
రహమత్‌నగర్‌లో రెండు రోజులుగా భూ ప్రకంపనలు
అర్ధరాత్రి రోడ్లపైకి పరుగులు తీసిన జనం
ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేసిన ఎన్జీఆర్‌ఐ
సాక్షి,హైదరాబాద్: నగరంలో స్వల్ప భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. గురువారం మొదలైన శబ్దాలు, ప్రకంపనలు పలు కాలనీ వాసులను రాత్రంతా జాగారం చేయించాయి. ఈ ప్రకంపనల తీవ్రత శుక్రవారం మరింత అధికమైంది. రహమత్‌నగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా పెద్దశబ్దం రావడం.. ఇంట్లో వస్తువులు దొర్లి పడడంతో స్థానికులు ఏం జరిగిందో అర్థంకాక రోడ్లపైకి పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లేందుకు భయపడి తెల్లవార్లూ రోడ్లపైనే ఉండిపోయారు. ప్రధానంగా రహమత్‌నగర్ పరిధిలోని ఎస్పీఆర్‌హిల్స్, ప్రతిభానగర్, హబీబ్ ఫాతీమానగర్ ఫేజ్–2, హనుమాన్ స్టోన్ కట్టర్స్ కాలనీ తదితర బస్తీల్లో శుక్రవారం తెల్లావారు జామున 3 గంటల ప్రాంతంలో ఒక్క సారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఇక్కడి ఇళ్లలోని వస్తువులు దొర్లి కిందపడడంతో స్థానికులు ఆందోళన చెందారు. భూకంపం వచ్చినట్టు భావించి ప్రజలు రోడ్ల్లపైకి పరుగులు తీశారు. కొంత మంది పోలీస్ కంట్రోట్ రూమ్‌కు సమాచారం అందించారు. దీంతో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న జూబ్లీహిల్స్, ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు ఆయా ప్రాంతాలకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్జీఆర్‌ఐ ప్రత్యేక స్టేషన్ల ఏర్పాటు..
రెండు రోజులుగా రహమత్‌నగర్ పరిసరాల్లో శబ్ద తరంగాలతో పాటు స్వల్ప ప్రకంపనలు వస్తున్నాయి. ఈ క్రమంలో వీటి తీవ్రతను రికార్డు చేసేందుకు ఆయా ప్రాంతాల్లో రెండు ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్త శ్రీనగేష్ తెలిపారు. ఆయన శనివారం రాత్రి సాక్షితో మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వస్తున్న స్వల్ప కంపనల వల్ల పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. తమ స్టేషన్లలో ప్రకంపనల తీవ్రత మైనస్ డిగ్రీలుగా నమోదైనట్టు ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.
బోరబండలోనూ భయం..
వెంగళరావునగర్: బోరబండ డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో శనివారం తెల్లవారుజామున, తిరిగి రాత్రి 11 గంటలకు కూడా ప్రకంపనలు జనాన్ని పరుగులు పెట్టించాయి. ఇళ్లు స్వల్పంగా కదలడంతో నివాసితులు ఆందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. భరత్‌నగర్‌బస్తీ, బాబాసైలానీ నగర్, హెచ్‌ఎఫ్‌నగర్, మధురానగర్‌లోని ప్రాంతాలు ఈ ప్రకంపనలకు గురయ్యాయి. ఈ సందర్భంగా జాఫర్ అనే వ్యక్తి మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయన్నాడు. సమీపంలోని క్వారీల్లో తవ్వకాలు ఎక్కువగా చేస్తుండడంతో ఆ ప్రభావం తమ ఇళ్లపై పడుతున్నట్టు స్థానిక మహిళ పేర్కొంది.
వస్తువులు కదిలిపోయాయి
మా ఇంట్లోని వస్తువులన్నీ కదిలిపోయాయి. ఏదో పేలినట్టు శబ్దం రావడంతో మేమంతా ఇంట్లో నుంచి బయటికి పరుగుతీశాం. ఇలా జరగడం ఇదే మొదటిసారి.
– భారతమ్మ, ప్రతిభానగర్
ఒక్కసారిగా పెద్ద శబ్దం..
అర్ధరాత్రి ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరుగుతుందో తెలియలేదు. మే మంత భయపడి రోడ్డుపైకి ప రుగులు తీశాం.
తెల్లవార్లూ మేల్కొనే ఉన్నాం.
– మక్బూల్, హబీబ్ ఫాతిమానగర్ ఫేజ్–2