కోతలతో విలవిల | peoples are suffering with power cuts | Sakshi
Sakshi News home page

కోతలతో విలవిల

Published Sun, Aug 17 2014 2:09 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

peoples are suffering with power cuts

ఖమ్మం: సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన పాకాల ప్రసాద్ పదేళ్లుగా టీవీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. షాపు అద్దె నెలకు రూ.5 వేలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా లేకపోవ టంతో టీవీలు రిపేర్ చేయలేకపోతున్నాడు. దీంతో అద్దె చెల్లించేందుకే అప్పు చేయాల్సి వస్తోంది. ఇక అతడి కుటుంబం ఇబ్బందుల పాలవుతోంది. పగటి వేళల్లో విద్యుత్ కోతలు ఇలాంటి ఎంతోమంది జీవనోపాధిని దెబ్బతీస్తోంది. జిల్లాలో అధికారిక కోతలకు తోడు అనధికారిక కోతలు భారీగా విధిస్తుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
 
విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోవడంతో పాటు.. ఏ పనీ సాగక చిన్న చిన్న పరిశ్రమల వారు, సా మిల్లు కార్మికులు, మెకానిక్‌లు.. ఇలా అనేక రంగాల వారు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. విద్యుత్ వినియోగానికి-సరఫరాకు మధ్య తేడా ఉందనే నెపంతో కోతల సమయాన్ని పెంచారు. అధికారికంగానే జిల్లా కేంద్రంలో ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు, మున్సిపల్, మండల కేంద్రాల్లో ఉదయం నాలుగు గంటలు, సాయంత్రం నాలుగు గంటలు కోత విధిస్తున్నారు.
 
దీనికి తోడు ఏదోఒక సాకుతో రోజుకు మరికొన్ని గంటలు సరఫరా నిలిపివేస్తున్నారు. రాత్రీ-పగలూ తేడా లేకుండా కరెంట్ పోతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొద్దంతా కష్టపడి పనిచేసుకుని వస్తే రాత్రి వేళ విద్యుత్ కోతలతో దోమల బాధ భరించలేకపోతున్నామని, నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సి వస్తోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇక చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. విద్యుత్ లేకపోవడంతో పిల్లలు రాత్రిపూట చదువుకోలేకపోతున్నారని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు.
 
కార్యాలయాల్లోనూ తప్పని వెతలు..
పట్టణాలలో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ కోతలు విధించడంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనులు స్తంభించిపోతున్నాయి. పనులు చేసే సమయంలో కరెంట్ లేకపోవడంతో రాత్రివేళల్లో కూడా కార్యాలయాల్లోనే ఉండాల్సి వస్తోందని ఉద్యోగులు చెపుతున్నారు. ఇక చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులు పనులు చేయక పస్తులుండాల్సిన పరస్థితి నెలకొంది. ప్రధానంగా జిరాక్స్ సెంటర్లు, మెకానిక్‌లు, ఎలక్ట్రికల్ వర్కర్లు, వెల్డింగ్ షాపుల వారిపై కోతల ప్రభావం అధికంగా ఉంటోంది. గంటల తరబడి విద్యుత్ కోతలతో ఏ పనీ చేయలేకపోతున్నామని ఆయా రంగాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఎండుతున్న పంటలు..
గృహ అవసరాలకు విద్యుత్ కోతలు విధిస్తున్నామని చెపుతున్న ట్రాన్స్‌కో అధికారులు వ్యవసాయ రంగాన్నీ వదలడం లేదు. పంటల సాగుకు ఉదయం ఐదు గంటలు, రాత్రి రెండు గంటలు  సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్పడమే తప్ప.. సక్రమంగా అమలు చేయడంలేదు. గత వారం రోజులుగా ఉదయం ఒకటి రెండు గంటలు మాత్రమే కరెంటు ఉంటోందని, అది కూడా తరచూ ట్రిప్ కావడం, లోవోల్టేజీ సమస్యలతో కనీసం ఒక మడి కూడా తడవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడపా దడపా చిరుజల్లులు రావడంతో కొద్దోగొప్పో పంటలు రక్షించుకోగలుగుతున్నామని, లేకుంటే పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని అంటున్నారు.
 
సంక్షోభంలో ‘గ్రానైట్స్’...
జిల్లాలో అత్యధిక సంఖ్యలో గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. వేల సంఖ్యలో కార్మికులు, కూలీలు ఈ ఫ్యాక్టరీలపై ఆధారపడి జీవిస్తున్నారు. గృహ అవసరాలకు అధికంగా విద్యుత్‌ను వినియోగించే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పరిశ్రమలకు అధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీనికి తోడు మిగిలిన సమయంలోనూ కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో.. తెలియడం లేదు. దీంతో తరుచూ మిషన్లు ఆగడంతో  సరైన కూలి లభించక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్టరీ యజమానులు సైతం నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement