'పవన్ కళ్యాణ్ ను జనం రాళ్లతో కొడుతారు'
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ (ఓయూ జేఏసీ) తీవ్రస్థాయిలో మండిపడింది.
హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ (ఓయూ జేఏసీ) తీవ్రస్థాయిలో మండిపడింది. మెదక్ లోకసభకు జరిగే ఉప ఎన్నిక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించారు.
బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)కి జన సేన మద్దతిస్తే.. పవన్ కళ్యాణ్ ను జనం రాళ్లతో కొడుతారని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కు ప్రజలు బుద్ది చెప్పారని ఆయన అన్నారు.
మెదక్ లో జగ్గారెడ్డికి ప్రచారం చేస్తే ప్రజలు మరోసారి గుణపాఠం నేర్పుతారని పిడమర్తి రవి అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి ఓయూ జేఏసీ మద్దతు తెలుపుతోందని పిడమర్తి తెలిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పిడమర్తి రవితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.