మంచిర్యాలక్రైం: మంచిర్యాల, కుమురంభీం జిల్లాల ప్రజలకు ఇక పాస్‌పోర్టు ఇబ్బందులు దూరం కానున్నాయి. ఉపాధి, ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లోని పాస్‌పోర్టు కేంద్రాలకు వెళ్లి రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఒక పోస్టాఫీస్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న మంచిర్యాల జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్‌లో గల పాత హెడ్ పోస్టాఫీసులో ఈ నెల 15న పాస్‌పోర్టు సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మరో పది రోజుల్లో అధికారికంగా ప్రజాప్రతినిధులతో పూర్తి పాస్‌పోర్టు సేవాకేంద్రంను ప్రారంభించేందుకు పోస్టల్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 15 చొప్పున పాస్‌పోర్ట్ స్లాట్స్‌ను బుకింగ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్ విధానం ద్వారా బుకింగ్‌కు అవకాశం ఉంది. బుకింగ్ చేసుకున్న తర్వాత పోలీసుల వెరిఫికేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ల అనంతరం వారం రోజుల్లో పాస్‌పోర్టు అందజేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
దరఖాస్తు ఇలా..
ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్ బాట పడుతున్నాయి. పాస్‌ఫోర్ట్ సేవలూ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిష్టర్ కావాల్సి ఉంటుంది. పాస్‌ఫోర్ట్ సేవా వెబ్‌సైట్ హోమ్ పేజీలో అప్లై సెక్షన్‌లో కనిపించే రిజిష్టర్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఐడీ, పాస్‌వర్డ్‌లతో పాస్‌ఫోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ కావాలి. పాస్‌పోర్ట్ దరఖాస్తును పూర్తి చేసి సబ్‌మిట్ చేయాలి. సబ్‌మిట్ చేసిన అప్లికేషన్‌కు సంబంధించి అపాయింట్‌మెంట్ పొందేందుకు పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంటు లింక్‌పై క్లిక్ చేయాలి. బుకింగ్ అపాయింట్‌మెంట్‌కు ఆన్‌లైన్ చెల్లింపు తప్పనిసరి కాబట్టి ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఇది పూర్తయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ లింక్ క్లిక్ చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని అపాయింట్‌మెంట్ బుక్ చేసిన సమయానికి సంబంధిత పాస్‌పోర్ట్ çసేవా కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో పాస్‌పోర్ట్ ఆన్‌లైన్ బుకింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది.
అవసరమైన పత్రాలు..
భారత్‌లో విదేశీ ప్రయాణాలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాస్‌పోర్ట్ దరఖాస్తుల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. పాత నిబంధనల ప్రకారం పాస్‌పోర్ట్ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అన్ని రకాల పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. అవన్నీ ఒకేవిధంగా ఉండాలి, ఎందులోనైన ఒక్క చిన్నతప్పు దొరికినా ఇక అంతే సంగతి కథ మళ్లీ మొదటికి వచ్చేది. ఒకవేళ అన్ని ఉన్నా ఇచ్చిన సమాచారాన్ని నిజ నిర్ధారణ చేసుకునేందుకు పోలీస్ విచారణ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ప్రజల సౌలభ్యం కోసం తాజాగా విదేశాంగ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు దరఖాస్తుతోపాటు నాలుగు పత్రాలు ఉంటే చాలు వారం రోజుల్లో పాస్‌పోర్ట్ చేతిలో ఉంటుంది. ఆధార్‌కార్డు(ఇందులో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి), ఎలక్ట్రానిక్ ఫొటో ఐడెంటికార్డు, పాన్‌కార్డ్, లాయర్ అఫిడవిట్(స్థానికత, క్రిమినల్ రికార్ట్, ఇంటి చిరునామతో కూడిన వివరాలు పొందుపరిచి ఉండాలి) ఇవి సమర్పిస్తే చాలు ఇందులో ఉన్న సమాచారం నిజమని నిర్ధారించుకున్న తర్వాత పాస్‌పోర్ట్ జారీ చేస్తారు.
తగ్గనున్న దూరభారం..
మంచిర్యాలలో పోస్టాఫీస్‌కు అనుసంధానం చేస్తూ పాస్‌పోర్టు సేవలు ప్రారంభించనున్నారు. కార్యాలయం ఏర్పాటు, ఆఫీస్ నిర్మాణం సుమారుగా పూర్తయింది. ఆన్‌లైన్ ద్వారా స్లాట్స్ బుకింగ్ ప్రక్రియ మొదలైంది. రోజుకు 15 చొప్పున స్లాట్స్ బుకింగ్ అవుతున్నాయి. గతంలో వందకు పైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌కు వెళ్లేవారు. ఒక రోజు ముందుగానే అక్కడికి చేరుకొని లాడ్జీలు, బంధువుల ఇళ్లలో రెండ్రోజులు ఉండాల్సి వచ్చేది. మంచిర్యాలలో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు కావడంతో కుమురంభీం, మంచిర్యాల జిల్లాల ప్రజలకు ఎటూ వంద కిలోమీటర్లలోపే అందుబాటులోకి రానుంది. రెండు జిల్లాల ప్రజలు పాస్‌పోర్టు పొందడం ఇకపై సులభతరం కానుంది.
పాస్‌పోర్టు ఇక సులువు
Published Thu, Feb 28 2019 7:54 AM | Last Updated on Thu, Feb 28 2019 7:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment