సాక్షి, నల్లగొండ : శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ, ఆక్సిజన్ సరఫరా లేక కొడుకు నరకయాతన పడుతుండగా... ఏం చేయాలో దిక్కుతోచక కన్నతల్లి తల్లడిల్లింది. బిడ్డను పిలుస్తూ, సపర్యలు చేస్తూ రోదించింది. ఆమె అలా చూస్తుం డగానే కుమారుడి ప్రాణం గాల్లో కలిసి పోయింది. ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి ఎందరి హృదయాలనో బరువెక్కించింది. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఈ ఘటన జరిగింది. దీన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం సల్కునూరు గ్రామానికి చెందిన బొప్పని యాదయ్య (40) ఆరోగ్యం బాగోలేక శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేరగా, శనివారం సాయంత్రం శ్వాస ఆడకపోవడంతో ఆక్సిజన్ అందించారు. కొద్దిసేపటి తర్వాత ఆక్సిజన్ అయిపోయింది. తల్లి లక్ష్మమ్మ కుమారుడి అవస్థను చూసి ఎంతగా రోదించినా ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదు. గిలగిలలాడిన యాదయ్య తుదిశ్వాస విడిచాడు.
యాదయ్య లారీడ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొంతకాలంగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతని భార్య కూడా ఐదేళ్ల క్రితం చనిపోయింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి లక్ష్మమ్మ తన పెన్షన్ డబ్బులతోనే యాదయ్య, అతని పిల్లలను సాకుతోంది. ఈ క్రమంలో యాదయ్యకు ఆయాసం ఎక్కువ కావడంతో శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చింది. పరీక్షించిన వైద్యులు శ్వాససంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించినా.. కరోనా లక్షణాలు ఉండడంతో అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో చేర్చారు. అతను శ్వాస ఆడక శనివారం సాయంత్రం మరణించాడు.
సకాలంలో వైద్యం అందితే బతికేవాడు
నా కుమారుడికి సరైన సమయంలో వైద్యం, ఆక్సిజన్ అందితే బతికేవాడని తల్లి లక్ష్మమ్మ తెలిపింది. డాక్టర్లు ఎవరూ పట్టించుకోలేదని, ఆక్సిజన్ పెట్టినా అది అయిపోవడంతో ఊపిరి పీల్చుకోలేక చనిపోయినట్లు ఆరోపించింది. యాదయ్యకు కరోనా లక్షణాలు ఉండడంతో అతని నుంచి నమూనాలు తీసుకుని పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌కు పంపినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇంకా రిజల్ట్ రాలేదని పేర్కొన్నాయి.
సుమోటోగా కేసు నమోదు
ఆస్పత్రి బెడ్‌పై కుమారుడు యాదయ్యకు తల్లి సేవలు చేస్తూ రోదిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ ఆగస్టు 21లోగా అన్ని ఆధారాలతో పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.
నివేదిక కోరిన కలెక్టర్
యువకుడి మృతిపై పూర్తిస్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహను ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం యాదయ్య తీవ్ర శ్వాస ఇబ్బంది, దగ్గు, జ్వరంతో చికిత్స కోసం 17న ఆస్పత్రిలో చేరాడని, అతను అప్పటికే అలర్జి, క్రానిక్ అబ్స్‌ట్రక్టివ్ పల్మనరి వ్యాధి (సీఓపీడీ)తో బాధపడుతున్నాడని కలెక్టర్ వివరించారు. వచ్చిన వెంటనే కరోనా అనుమానిత వార్డులో చేర్చుకుని సంబంధిత డాక్టర్, సిబ్బంది శక్తివంచన లేకుండా వైద్యసేవలు అందించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయాడన్నారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే సంబంధీకులపై చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్‌ఆర్‌సీ నుంచి ఇంకా నోటీసులు రాలేదని, వచ్చాక స్పందిస్తామని తెలిపారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment