లాక్‌డౌన్‌లోనూ విషం చిమ్ముతోంది.. | PCB Testing on Musi River Hyderabad | Sakshi
Sakshi News home page

మూసీ మారట్లే!

Published Wed, Apr 22 2020 8:03 AM | Last Updated on Wed, Apr 22 2020 8:03 AM

PCB Testing on Musi River Hyderabad - Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని ఎన్నో ప్రముఖ నదులు,నగరాలు సైతం కాలుష్యం నుంచి కాస్త ఉపశమనం పొందాయి. కానీ మన నగరంలోని మూసీ నది మాత్రం మారలే. ఎప్పటిలాగే విపరీతమైన కాలుష్యంతో వర్ధిల్లుతోంది. జనసంచారంలేకపోవడం, పరిశ్రమలు నడవకపోవడం తదితర కారణాలతో దేశంలోని గంగా, యమునా నదులు, ఢిల్లీ వంటి మహానగరాలు స్వచ్ఛంగా మారాయని ఇటీవల వెల్లడైంది. కానీ మూసీలో కాలుష్యం తగ్గకపోగా అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదికలో వెల్లడైంది. దాదాపు 800 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తుండడంతోనే మూసీ కాలుష్య కాసారమవుతోందనితెలుస్తోంది. అతిముఖ్యమైన బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ) బాపూ ఘాట్‌ వద్ద 28 మిల్లీ గ్రాములు, నాగోల్‌ వద్ద 26, ప్రతాపసింగారం వద్ద 26 మిల్లీగ్రాముల మేర
నమోదవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ వేళలోనూ చారిత్రక మూసీ మురికి వదలడంలేదు. కాలుష్య కోరల్లో చిక్కి నాడూ.. నేడు విలవిల్లాడుతూనే ఉంది. ఈ నదిలో కాలుష్యం మోతాదు అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదికలో వెల్లడైంది. ఈ నీటిలో జలచరాలు బతికేందుకు అవసరమైన కరిగిన ఆక్సిజన్‌ శాతం ప్రతి లీటరు నీటిలో 4 మిల్లీ గ్రాములుండాల్సి ఉండగా..కేవలం 1.06 మిల్లీగ్రాములే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ‘నమామి గంగే’ తరహాలో ఈ నది ప్రక్షాళనకు సర్కారు విభాగాలు నడుం బిగించకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. లాక్‌డౌన్‌ కారణంగా మహానగరం పరిధిలో ప్రస్తుతం శబ్ద, వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టినప్పటికీ మూసీ కాలుష్యం తగ్గకపోవడానికి ప్రధాన కారణం..బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు, గృహ సముదాయాల నుంచి కాలుష్య జలాలు ఈ నదిలో కలుస్తుండడమేనని స్పష్టమౌతోంది.

ప్రధానంగా నగరంలోకి మూసీ నది ప్రవేశిస్తోన్న బాపూఘాట్‌ నుంచి ప్రతాప సింగారం వరకు సుమారు 44 కి.మీ మార్గంలో కాలుష్యకాసారంగా మారడం గమనార్హం. గత పదేళ్లుగా ఈ నది ప్రక్షాళనకు సిద్ధంచేసిన మాస్టర్‌ప్లాన్‌లు కాగితాలకే పరిమితం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. మూసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా అడుగు ముందుకు పడడంలేదు. మరోవైపు నగరం పరిధిలోని సుమారు 500కు పైగా ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించే ప్రక్రియ సైతం అటకెక్కడంతో మూసీ పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం మహానగరం పరిధిలోని గృహßæ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నిత్యం విడుదలవుతున్న 1,600 మిలియన్‌ లీటర్ల మురుగు నీటిలో జలమండలి కేవలం 800 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలను మాత్రమే ఏడు ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మరో 800 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తుండడంతోనే ఇది రోజురోజుకూ కాలుష్య కాసారమవుతోంది.

పరిశ్రమల కాలుష్యంతో విలవిల...
కొందరు పరిశ్రమల నిర్వాహకుల కాసుల కక్కుర్తి మూసీ ఉసురు తీస్తోంది. బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్‌ కంపెనీల నుంచి వెలువడుతున్న ప్రమాదకర పారిశ్రామిక, రసాయన వ్యర్థాలను నిబంధనల ప్రకారం సమీపంలోని శుద్ధి కేంద్రాలకు పంపించాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో ట్యాంకర్‌కు రూ.10 వేలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట సెప్టిక్‌ ట్యాంకర్లు, నీళ్ల ట్యాంకర్లు, డీసీఎంల్లో నగర శివారుల్లోకి తరలించి మూసీలో డంప్‌ చేస్తుండటంతో మూసీ కాలుష్య కాసారమవుతోంది.

కాలుష్య పరిమితులివీ..
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం లీటర్‌ నీటిలో కరిగిన ఆక్సీజన్‌ (డీఓ) పరిమాణం కనీసం 4 మిల్లీ గ్రాములుండాలి. అంతకంటే తక్కువగా ఉంటే ఆ చెరువు లేదా కుంటలో జలచరాలు బతకవు. ఇక బయాలాజికల్‌ ఆక్సీజన్‌ డిమాండ్‌( బీఓడీ) విషయానికొస్తే లీటర్‌ నీటి లో 3 ఎంజీలను మించకూడదు. డీఓ తగ్గుతున్న కొద్దీ బీఓడీ పెరుగుతుంది. ఇలా జరుగుతుంటే ఆ జల వనరుల్లో కాలుష్యం పెరుగుతుందని అర్థం.

కాలుష్య కాసారమిలా...
బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ) బాపూ ఘాట్‌ వద్ద 28 మిల్లీ గ్రాములు, నాగోల్‌ వద్ద 26, ప్రతాపసింగారం వద్ద 26 మిల్లీగ్రాముల మేర నమోదవడం గమనార్హం. ఇది నిర్దేశిత పరిమితుల కంటే చాలా అధికం.  ఇక నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ (డీఓ) శాతం 4 మిల్లీ గ్రాములుండాలి. కానీ బాపూఘాట్‌ వద్ద 1.6 ఎంజీ, నాగోల్‌ వద్ద 0.06 ఎంజీ, ప్రతాపసింగారం వద్ద 1.0 ఎంజీగా నమోదైంది. అంటే నీటిలో కరిగిన ఆక్సిజన్‌ శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో జలచరాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.

నమామి గంగే తరహాలో ప్రక్షాళన ఎప్పుడో..?
జాతీయస్థాయిలో కాలుష్యకారక నదులను ప్రక్షాళన చేసే క్రమంలో గంగా నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకు అవసరమైన నిధులు, సిబ్బంది.యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. కానీ జాతీయస్థాయిలో కాలుష్యకారక నదుల్లో నాలుగోస్థానం దక్కించుకున్న మూసీ నది ప్రక్షాళనపై అటు కేంద్రం..ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో భాగ్యనగర జీవనరేఖ అయిన మూసీ మురికి కూపంగా మారుతుండడం గమనార్హం.

ప్రక్షాళనకు ప్రణాళిక ఇదే..
మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండో దశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తి చేస్తే కొంత మేర ఉపశమనం ఉంటుంది. ఇందుకు సుమారు రూ.5000 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున నూతనంగా మొత్తం.. పది సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, మరో పది ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉంది. ఎస్టీపీలు,ఈటీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలు: అంబర్‌పేట్‌ (142ఎంఎల్‌డీ), నాగోల్‌(140ఎంఎల్‌డీ), నల్లచెరువు (80ఎంఎల్‌డీ), హైదర్షాకోట్‌ (30), అత్తాపూర్‌ (70ఎంఎల్‌డీ), మీరాలం(6ఎంఎల్‌డీ), ఫతేనగర్‌ (30ఎంఎల్‌డీ), ఐడీపీఎల్‌ టౌన్‌షిప్‌ (59ఎంఎల్‌డీ), నాగారం(29ఎంఎల్‌డీ), కుంట్లూర్, హయత్‌నగర్‌ (24 ఎంఎల్‌డీ) రీసైక్లింగ్‌ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్‌ టౌన్‌షిప్, నాగారం కాప్రా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement