అన్ని రంగాల్లో తెలంగాణ పురోభివృద్ధి
⇒ స్పీకర్ మధుసూదనాచారి వెల్లడి
⇒ అసెంబ్లీ తెలుగు, ఉర్దూ వెబ్‌సైట్‌ల ఆవిష్కరణ
⇒ పాల్గొన్న మండలి చైర్మన్, డిప్యూటీ స్పీకర్, మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన రెండేళ్ల తొమ్మిది నెలల్లోనే తెలంగాణ అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించిందని శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి తెలిపారు. సోమవారం అసెంబ్లీ మీటింగ్ హాలులో తెలుగు, ఉర్దూ భాషల్లో అసెంబ్లీ వెబ్‌సైట్‌లు, డిపార్ట్‌మెంట్ సభ్యుల పోర్టల్స్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ తెలుగు వెబ్‌సైట్‌ను స్పీకర్ మధుసూదనాచారి, ఉర్దూ వెబ్‌సైట్‌ను శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మెంబర్స్ పోర్టల్‌ను శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. డిపార్ట్‌మెంటల్ పోర్టల్‌ను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ, సచివాలయ వెబ్‌సైట్‌లు తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రారంభం కావడం రాష్ట్రాభివృద్ధికి మచ్చుతునకగా అభివర్ణించారు. దేశంలో మరే రాష్ట్ర అసెంబ్లీలోనూ తెలంగాణ తరహాలో మూడు భాషల్లో వెబ్‌సైట్‌లను ప్రారంభించలేదన్నారు. గతంలో శాసనసభ , శాసన మండలి సమావేశాలంటే సామాన్యులకు సదభిప్రాయం ఉండేది కాదని...కానీ తెలంగాణ ఏర్పడ్డాక సభలు సామాన్యుల మెప్పు పొందేలా సాగుతున్నాయని మధుసూదనాచారి వివరించారు. వెబ్‌సైట్‌తో సభ్యులకు తగిన సమాచారం అందుతుందన్న స్పీకర్...వెబ్‌సైట్ రూపకల్పనకు కృషి చేసిన వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
స్థానిక భాషల్లో సభ వెబ్‌సైట్‌లు సంతోషకరం: స్వామిగౌడ్
స్థానిక భాషల్లో శాసనసభ వెబ్‌సైట్‌లు రావడం సంతోషదాయకమని మండలి చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. మంత్రి హరీశ్‌రావు కోరిక మేరకు ఉర్దూలో ప్రసంగించిన స్వామిగౌడ్...గతంలో హైదరాబాద్ పాలనా వ్యవహారాలు నడిచిన ఉర్దూ భాషలోనూ వెబ్‌సైట్‌ను రూపొందించడం ప్రభుత్వం ద్వితీయ భాషకు ఇస్తున్న ప్రాదాన్యతను చాటుతోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ వెబ్‌సైట్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెబ్‌సైట్ల ఏర్పాటుకు హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు.
స్థానిక భాషల్లో వెబ్‌సైట్లు రావడంతో తెలంగాణ శాసనసభ సచివాలయం దేశంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారమంతా అసెంబ్లీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో శాసనసభ సచివాలయం కార్యదర్శి రాజ సదారాం, జాయింట్ సెక్రటరీ నరసింహాచార్యులు, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.