- ఏపీ ప్రభుత్వపెద్దల కుసంస్కారం ఇది
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సభా వ్యవహారాల దృశ్యాలను టీడీపీఎల్పీ కార్యాలయంలో విడుదల చేయడం కుసంస్కారమని, ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకే చెల్లిందని తెలంగాణ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన గొడవ దృశ్యాలను టీడీపీ నాయకత్వం బహిరంగపర్చిన విషయం తెలిసిందే. గురువారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి హరీశ్‌రావు చాంబర్ ఎదుట బీజేపీ ఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతుండగా, అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆయన కూడా మాటలు కలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎలా నడుస్తుందో, ఏపీ అసెంబ్లీ ఎలా నడుస్తుందో గమనించండి అని పేర్కొన్నారు.
స్పీకర్ మధుసూదనాచారిపై టీడీపీ అవిశ్వాసం పెడుతుందన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకుపోగా ‘ఏం జరిగిందని అవిశ్వాసం పెడతారు..? తీర్మానం ఇచ్చి మూతులు పగుల గొట్టుకుంటారా..’ అని ప్రశ్నిం చారు. ‘ సభను సజావుగా, అర్ధవంతంగా నడపాలనుకున్నాం. అన్ని అంశాలపై చర్చ జరగాలన్నదే తమ అభిమతం. సభలోఉండి గొడవలు పెట్టాలనుకున్నారు. వాయిదాలు వేసుకుంటూ సభను నడపాలా.. పోడియంలోకి వెళితే ఎత్తి అవతల పడేసి సభను జరుపుతాం..’ అని పేర్కొన్నారు. సభలో ఉన్న వారికి మైకు వస్తుందని, మాట్లాడిన వారికి మాట్లాడినంత సమయం ఇస్తామన్నారు. పదేళ్ల అసెంబ్లీ చరిత్రలో ఇంత సమగ్రంగా చర్చలు ఎప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు. విపక్షాలకూ పూర్తిగా సహకరిస్తున్నామని, డిమాండ్లపై మాట్లాడేందుకు అధ్యయనానికి సమయం కావాలని విపక్షాలు కోరితే వాయిదా వేశామని చెప్పారు.