లాక్‌డౌన్ కారణంగా మందుబాబులు మద్యం లేక విలవిల్లాడుతున్నారు. నాలుగు వారాలుగా మందు తాగకపోవడంతో ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ లక్షణాలతో పలువురు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మద్యపానం శాశ్వతంగా మానివేసేందుకు ఇదే సువర్ణావకాశమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది ఆరోగ్యపరంగా అన్ని విధాలా శ్రేయస్కరమని వారు చెబుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ అవకాశాన్ని మందుబాబులు సద్వినియోగం చేసుకొని మద్యపానాన్ని మానేయాలంటున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: మందుబాబులకు కరోనా లాక్‌డౌన్ సంధికాలంగా మారింది. చుక్క మందు దొరక్క విలవిల్లాడుతున్నారు. మద్యం విక్రయాలు నిలుపుదలకు సంబంధించి రాష్ట్ర చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం ఇది. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో రెండేళ్లపాటు మద్యనిషేధం అమలులో ఉన్నప్పటికీ నగరంలో ఆరోగ్య కారణాలు చూపిన వారికి, ఆర్మీ క్యాంటీన్లు, స్టార్ హోటళ్లలో మద్యం, కల్లు కాంపౌండ్లలో కల్లు దొరికేది. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మద్యం గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అయ్యింది. ఇదంతా ఒకప్పటి చరిత్ర. కానీ కోవిడ్ వైరస్ నియంత్రణకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలవుతుండటంతో గ్రేటర్‌లో మందుబాబులకు చుక్క దొరక్క చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. నాలుగు వారాలుగా మద్యం తాగకపోవడంతో ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ అనే మానసిక లక్షణాలతో బాధపడుతున్న సుమారు 800 మందికి ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చికిత్స అందించారు. ప్రస్తుతం వీరంతా సురక్షితంగా ఇళ్లకు చేరుకోవడం విశేషం. అయితే.. మద్యం మానేయాలనుకునే వారికి ఈ లాక్‌డౌన్ వరంగా మారుతుండగా.. ఇదే అదనుగా మద్యాన్ని బ్లాక్‌లో విక్రయించి సుమారు 5 నుంచి 10 శాతం మందికి సరఫరా చేస్తున్న కేటుగాళ్లు అందినకాడికి దండుకోవడం గమనార్హం.(కట్టు తప్పితే కష్టమే!)
సుదీర్ఘ లాక్‌డౌన్..
మద్యం విక్రయాలకు సంబంధించి నాడు ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన 1956 నుంచి ఇప్పటివరకు ఇదే సుదీర్ఘ కాలం. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేని సమయం ఇదేనని ఆబ్కారీ అధికారులు చెబుతుండటం విశేషం. గతంలో మద్యపాన నిషేధం విధించినప్పటికీ ఆర్మీ క్యాంటీన్లు, ఆరోగ్య కారణాలు చూపినవారికి, స్టార్ హోటళ్లు, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా అయ్యేది. కానీ ఇప్పుడు పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నామంటున్నారు. కాగా మహానగరం పరిధిలో సుమారు 200 మద్యం దుకాణాలు మరో 300 వరకు బార్లున్నాయి. వీటిల్లో రోజువారీగా సుమారు రూ.30 కోట్ల విలువైన మద్యం విక్రయించేవారు. 34 రోజులుగా దుకాణాలు మూతపడటంతో సుమారు రూ.900 కోట్ల నుంచి రూ.1000 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు నిలిచిపోయినట్లు మద్యం వ్యాపారులు చెబుతున్నారు.
అన్నివిధాలా.. శ్రేయస్కరం
వేసవి కాలంలో మద్యపానం మానేయడంతో డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవడం, రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం సహా ఆరోగ్యపరంగా అన్ని విధాలా శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మద్యపానానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. కాగా ఇటీవల ఆల్కహాల్ దొరక్క విపరీత మానసిక ప్రవర్తన(ఆల్కహాల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్)తో ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో సుమారు 800 మంది చేరారు. వీరిలో 630 మందికి ఒకరోజు కౌన్సిలింగ్.. మరో 170 మందికి వారం రోజుల పాటు చికిత్సను విజయవంతంగా అందించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరంతా కోలుకొని సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారన్నారు. (క్వారంటైన్: బిర్యాని కోసం రగడ)
మద్యం బ్లాక్ దందా ఇలా..
రాయల్ స్టాగ్ రూ.3 వేలు.. బ్లెండర్స్ ప్రైడ్.. రూ.4 వేలు.. టీచర్స్.. రూ.5 నుంచి రూ.6 వేలు.. లైట్ బీర్.. రూ.500 ఏంటీ మందుబాటిళ్ల ధరల లెక్కలు అనుకుంటున్నారా..? అదేనండి మన గ్రేటర్ సిటీలో మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకొని పలువురు బ్లాక్‌మార్కెట్ వ్యాపారులు అందినకాడికి దండుకుంటున్నారు మరి. నెలరోజులుగా నగరంలో ఇలాంటి బ్లాక్ దందా పోలీసులు, ఆబ్కారీ అధికారులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కళ్లుగప్పి గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుండటం గమనార్హం. పలు మద్యం దుకాణాల యజమానులు తమ దుకాణాలకు ఎక్సైజ్ పోలీసులు సీల్ వేసినప్పటికీ ఇప్పటికే దుకాణాల్లో ఉన్న స్టాకును తమకు అత్యంత రహస్యంగా ఉండే ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలోని అన్ని దుకాణాల యజమానులు కాకపోయినా.. కొందరు అక్రమార్కులే ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇటీవల పాతనగంలోని బోయిగూడ ప్రాంతంలో సుమారు 400 కాటన్ల బీర్లు.. 129 కాటన్ల వివిధ బ్రాండ్లకు చెందిన విస్కీ బాటిళ్లు.. మొత్తంగా రూ.10 లక్షల విలువైన లిక్కర్‌ను తన దుకాణానికి అత్యంత సమీపంలో నిల్వచేసిన ఓ వైన్‌షాపు యజమాని గుట్టును ఆబ్కారీ పోలీసులు రట్టు చేసిన విషయం విదితమే.
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎమ్మార్పీ ధరలకు రెట్టింపు ధరలకు దుకాణాల నిర్వాహకులు బ్లాక్ దందా నిర్వహించే వారికి మందుబాటిళ్లను విక్రయిస్తుండగా.. మందుబాబుల నుంచి ఈ బ్లాక్ మార్కెట్ వ్యాపారులు అంతకు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఉదాహరణకు రూ.వెయ్యి విలువైన విస్కీ బాటిల్‌ను మద్యం దుకాణాల వారు రూ.2 వేలకు.. బ్లాక్ మార్కెట్ వ్యాపారులు రూ.4 వేలకు విక్రయిస్తుండటం గమనార్హం. అంటే ఎమ్మార్పీ కంటే మూడు రెట్ల నుంచి నాలుగురెట్లు అధికంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న వైనంతో మందుబాబులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఈ దందాపై తమకు ఫిర్యాదు అందితే స్పందిస్తామని ఆబ్కారీ అధికారులు తాపీగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment