
పెట్రోల్‌బంక్‌లో వినియోగదారులు
ఆదిలాబాద్‌టౌన్: పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రూ.వంద వైపు వేగంగా పరుగులు తీస్తున్నాయి. నెలరోజుల క్రితం లీటరు పెట్రోల్ ధర రూ.84.50 ఉండగా, తాజాగా పెరిగిన ధరతో రూ.90కి చేరింది. ప్రతిరోజు ధర మారుతూనే ఉంది. రాత్రి 12 గంటల వరకు ఒక ధర ఉంటే, తెల్లారేసరికి బోర్డుపై మరో ధర దర్శనమిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుల నడ్డీ విరుగుతోంది. చుక్కలనంటుతున్న నిత్యావసర సరుకుల ధరలతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతుండగా, పెరుగుతున్న ఈ ధరలు మరింత అదనపు భారంగా మారాయి.
సామాన్య ప్రజలపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ధరల పెరుగుదలతో రవాణా రంగం కుదేలవుతోంది. ఆటోలు నడిపే డ్రైవర్లు, ట్రాక్టర్, ఇతర ప్రైవేట్ వాహన యజమానులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆరు నెలలకో, మూడు నెలలకోసారి పెట్రో ధరలు పెరిగేవని, ప్రస్తుతం ఈ ప్రభుత్వ హయాంలో రోజురోజుకు ధరలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోందని వాపోతున్నారు.
రోజురోజుకు పైపైకి..
రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.89.95 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.82.59కి చేరింది. ఈ నెల 1న పెట్రోల్ లీటరు ధర రూ.84.98 ఉండగా, నెలరోజులు గడవక ముందే రూ.90కి చేరింది. గతంలో డీజిల్, పెట్రో ల్ ధరల మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. కానీ ప్రస్తుతం ఐదారు రూపాయల తేడా మాత్రమే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ధరలు ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో వాహనచోదకులతోపాటు సామాన్య జనాలు సైతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళన నేపథ్యంలో లీటరు ధరలో కొంత పైసలు తగ్గించినా మళ్లీ రోజురోజుకు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో 25 వరకు పెట్రోల్‌బంక్‌లు ఉన్నాయి. రోజు 25వేల లీటర్ల పెట్రోల్ విక్రయాలు, 50వేల లీటర్ల వరకు డీజిల్ విక్రయాలు జరుగుతాయని పెట్రోల్‌బంక్‌ల యజమానులు పేర్కొంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో జిల్లా వాసులపై అదనపు భారం పడుతూనే ఉంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు పెట్రోల్‌పై రూ.17 వరకు, లీటరు డీజిల్‌పై రూ.14 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడు నెల్లోనే ఇంత ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు 25 పైసల నుంచి 50పైసల వరకు పెరుగుతండడంతో ధర పెరిగిందని వినియోగదారులకు ధర పెరుగుతున్న విషయం తెలియడంలేదు. రానున్న రోజుల్లో పెట్రోల్ ధర రూ.100కు చేరుకునే అవకాశం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించి ఇబ్బందులను తొలగించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.
ధరలు తగ్గించాలి
బీజేపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక పెట్రోల్ ధరలు విపరీంగా పెరిగా యి. ఎన్నికల ముందు పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారు. రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆటో నడిపించి కుటుంబాన్ని పో షించడం భారంగా మారుతోంది. వాహనదారులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. – ఇమ్రాన్, ఆటోడ్రైవర్, ఆదిలాబాద్
రోజూ పెంచుడే..
రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్నాం. మోటార్‌సైకిల్ నడపాలంటే భయమేస్తోంది. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.90కి చేరింది. మరో నెలరోజుల్లో రూ.100కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలతో నిత్యావసర సరుకుల ధరలు మరింతగా పెరుగుతున్నాయి. వెంటనే ధరలను నియంత్రించాలి. – రిజ్వాన్, వాహనదారుడు,ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment