస్తోంది. ఆపై అమ్మకాల విలువపై ప్రివిలేజ్ ఫీజును 14–18 శాతం మేర వసూలు చేస్తోంది. ఈసారి పార్టీల అభ్యర్థులు జోష్‌లో మద్యం కొనుగోళ్లు చేపట్టడంతో ఒక్కో మద్యం దుకాణం యజమాని తమకు కేటాయించిన కోటా.. ఏడు రెట్లను మించి ఏకంగా 10–12 రెట్ల మేర కొనుగోలు చేసి విక్రయించడం గమనార్హం.
తాగాలె.. ఊగాలె..
ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు కేడర్, మందుబాబులనుసంతృప్తిపరిచేందుకు మంచినీళ్లలా డబ్బులు ఖర్చుచేస్తున్న విషయం విదితమే. ఉదయం నుంచి రాత్రి వరకు పాదయాత్రలు, ర్యాలీలు, బహిరంగసభలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం కోసం కాళ్లరిగేలా తమ వెంట తిరిగిన వారికి రాత్రి వేళ ‘ఫుల్లు’గా ఖుషీ చేసేందుకు అభ్యర్థులు శక్తివంచన లేకుండా ప్రయత్నించడంతో మద్యం సేల్స్ అమాంతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇక మద్యం అమ్మకాల్లో ఐఎంఎల్ మద్యం కంటే బీర్లే అధికంగా విక్రయించినట్లు ఆబ్కారీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నెలరోజులుగా ఉభయజిల్లాల పరిధిలో 14.21 లక్షల కేసుల బీర్లు, మరో 11 లక్షల కేసుల ఐఎంఎంల్ మద్యం అమ్ముడైనట్లు అంచనా. ఇక గతేడాది నవంబరు నెలలో రెండు జిల్లాల్లో రూ.672 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు
ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి.
నేటి సాయంత్రం నుంచిమద్యం దుకాణాలు బంద్..
బుధవారం సాయంత్రం 6 నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఇప్పటికేఎక్సైజ్‌శాఖ ఆదేశాలిచ్చింది. ఇక ఓట్ల లెక్కింపు రోజున (ఈ నెల 11న) మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. మద్యం దుకాణాల మూసివేత విషయాన్ని ముందే పసిగట్టిన వివిధ పార్టీల అభ్యర్థులు, నేతలు గత నెల చివరివారంలోనే భారీగా మద్యం కొనుగోళ్లు చేసి బూత్, డివిజన్, వార్డు స్థాయిలో ముఖ్య నేతల నివాసాలు, ఫాంహౌస్‌లు, వ్యవసాయ క్షేత్రాల్లో రహస్యంగా నిల్వచేసినట్లు సమాచారం. తాము దాచిన మద్యాన్ని ఎన్నికల కమిషన్ బృందాలకు చిక్కకుండా బుధ, గురు, శుక్రవారాల్లో ఎక్కడికక్కడే పంచేందుకు ఏర్పాట్లు చేయడం గమనార్హం. అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చుకు చిక్కకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకగణం, పార్టీల్లో ముఖ్య కార్యకర్తలు తమ అధినేతలు అందించిన డబ్బుతో గుట్టుగా మద్యం కొనుగోళ్లు సాగించినట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment