
అర్చకులకు పే స్కేల్
► ప్రభుత్వ ఉద్యోగుల తరహా వేతనాలు
► నవంబర్ నుంచి అమలు
► ప్రస్తుతం ‘ధూపదీప నైవేద్యం’ అమలవుతున్న దేవాలయాలు1,805
► అదనంగా వర్తింప చేయనున్న దేవాలయాలు 3,000
► ఆలయాల ఆధ్వర్యంలో ఉన్న భూములు (ఎకరాల్లో) 83,000
సాక్షి, హైదరాబాద్: అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వచ్చే నవంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పే స్కేల్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 1,805 దేవాలయాల్లో అమలవుతున్న ధూపదీప నైవేద్య పథకాన్ని అదనంగా మరో 3 వేల దేవాలయాలకు వర్తింపచేస్తామని ప్రకటించారు. దేవాలయాల నిర్వహణ సంబంధమైన అంశాలను పర్యవేక్షించడానికి కొత్తగా ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అర్చకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ‘‘దేవాలయాల భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో 83 వేల ఎకరాల భూములు దేవాలయాల ఆధ్వర్యంలో ఉన్నట్లు లెక్క ఉంది. ఈ భూమిని రక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అర్చకులు కూడా దేవాలయాల నిర్వహణ, దైవ సంబంధ కార్యక్రమాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. పొరపాట్లు కాకుండా చూడాలి. అర్చన బాగా చేస్తే భగవంతుడు కూడా మనల్ని దీవిస్తాడు.
ఉద్యమ సమయంలో మీరంతా బాగా పూజలు చేసి, ప్రత్యేక రాష్ట్రం రావాలని కోరుకున్నారు. నేను ఏ గుడికి వెళ్లినా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, తెలంగాణ ప్రాప్తిరస్తు అని దీవించేవారు. దేవుడు అనుగ్రహించాడు. మీ దీవెనలు ఫలించాయి. రాష్ట్రం వచ్చింది. దేవాలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమం, బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నాం. ధార్మిక పరిషత్‌ను మరింత విస్తృతపరుస్తాం. శృంగేరి పీఠాధిపతులు, చినజీయర్ స్వామి, కంచి పీఠాధిపతుల సలహాలు, సూచనలు పాటించి ధార్మిక పరిషత్ కార్యక్రమాలు రూపొందిస్తాం. అర్చకుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇతర ముఖ్య నిర్ణయాలు తీసుకున్న ఈ సమయంలో నాకు 15 లడ్డూలు తిన్నంత ఆనందంగా ఉంది’’అని ముఖ్యమంత్రి అన్నారు.
అర్చకుల హర్షం..
సుదీర్ఘకాలంగా ఉన్న తమ డిమాండ్‌ను పరిష్కరించినందుకు తెలంగాణ అర్చక, ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి, అధ్యక్షుడు రంగారెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అర్చకులతో సీఎం భేటీ సందర్భంగా నల్లకుంట నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు అర్చక, ఉద్యోగులు ర్యాలీగా తరలివెళ్లారు.