కామారెడ్డి అటేనా!
కొత్త జిల్లాల ఏర్పాటు విషయం జిల్లాలో కలవరం రేపుతోంది. అసలే చిన్నగా ఉన్న నిజామాబాద్ జిల్లా నుంచి మరి కొన్ని మండలాలు ఇతర జిల్లాలలో కలుస్తాయని వినిపిస్తున్న వార్తలతో ప్రజలలో ఆందోళన మొదలైంది. అప్పుడే ఎవరు ఎటువైపు వెళతారనేది చర్చ కూడా జరుగుతోంది.
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ మొట్టమొదట ఇందూరు జిల్లాగా క్రీ.శ.1876లో ఏర్పడింది. అప్పుడు ఇందులో నిజామాబాద్, నిర్మల్, ఆ ర్మూర్, భీమ్‌గల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, ముథోల్, న ర్సాపూర్ తాలుకా కేంద్రాలు ఉండేవి. 1905లో జరిగిన జిల్లాల పునర్విభజనలో నిర్మల్, నర్సాపూర్ తాలుకాలు కొత్తగా ఏర్పడిన ఆదిలాబాద్ జిల్లా లో కలిశాయి. ఆదిలాబాద్ ప్రాంతంలోని ముథోల్, బాన్సువాడలోని కొం త భాగాన్ని నాందేడ్ జిల్లాలో కలిపారు. ఈ సమయంలోనే ఇందూరు ని జామ్ పేరుతో నిజామాబాద్ జిల్లాగా రూపాంతరం చెందింది. ఈ జిల్లా లో కేవలం ఐదు తాలూకాలు నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్ ఉండేవి.
1931లో ఎల్లారెడ్డి, బోధన్ తాలుకాల నుంచి పలు గ్రామాలను విడదీసి బాన్సువాడను తాలూకాగా ఏర్పాటు చేశారు. 1956 లో నాందేడ్ జిల్లా మహారాష్ట్ర పరిధికి వెళ్లింది. అక్కడి దెగ్లూర్ తాలుకాలోని బిచ్కుంద, జుక్కల్ కేంద్రాలను నిజామాబాద్‌లో కలిపారు. 1958 లో మెదక్ జిల్లా నారాయణఖేడ్ తాలుకాలోని కొన్ని గ్రామాలను, మద్నూర్ ప్రాంతంలోని మరికొన్ని గ్రామాలను తీసుకుని మద్నూరు తాలుకాను ఏర్పాటు చేశారు. 1979 డిసెంబర్ నెలలో కామారెడ్డి తాలుకాలోని కొన్ని గ్రామాలను విడదీసి దోమకొండ కేంద్రంగా, ఆర్మూర్‌లోని కొన్ని గ్రామాలను విడదీసి భీమ్‌గల్ పేరుతో కొత్త తాలుకాలను ఏర్పర్చారు. వీటితో కలుపుకొని నిజామాబాద్ జిల్లాలో తాలుకాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. తరువాత ఇవి 36 మండలాలుగా విడిపోయాయి.
ఇప్పుడిలా!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సర్కారు కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇందుకోసం రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఏడు జిల్లాలను ఏర్పాటు చేస్తారని అంటున్నారు. మెదక్ జిల్లాలోని సిద్ధిపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. ఈ జిల్లా పరిధిలోకి నిజామాబాద్‌లోని కామారెడ్డి డివిజన్ బదిలీ కానుందని తెలుస్తోంది. ఈ డివిజన్‌లోని ఏడు మండలాలు ఆ జిల్లా పరి ధికి వెళ్తాయని సమాచారం.
దీంతో జిల్లాలోని 36 మండలాలలో ఏడు మండలాలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, కామారెడ్డినే జిల్లా కేంద్రంగా చేయాలని కొంత కాలంగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లా జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేస్తే కమ్మర్‌పల్లి, మోర్తాడ్ మండలాలు జగిత్యాలకు బదిలీ అవుతాయని భావిస్తున్నారు. అవసరమైతే భీమ్‌గల్ మండలాన్ని చేర్చే విషయం కూడా పరిశీలిస్తారని అంటున్నారు. దీంతో నిజామాబాద్ అతి చిన్న జిల్లాగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.