పోలవరం, పట్టిసీమపై పోరాటం
- పోలవరంలో అంతర్భాగంగానే పట్టిసీమ: హరీశ్
- తెలంగాణకు సంబంధం లేదంటే ఎలా?
- ఇరు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు
- పోలవరం ఎత్తును ఎలా పెంచుతారో చూస్తామని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో గొడవకు కారణమైన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల వ్యవహారం గురువారం రాష్ర్ట శాసన మండలి లోనూ ప్రస్తావనకు వచ్చింది. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటికే ఖమ్మంజిల్లాలోని ఏడు మండలాలను ముంచిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు పోలవరం ఎత్తును 15అడుగుల మేర పెంచేం దుకు ప్రయత్నిస్తున్నారని పొంగులేటి వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ‘తెలంగాణపై బాబు కుట్రలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. పోలవరం డిజైనే మార్చాలని పోరాడుతుంటే దాన్ని 15 అడుగుల ఎత్తును ఎలా పెంచుతారో చూస్తాం. పట్టిసీమపై తెలంగాణకు, కేసీఆర్‌కు ఏం సంబంధమని అసెం బ్లీలో చెప్పిన బాబు.. గత జనవరి 1న ఇచ్చిన జీవో నెంబర్1లో మాత్రం పోలవరం లో అంతర్భాగంగానే పట్టిసీమను నిర్మిస్తున్నట్లు స్పష్టంచేశారు.
గోదావరి నీటిని కృష్ణాకు తరలించి, పోలవరంలో అంతర్భాగంగా పట్టిసీమను నిర్మిస్తామని చెబుతూ తెలంగాణకు సంబంధం లేదంటే ఎలా? పోలవరం ద్వారా 80 టీఎంసీలు తరలించినప్పుడు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక 35 టీఎంసీలు వాడుకోవాలని, ఆంధ్రప్రదేశ్ మిగతా 45టీఎంసీలు వాడుకోవాలని కృష్ణా జలాలపై బచావత్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఇప్పుడు తెలంగాణతో కలసి ఎగువన మూడు రాష్ట్రాలున్నాయి. తెలంగాణకు కూడా వాటా ఉంది. పట్టిసీమను తెలంగాణకు సంబంధం లేకుండా నిర్మించలేరు. పట్టిసీమతో పాటు పోలవరంపై తెలంగాణ పోరాటం చేస్తుంది’ అని స్పష్టంచేశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు నర్సారెడ్డి, పొట్ల నాగేశ్వర్‌రావు అభ్యంతరం వ్యక్తం చేయాలని చూసినా అవకాశమివ్వలేదు.
నాణ్యమైన బియ్యం సరఫరా: ఈటెల
పలువురు సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు మంత్రి ఈటెల రాజేందర్ సమాధానమిస్తూ.. సంక్షేమ వసతిగృహాలకు, మధ్యాహ్న భోజనానికి అత్యంత నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. 2,695 వసతి గృహాలు, 27,865 పాఠశాలలకు 20,389 టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 8,109 లెసెన్సులు ఉన్నట్లు సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి హరీశ్‌రావు తెలిపారు.