
గ్రామస్థాయి నుంచి పునర్వ్యవస్థీకరణ
♦ త్వరలో పార్టీ ప్రక్షాళనకు పీసీసీ నిర్ణయం
♦ మీడియాలో చర్చలకు ప్రత్యేక ప్యానల్
♦ గ్రేటర్, రంగారెడ్డి జిల్లాలకు త్వరలోనే కొత్త సారథులు
సాక్షి, హైదరాబాద్: గ్రామస్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేసి, కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని పీసీసీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలు ఎక్కడా ఖాళీగా ఉండకూడదని ఏఐసీసీ నుంచి టీపీసీసీకి స్పష్టమైన ఆదేశాలు అందాయి. పీసీసీకి అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షునిగా మల్లు భట్టి విక్రమార్క నియామకం జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. వారం పది రోజుల్లోనే పీసీసీకి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని, జిల్లాల వారీగా క్రియాశీల నాయకులను ఇన్‌చార్జిలుగా నియమిస్తామని ఏడాది క్రితమే ప్రకటించారు. అయితే వరుసగా వస్తున్న ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, శాసనమండలి ఎన్నికలు, ఇతర సమావేశాలు.. వంటివాటితో పాటు పార్టీలో నేతల మధ్య, గ్రూపుల మధ్య సమన్వయంలోపం వంటి అంశాలతో ఎప్పటికప్పుడు పీసీసీ కార్యవర్గం ఏర్పాటు వాయిదా పడుతూ వస్తోంది.
కాగా, ఇటీవలి కాలంలో పీసీసీకి అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. మెదక్, వరంగల్ లోక్‌సభ సీట్లకు ఉప ఎన్నికలు, శాసనమండలి ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగితే రెండు ఎమ్మెల్సీ సీట్లు రావడం మినహా కాంగ్రెస్‌పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి. అయితే ఎప్పటికప్పుడు వచ్చే తాత్కాలిక అంశాలను పట్టించుకోకుండా పార్టీని రాష్ట్రం యూనిట్‌గా తీసుకుని బలోపేతం చేయాలని పీసీసీకి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ గట్టిగా ఆదేశించారు. దీంతో వీలైనంత వేగంగా గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టి మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలకు పూర్తిస్థాయి కార్యవర్గాలను నియమించుకోవాలని పీసీసీ భావిస్తోంది.
ఈ కమిటీల ఏర్పాటు తర్వాత ఎప్పటికప్పుడు కార్యాచరణకోసం గ్రామ, మండల స్థాయి నుంచి పీసీసీ దాకా ప్రతీ నెల మొదటివారంలో సమావేశాలు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే చర్చించుకుని స్థానికంగా సమస్యలపై పోరాటాలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. వీటితోపాటు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అధ్యక్షుల నియామక ప్రక్రియను కూడా ఈ నెలాఖరుతో కాంగ్రెస్ అధిష్టానం పూర్తిచేసే అవకాశాలున్నట్టు టీపీసీసీ ముఖ్యుడొకరు వెల్లడించారు.
మీడియాలో చర్చలపై ప్రత్యేక దృష్టి
ప్రజా సమస్యలపై ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో మాట్లాడటానికి, చర్చించడానికి ప్రత్యేక ప్యానల్‌ను ఏర్పాటు చేయాలని పీసీసీ నిర్ణయించింది. పార్టీ విధానాలు, నిర్ణయాలు, అభిప్రాయాలపై స్పష్టత లేకుండా మీడియా చర్చల్లో ఎవరికివారే పాల్గొనడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని పీసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే చాతుర్యం, అంశాల వారీగా పట్టు, అవగాహన, పార్టీ విధానాలపై స్పష్టత ఉన్నవారితో ఒక ప్యానల్‌ను అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ జాబితాను అన్ని మీడియా సంస్థలకు పంపాలని భావిస్తోంది.
టీపీసీసీలో కొత్త ముఖాలకు చోటు
పీసీసీ కార్యవర్గంలో ఇప్పుడున్న వారిలో నిష్క్రియాపరత్వంగా ఉన్న కొందరు నాయకులను తొలగించి, కొన్ని కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని టీపీసీసీకి, ఏఐసీసీ నుంచి సూచనలు అందాయి. కార్యవర్గంలో ప్రతీ నాయకునికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించాలని ఏఐసీసీ సూచించింది. దీని ప్రకారం ఉపాధ్యక్షులు, కార్యదర్శులు వంటివారిని జిల్లాల బాధ్యులు, విభాగాల బాధ్యులుగా నియమించాలని పీసీసీ యోచిస్తోంది.