వేలిముద్రతో ‘వెరీ ఫాస్ట్‌’ | Passport Verification Easy With Fingerprints | Sakshi
Sakshi News home page

వేలిముద్రతో ‘వెరీ ఫాస్ట్‌’

Published Thu, Jul 18 2019 9:50 AM | Last Updated on Mon, Jul 22 2019 12:13 PM

Passport Verification Easy With Fingerprints - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌.. ఒకప్పుడు పెద్ద ప్రహసనం. కానీ కొన్నాళ్ల క్రితం ఈ ప్రక్రియను పోలీసు విభాగం సులభతరం చేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలోనే పూర్తి చేస్తోంది. అయితే, ఏ ఒక్క నేరచరితుడికీ పాస్‌పోర్ట్‌ జారీ కాకూడదనే ఉద్దేశంతో అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా ‘వెరీ ఫాస్ట్‌’లో ఫింగర్‌ ప్రింట్స్‌ వెరిఫికేషన్‌ను సైతం భాగం చేసింది. ఇది అమల్లోకి తెచ్చాక మహానగరంలో 40 మంది గత చరిత్ర బయటపడి వారికి పాస్‌పోర్టులు నిలిచిపోయాయి. ఈ విధానాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేసేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
నగరం నుంచి ఏటా కొన్ని లక్షల మంది పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఇలా పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి వెళ్లే దరఖాస్తులు ప్రాథమిక పరిశీలన తర్వాత వెరిఫికేషన్‌ కోసం పోలీసు విభాగానికి చేరతాయి. స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్బీ) సిబ్బంది స్థానిక పోలీస్‌ స్టేషన్‌తో పాటు క్షేత్రస్థాయిలోనూ తనిఖీ చేస్తారు.

పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ మరింత కఠినం  
వీరిచ్చే నివేదిక ఆధారంగా సదరు దరఖాస్తుదారుకు రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి పాస్‌పోర్ట్‌ జారీ అవుతుంది. ఒకప్పుడు ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కనీసం నెలరోజులు పట్టేది. కొన్నేళ్ల క్రితం ‘వెరీఫాస్ట్‌’ అనే విధానం ప్రవేశపెట్టిన పోలీసు విభాగం పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ చేసింది. అభ్యర్థి పాస్‌పోర్ట్‌ దరఖాస్తు చేసిన నాటి నుంచి గరిష్టంగా 72 గంటల్లో పోలీసు వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియలో భాగంగా నేరచరితుల రికార్డులను వెరీ ఫాస్ట్‌తో అనుసంధానించారు. ఫలితంగా నేరచరితుడై ఉండీ పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ విషయం ఈ వెరిఫికేషన్‌లో బయటపడి, అప్లికేషన్‌ తిరస్కారానికి గురవుతోంది. దీనికి తోడు వరసగా నేరాలు చేసే నేరగాళ్లలో కొందరు తమ చరిత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకూ కొత్త ఎత్తులు వేయడం ప్రారంభించారు. పోలీసులకు చిక్కినప్పుడు, పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేస్తున్న సందర్భంలోనూ పేర్లను మార్చి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారు తమ పేర్లను పూర్తిగా మార్చరు. ఎక్కువగా స్పెల్లింగ్స్‌ మార్చేస్తూ కథ నడుపుతున్నారు. ఇదే విధానాన్ని పాస్‌పోర్ట్‌ దరఖాస్తు సమయంలోనూ అవలంబిస్తున్నారు. ఉదాహరణకు పేరు చివరలో ‘అయ్య’ అని వచ్చే పేరునే తీసుకుంటే అరెస్ట్‌ అయినప్పుడు చివరి స్పెల్లింగ్‌ (్గ్గఅ) ఒకలా, పాస్‌పోర్ట్‌ దరఖాస్తులో (ఐఅఏ) మరోలా రాస్తూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వారికీ చెక్‌ చెప్పడానికి అధికారులు వెరీఫాస్ట్‌లో ఫింగర్‌ ప్రింట్‌ ఎనాలసిస్‌ అంశాన్నీ చేర్చారు.

ఆన్‌లైన్‌లోనే కోర్టు కేసుల వివరాలు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ–కోర్ట్స్‌ విధానం అమలులో ఉంది. వివిధ సివిల్, క్రిమినల్‌ న్యాయస్థానాల్లో ఉన్న కేసులకు సంబంధించిన సమగ్ర వివరాలను నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) క్రోడీకరిస్తోంది. దాదాపు 19 వేల కోర్టులకు సంబంధించిన ఏడున్నర కోట్లకు పైగా రికార్డులతో డేటాబేస్‌ ఏర్పాటైంది. ఆయా న్యాయస్థానాల్లో ఉన్న అన్ని తరహా కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. దీని ఆధారంగానే పోలీసు విభాగం ‘వెరిఫై’ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఆయా కేసుల్లో నిందితులుగా, పిటిషనర్లుగా ఉన్న వారి పేర్లు, ఇతర వివరాలతో కూడిన ప్రత్యేక డేటాబేస్‌కు సెర్చ్‌ ఇంజన్‌ అనుసంధానించారు. దాంతా కేసుల వివరాలు నిమిషాల్లో వస్తున్నాయి. అలాగే పోలీసు డేటాతోనూ అనుసంధానించారు. వివిధ నేరాల్లో అరెస్టు అయినప్పుడు నిందితుల నుంచి పోలీసులు వేలిముద్రలు సేకరిస్తారు. ఈ డేటాబేస్‌ను సైతం వెరిఫాస్ట్‌తో అనుసంధానించారు. ఫలింతంగా ట్యాబ్‌ తీసుకుని వెరిఫికేషన్‌కు వెళ్ళిన ఎస్బీ సిబ్బంది అతడి వివరాలను ఆన్‌లైన్‌తో తనిఖీ చేస్తారు. అలా చేసినప్పుడు క్షణాల్లో ఆ వ్యక్తి దాచిన, ‘మార్చిన’ నేరచరిత్ర బయట పడుతోంది.  

ప్రస్తుతం రాజధాని నగరంలోనిహైదరాబాద్, సైబరాబాద్,రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలోనూ పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ కోసం ‘వెరీ ఫాస్ట్‌’ అమల్లో ఉంది. ఇప్పుడు ఇందులో భాగంగా ఫింగర్‌ ప్రింట్స్‌ను సైతం తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ పక్కాగా సాగుతున్న ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగావిస్తరించడానికి పోలీసు విభాగం కసరత్తు ప్రారంభించింది.’’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement