బీర్ల అమ్మకాలు ఢమాల్‌... | Alcohol Sales Down After Lockdown in Hyderabad | Sakshi
Sakshi News home page

కిక్కు దిగింది!

Published Thu, May 21 2020 9:31 AM | Last Updated on Thu, May 21 2020 9:31 AM

Alcohol Sales Down After Lockdown in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో లిక్కర్‌ ‘కిక్కు’ అమాంతం పడిపోయింది. గతంలో ‘ఆరు బీర్లు...మూడు ఫుల్లు’ అన్న చందంగా సాగిన వ్యాపారం కోవిడ్‌ దెబ్బకు కుదేలైంది. లాక్‌డౌన్‌కు ముందు రోజువారీగా జరిగిన అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు సుమారు 50 శాతం మేర పడిపోయాయి. గతంలో నిత్యం మహానగరం పరిధిలోని 400 మద్యం దుకాణాల్లో మొత్తంగా రూ.12 కోట్ల మేర లిక్కర్‌ అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు అమ్మకాలు కనాకష్టంగా రూ.6 కోట్లకు మించడంలేదని మద్యం వ్యాపారులు వాపోతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం ఒక్కో దుకాణంలో సరాసరిన రూ.3 లక్షల మేర అమ్మకాలు జరగ్గా..ఇప్పుడు రూ.1.5 లక్షల విలువైన వివిధ రకాల మద్యం బ్రాండ్లు, బీర్లు అమ్ముడవుతున్నట్లు చెబుతున్నారు.

కారణాలివే..
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల ఆదాయ..వ్యాయాల్లో భారీ తేడా వచ్చింది. ఇక మద్యం దుకాణాల వేళలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పరిమితం చేశారు. వివిధ పనులు, వృత్తి, ఉద్యోగాలు చేస్తున్న మందుబాబులు సాయంత్రం వేళల్లో మద్యం తాగుదామనుకునే సమయానికి దుకాణాలను మూసివేస్తున్నారు. మరోవైపు వైన్స్‌ పక్కన పర్మిట్‌రూమ్‌లకు అనుమతించకపోవడంకూడా మద్యం అమ్మకాలు తగ్గేందుకు కారణాలని వ్యాపారులు చెబుతున్నారు.

బీర్ల అమ్మకాలు ఢమాల్‌...
సాధారణంగా వేసవిలో చిల్డ్‌ బీర్లు నగరంలో హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. గత వేసవిలో ప్రతీ దుకాణంలో రోజువారీగా సరాసరిన 150 కేసుల మేర బీర్లు విక్రయించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేవలం 60 నుంచి 75 కేసులకు మించి విక్రయించలేకపోతున్నామన్నారు.

బార్ల నుంచి వైన్స్‌కు బీర్ల ప్రవాహం..
నగరంలో బార్లను మూసివేయడంతో సుమారు 200 బార్లలో ఉన్న సుమారు 50 వేల కేసుల బీర్లను సమీప వైన్స్‌కు చేరవేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. తయారుచేసిన తేదీ నుంచి ఆరునెలల గడువు లోపల ఉన్న బీర్ల స్టాకును మాత్రమే ఈ విధానంలో తరలించినట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement