నల్లకుంట: గత కొద్ది రోజులుగా ప్రబలుతున్న విష జ్వరాలతో బస్తీలు వణికిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు విష జ్వరాల బారిన పడిన మంచానికే పరిమితమవుతున్నారు. సకాలంలో వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా జ్వరం తగ్గక పోవడంతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి బాట పడుతున్నారు. బస్తీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని ప్రజలు కోరుతున్నారు.
నిరంతర వర్షాలు, పారిశుధ్య లోపం కారణంగా నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుతోంది. గ్రేటర్‌లోని అన్ని మురికి వాడలు, బస్తీల్లో ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. కలుషిత నీరు కూడా జ్వరాల పెరుగుదలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. బస్తీల్లో పారిశుధ్యం లోపించింది. డ్రెయిన్లు పూడుకుపోయి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. పైపులైన్ల లీకేజీల వల్ల రక్షిత నీరు కలుషి తమవుతుండటంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. చలి జ్వరం, జలుబు, దగ్గు తదితర వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దీంతో వైరల్ ఫీవర్స్, మలేరియా తదితర రోగాలతో చికిత్సల కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లోనూ జ్వర పీడిత కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
‘గాంధీ’లో నేల పడకలే దిక్కు
గాంధీఆస్పత్రి : విషజ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి రోగుల తాడికి విపరీతంగా పెరిగింది. నగరంతోపాటు తెలంగాణ జిల్లాల నుంచి రోగులు క్యూ కట్టడంతో పలు విభాగాలు కిటకిటలాడుతున్నాయి. ఇన్‌పేషెంట్ వార్డుల్లో ఖాళీ లేకపోవడంతో వరండాలో నేలపై పరుపులు వేసి వైద్యసేవలు అందిస్తున్నారు. గాంధీ అవుట్ పేషెంట్ విభాగంలో సోమవారం 2101 రోగులకు వైద్యసేవలు అందించారు. సాయంత్రం ఓపీకి స్పందన అంతంత మాత్రంగా ఉంది. సరైన ప్రచారం లేకపోవడంతో ఈ నెల 1 నుంచి 8 వరకు గాంధీ సాయంత్రం ఓపీలో కేవలం 116 మంది మాత్రమే వైద్యసేవలు పొందారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
కాచి వడపోసిన నీటిని తాగాలి. కలు షిత, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినరాదు. వేడిగా ఉన్న ఆహారాన్ని భుజించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. జ్వరం వస్తే వైద్యుల సలహామేరకు మందులు వాడాలి.– డాక్టర్ పద్మజ, ఫీవర్ సీఎస్ ఆర్‌ఎంవో
Comments
Please login to add a commentAdd a comment