ఎకరా తడవట్లే.. | Pedda vagu Project Delayed in Sangareddy | Sakshi
Sakshi News home page

ఎకరా తడవట్లే..

Published Mon, Sep 16 2019 12:40 PM | Last Updated on Mon, Sep 16 2019 12:40 PM

Pedda vagu Project Delayed in Sangareddy - Sakshi

అలుగుపై నుంచి వృథాగా కర్ణాటకకు వెళ్తున్న వరద నీరు(ఫైల్‌)

ఐదు దశాబ్దాలు గడిచినా పెద్దవాగు ప్రాజెక్టు నుంచి సాగు నీరందడం లేదు. 16 వందల ఎకరాలకు నీరందించాల్సిన పెద్దవాగు ప్రాజెక్ట్‌ ఐదు దశాబ్దాల కాలంలో ఇప్పటి వరకు గరిష్టంగా 6 వందల ఎకరాలకు మాత్రమే నీరందించగలిగింది. ప్రస్తుతం మరమ్మతులు చేపట్టకపోవడంతో ఎకరా పొలానికి సైతం నీరందించలేని దుస్థితి నెలకొంది. మండలంలోని పొలాలను సస్యశ్యామలం చేయాల్సిన నీరు కర్ణాటక రాష్ట్రంలోకి వృథాగా తరలిపోతోంది. విధిలేని పరిస్థితుల్లో రైతులు ఆయకట్టు భూముల్లో వర్షాధార పంటలు సాగుచేస్తున్నారు.– కోహీర్‌(జహీరాబాద్‌)

గొడిగార్‌పల్లి పెద్దవాగు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి 1968లో శ్రీకారం చుట్టారు. ఎడమ కాల్వ నిర్మించి గొడిగార్‌పల్లి, శేడెగుట్ట తండా, జహీరాబాద్‌ మండలంలోని మల్చల్మ, జాడిమల్కాపూర్‌ గ్రామాల పరిధిలోని 675 ఎకరాలకు, కుడికాల్వ నుంచి గొడిగార్‌పల్లి,పర్సపల్లి గ్రామాల పరిధిలోని 425 ఎకరాల భూమి సాగు లక్ష్యంగా కాల్వల నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్ట్‌ నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు పర్సపల్లి, మల్చల్మ, జాడిమల్కాపూర్‌ గ్రామాల శివారులోని పంట పొలాలకు చుక్క  నీరందలేదు. గొడిగార్‌పల్లి, శేడెగుట్ట తండాల పరిధిలో 5 వందల ఎకరాల సాగు లక్ష్యంగా చేపట్టిన ఎత్తిపోతల పథకం సైతం రైతులకు నీరందించకుండానే నిరుపయోగమైంది.

లోపభూయిష్టంగా కాల్వల నిర్మాణం
పెద్దవాగు ప్రాజెక్ట్‌ పనులు లోపభూయిష్టంగా ఉన్నాయి. రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన కుడి కాల్వ, పైపులైన్‌ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. పర్సపల్లి గ్రామ రైతులకు నీరందించడానికి నిర్మించిన అక్వడక్టు మొదట్లోనే కూలిపోయింది. పంట కాల్వలు పటిష్టంగా నిర్మించకపోవడంతో నీరు వృథాగా పోతోంది. కాల్వలు నల్లరేగడి భూముల నుంచి తవ్వించారు. కాల్వలకు బుంగలుపడి నీరు వృథాగా పోతోంది. కాల్వలను సీసీబెడ్‌తో నిర్మించాలని రైతులు చేస్తున్న విజ్ఞప్తులను అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రాజెక్ట్‌ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు నిర్వహణ కోసం రూ. కోట్లు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోతోంది. పొలాలకు నీరందకుండా పోతోంది. పెద్దవాగు ప్రాజెక్ట్‌ను ఉపయోగంలోకి తేవడానికి తాజాగా రెండేళ్ల క్రితం నీటి పారుదల అధికారులు మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో భాగంగా 4.85 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించగా కేవలం రూ. 2.08 కోట్లకే మంజూరు లభించింది. టెండరు ప్రక్రియ పూర్తయి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు.

ఎత్తిపోతలు వృథా
పెద్దవాగు ప్రాజెక్ట్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియా అధికంగా ఉండడంతో వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుంటుంది. తొలకరిలో కురిసిన వర్షాలకే ప్రాజెక్ట్‌ నిండి అదనంగా వస్తున్న నీరు కర్ణాటకకు తరలి వెళ్తోంది. అదనపు నీటిని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో 1980లో మరో 5 వందల ఎకరాల భూమికి సాగు నీరందించాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఎత్తిపోతల పథకానికి అవసరమైన నీటిని నిల్వ చేయడానికి ప్రాజెక్ట్‌ అలుగుపై రెండున్నర ఫీట్ల ఎత్తుతో ఫాలింగ్‌ షెట్టర్లను నిర్మించారు. లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ ఫాలింగ్‌ షెట్టర్ల లక్ష్యం నెరవేరక నిరుపయోగమయ్యాయి. పథకంలో భాగంగా ఒక పంప్‌హౌస్‌ నిర్మించారు. మూడు విద్యుత్‌ మోటార్లను అమర్చ ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. వాచ్‌మెన్, వస్తు సామగ్రి కోసం రెండు గదులను నిర్మించారు.  పొలాలకు సాగు నీరందించడానికి అటవీ ప్రాంతంలో సుమారు కిలోమీటర్‌ మేర కాల్వల తవ్వకం చేపట్టారు. గట్టి రాతి నేలలు అడ్డుపడడంతో సదరు పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ రేటు గిట్టుబాటు కావడం లేదని పనులు పూర్తి చేయలేదు. అనంతరం పలుమార్లు కాల్వల తవ్వకం కోసం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు పనులు తీసుకోవడానికి ముందుకురాలేదు. తవ్విన కిలోమీటర్‌ కాల్వ రైతులకు ఏమాత్రం ఉపయోగపడ లేదు. సరైన కాపలా లేక ట్రాన్స్‌ఫార్మర్‌ విద్యుత్‌ పరికరాలు, విద్యుత్‌ మోటార్లు, కాల్వల్లో ఏర్పాటు చేసిన షాబాద్‌ రాళ్లను దొంగలు ఎత్తుకుపోయారు. దీంతో ఎత్తిపోతల పథకం పూర్తిగా నీరుగారిపోయింది. పెద్దవాగు ప్రాజెక్టును పూర్తి వినియోగంలోకి తేవడానికి సరిపడా నిధులు మంజూరు చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు.

వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా..
నాకు శేడెగుట్ట తండా శివారులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. గొడిగార్‌పల్లి ఎత్తిపోతల పథకం నుంచి సాగు కోసం నీరు వస్తుందని వేయికళ్లతో ఎదురు చూస్తున్నా. పథకం నిర్మించి 40 ఏండ్లు కావస్తున్నా ఇంతవరకు నీరు రాలేదు. రెండేళ్ల క్రితం బోరు వేశాను. ఏడాది పాటు పంటకు నీరందించింది. వర్షాలు లేక బోరు ఎండిపోయి నిరుపయోగమైంది. ఖరీఫ్‌లో వర్షాధార పంటలు మాత్రమే సాగు చేస్తున్నా. ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తేవడానికి చర్యలు తీసుకోవాలి.  –సోమ్లా నాయక్, రైతు òశెడెగుట్టతండా

నిధుల మంజూరయ్యాయి
పెద్దవాగు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేయడానికి నిధుల మంజూరు కోసం రూ. 4.85 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. అయితే రూ. 2.08 కోట్లకు మంజూరు లభించింది. టెండరు ద్వారా కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాం. పనులు ప్రారంభించకుండా జాప్యం చేస్తుండడంతో సదరు కాంట్రాక్టర్‌కు మూడు నోటీసులు ఇచ్చాం. ఫాలింగ్‌ షెట్టర్ల మరమ్మతుల కోసం రూ. 30 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. – ఉదయ్‌ భాస్కర్, డీఈ ఇరిగేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement