సాక్షి, సిటీబ్యూరో: ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా పది రోజుల పాటు చుక్క మందు దొరకని పరిస్థితి. మద్యంతో పాటు ఈసారి కల్లుపైనా పూర్తి నియంత్రణ విధించడంతో మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కొందరు వింతగా ప్రవర్తిçస్తుంటే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. బుధవారంతో ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి వచ్చిన వారి సంఖ్య 500కు దాటింది. వాస్తవానికి 1956 నుంచి అన్ని రకాల మద్యం, కల్లు సరఫరాపై రాష్ట్రంలో ఎప్పుడూ నియంత్రణ లేదు. 1995, 1997లో 26 నెలల పాటు మద్యపాన నిషేధ సమయంలో కల్లు అందరికీ అందుబాటులో ఉండగా, సంపన్నులకు స్టార్ హోటళ్లలో, ఇక ఆర్మీ సిబ్బందికి మిలిటరీ క్యాంటిన్లలో మద్యం సరఫరా చేశారు. కానీ గతానికి పూర్తి భిన్నంగా ఈసారి ఆర్మీ క్యాంటిన్లతో పాటు స్టార్ హోటళ్లకు సరఫరా నిలిచిపోయి లాక్‌డౌన్ కావటం, ఏకంగా పది రోజుల పాటు మద్యం సరఫరా నిలిచిపోవటంకొత్త చరిత్రేనని మద్య నియంత్రణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధ సమయంలో పలు మినహాయింపులతో పాటు పక్క రాష్ట్రాల నుంచి మద్యం వచ్చేదని, ప్రస్తుతం దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో చీమ చిటుక్కుమనే పరిస్థితి లేకపోవటంతో మద్య నియంత్రణ పూర్తి స్థాయి అమలవుతోందని పేర్కొంటున్నారు. మత్తును వదిలించేందుకు ఇదే సరైన సమయమని పేర్కొంటున్నారు.
కుప్పలుతెప్పలుగా.. మత్తు బాధితులు
మద్యం, కల్లు దొరక్క కుప్పలు తెప్పలుగా బాధితులు ఆస్పత్రుల పాలవుతున్నారు. బుధవారం నాటికి ఎర్రగడ్డ ఆస్పత్రికే 500 మంది ఇన్‌పేషెంట్లుగా చేరగా ప్రైవేటు, ఆస్పత్రులు, డీ అడిక్షన్ కేంద్రాల్లో మరో 500 మంది వరకు చేరారు. మరో పద్నాలుగు రోజుల వరకు మద్యం అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేకుండా పోవటంతో.. అలవాటుగా మారిన మద్యంప్రియులను మత్తు వదిల్చేందుకు ఇదే సరైన సమయమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మద్యం, కల్లుకు పూర్తిగా అలవాటు పడిన వ్యక్తులకు 72 గంటల్లోగా అందకపోతే.. శరీర నాడీ మండల వ్యవస్థలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని ఈ సమయంలో కుటుంబ సభ్యులతో పాటు సరైన నిపుణుల కౌన్సెలింగ్, వైద్య సహాయంతో పూర్తి స్థాయిలో మద్యాన్ని మాన్పించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో సైకియాట్రిస్ట్ విభాగాలతో పాటు డీ అడిక్షన్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ సమయంలో కుటుంబసభ్యులు చొరవ చూపిస్తే.. వాళ్లంతా కొత్త జీవితం ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని విమెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ శ్వేతాశెట్టి అన్నారు.
పూర్తి స్థాయిలో.. ఎక్కువ కాలం ఇప్పుడే..
తెలంగాణలో ఏకంగా పది రోజుల పాటు కల్లు, మద్యంపై పూర్తి నియంత్రణ వి«ధించటం ఇదే తొలిసారి కావటం విశేషం. 1993లో అప్పటి సీఎం విజయభాస్కరరెడ్డి సారాపై నిషేధం విధిస్తే.. 1994లో అధికారం చేపట్టిన ఎన్టీ రామారావు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. జనవరి 16, 1995 నుండి మార్చి31, 1997 వరకు రాష్ట్రంలో మద్య పాన నిషేధం అమలు చేశారు. ఈ సమయంలో కల్లు సరఫరాతో పాటు స్టార్ హోటళ్లతో పాటు కొందరు డాకర్లు సూచించిన వ్యక్తులకు ప్రత్యేక పాస్‌ల ద్వారా మద్యం పంపిణీ చేశారు. ఇదే సమయంలో రక్షణ సిబ్బందికి సైతం మిలిటరీ క్యాంటిన్ల ద్వారా మద్యం సరఫరా జరిగింది. దీనికి తోడు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో చుక్క మందు కూడా దొరకని ప్రత్యేక పరిస్థితి ఇదే కావటం విశేషం.
ఫ్యామిలీ సహకారం అవసరం
ఆల్కహాల్ దొరక్క ఇప్పటికే ఎర్రగడ్డ ఆస్పత్రికి 500 కేసులు వచ్చాయి. ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. మత్తుకు అలవాటు పడినవారికి ఒక్కసారిగా అది అందకపోతే.. విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం, ముందు చూపు ఎంతో అవసరం. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో డీ అడిక్షన్ కేంద్రాలున్నాయి. సైకియాట్రిస్ట్‌ల ఆధ్వర్యంలో వారికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇస్తే వాళ్లు తిరిగి కొత్త జీవితం ప్రారంభించేందుకు అవకాశం ఉంది.– డాక్టర్ ఉమాశంకర్, సూపరింటెండెంట్,ఎర్రగడ్డ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment