సాక్షి, కల్వకుర్తి టౌన్ : అసెంబ్లీ ఎన్నికల సందడి జోరందుకుంది. అభ్యర్ధులు ప్రచారంలో తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్ధులు, నాయకులు, కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరించినా, ఎన్నికల నియమావళి, నిబంధనలను అతిక్రమించినా శిక్ష తప్పదని చట్టాలు చెబుతున్నాయి. ఆయా సెక్షన్ల ప్రకారం దండనలు, జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఇంతకీ సెక్షన్లు ఏం చెబుతున్నాయి, అసలు ఆ సెక్షన్లు ఏమిటనే విషయాలు మీ కోసం..
ఎన్నికలు.. చట్టాలు
ప్రజాస్వామ్య వ్యవస్ధలో పాలకులను ఎన్నుకోవడానికి ఎన్నికలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువ కేసులు నమోదు చేస్తుంటారు. ప్రచారంలో పార్టీ అభ్యర్ధులు నాయకులు,కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరిస్తే దండన తప్పదు. సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పక్రియలో నామినేషన్ల పక్రియ, పరిశీలన, ఉపసంహారణ అంతా పూర్తయింది. ప్రస్తుతం అంతర్జాలంలో ఎన్నికల చట్టాలు, నిబంధనలను గురించి వెతకటం ప్రారంభించారు.
సెక్షన్ 125
జాతి, మతం, కులం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించటం, ఒత్తిడికి లోను చేస్తే ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు. 125 సెక్షన్ ప్రకారం ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే మూడేళ్ల పాటు జైలుశిక్ష లేదా జరిమానా, లేదంటే రెండింటినీ విధించవచ్చు.
సెక్షన్ 126
ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు. దీనికి రెండేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు.
సెక్షన్ 128
బహిరంగంగా ఓటు వేస్తే మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా.
సెక్షన్ 129
ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పోలీసులు పోటీ చేసే అభ్యర్ధికి సహకరించినా, ప్రభావం కలిగించిన శిక్షార్హులు. దీనికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించబడుతుంది.
సెక్షన్ 131
పోలింగ్ కేంద్రానికి సమీపంలో నియమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే, ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామాగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. దీనికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. రెండు కూడా విధించవచ్చు.
సెక్షన్ 133
ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలీంగ్ కేంద్రానికి చేరవేసేందుకు వాహనాలను సమకూర్చినా, అద్దెకు తీసుకున్నా శిక్షార్హులే. దీనికి గాను మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించవచ్చు.
సెక్షన్ 132
ఓటరు ఓటు వేసే సమయంలో నియమ నిబంధనలు పాటించని వారికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించవచ్చు.
సెక్షన్ 134
అధికార దుర్వినియోగానికి పాల్పడితే అందుకుగాను శిక్షార్హులే. దీనికి గాను రూ.500 జరిమానా విధించవచ్చు.
సెక్షన్ 134 అ
ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంట్ కానీ పోలింగ్ ఏజెంటుగా కానీ ఓట్ల లెక్కింపు సందర్భంగా గానీ ఏజెంటుగా వ్యవహరిస్తే వారు శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా.
సెక్షన్ 127
ఎన్నికల సమావేశం సందర్భంగా ఎలాంటి అల్లర్లకు పాల్పడినా, పోలీస్ అధికారి అయినా ఆ వ్యక్తులను అరెస్టు చేయవచ్చు. దీనికి ఆరునెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా విధించబడుతుంది.
సెక్షన్ 130
పోలింగ్ స్టేషన్ వద్ద 100 మీటర్ల లోపల ప్రచారం నిర్వహించకూడదు. దీనికి జరిమానా విధించబడుతుంది.
సెక్షన్ 135
పోలింగ్ కేంద్రం నుండి బ్యాలెట్ పేపరు, ఈవీఎం యంత్రం అపహారిస్తే వారు శిక్షార్హులు. దీనికి గాను ఏడాది పాటు జైలుశిక్ష,, రూ,500 జరిమానా విధించబడును.
సెక్షన్ 134 ఆ
పోలీస్‌స్టేషన్ల పరిసర ప్రాంతాలకు మారణాయుధాలతో వెళ్లడం శిక్షార్హం. దీనికి గాను ఏడాది పాటు జైలుశిక్ష రూ.,500 జరిమానా విధిస్తారు.
సెక్షన్ 49పీ
ఒక వ్యక్తి ఓటు మరో వ్యక్తి ఓటు వేస్తే పోలింగ్ అధికారి సదరు ఓటరు 49పీ సెక్షన్ ప్రకారం తన ఆధారాలు చూపాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సదరు ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
సెక్షన్ 135 ఈ
పోలింగ్ కౌటింగ్ రోజున మద్యం విక్రయించటం, మద్యం, డబ్బు ఇవ్వడానికి ఆశ చూపటం నేరం. దీనికి గాను 6 నెలల జైలుశిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తారు.
పోలింగ్ కేంద్రాల్లో నో సెల్ఫీ
సాక్షి, కల్వకుర్తి టౌన్ / అచ్చంపేట : సాంకేతిక పెరుగుతున్నా కొద్దీ వయసు తారతమ్యం లేకుండా సమయం, సందర్భం లేకుండా ప్రతి ఒక్కరు సెల్ఫీలపై మోజు పడుతున్నారు. అదే అలవాటులో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎవరైనా ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నించటం కుదరదు. ఒకవేళ ఎవరూ చూడటం లేదని, సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంటుంది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీలు పూర్తిగా నిషేధం.
నిబంధనలను విరుద్ధంగా చూపిస్తూ ఓటు వేసినట్లుగా గుర్తిస్తే అధికారులు వెంటనే ఎన్నికల సంఘం ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 49 ఎం(ఓటు రహస్యం) బహిర్గతం నియమం కింద బయటకు పంపిస్తారు. వేసిన ఓటును సెక్షన్ 17–ఏలో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. అయితే, రూల్ నెంబర్ 49 ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు తాము ఓటు వేయడానికి 18 ఏళ్లు దాటిన సహాయకులను వెంట తీసుకువెళ్లొచ్చు. కానీ సహాయకుడు అంధులైన ఓటరు ఓటును బహిరంగ పర్చనని నిబంధన 10లో ధృవీకరించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment