పెంపుడు జంతువుల తోడుగా మెట్రో జర్నీ చేద్దామంటే కుదరదని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ స్పష్టంచే సింది. త్వరలో నగర మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్న దృష్ట్యా ఆయా స్టేషన్లలో ప్రయాణికులు చేయకూడని, చేయాల్సిన పనుల జాబితాను ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ శివానంద నింబార్గీ మంగళవారం విడుదల చేశారు. ఇందులో పలు కీలక అంశాలున్నాయి.
స్టేషన్లు, రైలులో చేయాల్సిన పనులివీ..
♦ మీ చేతిలో లేదా బ్యాగులోని చెత్తను విధిగా చెత్తకుండీలోనే వేయాలి. స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిదీ.
♦ మెట్రోస్టేషన్ పరిసరాలకు చేరుకున్న తరవాత మీ ప్రయాణానికి సంబంధించి తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో వినిపించే అనౌన్స్‌మెంట్లను జాగ్రత్తగా వినాలి.
♦ మీకేదైనా సహాయం కావాలంటే కస్టమర్ సర్వీస్ బృందం, స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి.
♦ మెట్రో స్టేషన్ లేదా బోగీలో నిషిద్ధ వస్తువులు, పేలుడు పదార్థాలున్నట్లు అనుమానిస్తే సిబ్బందికి వెంటనే తెలియజేయాలి.
♦ స్టేషన్‌లోనికి వెళ్లే సమయంలో వ్యక్తిగత, బ్యాగేజీ తనిఖీ విషయంలో భద్రతా సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
♦ తోటి ప్రయాణికులు, మెట్రో సిబ్బంది, స్టేషన్ స్టాఫ్‌తో మర్యాదగా ప్రవర్తించాలి.
♦ మెట్లు,ఎస్కలేటర్లపై వెళుతున్నప్పుడు జాగ్రత్తగా వెళ్లాలి.
♦ మీరు దిగాల్సిన స్టేషన్ రాగానే రైలు దిగి వెళ్లిపోవాలి.
♦ ఎస్కలేటర్‌పై ప్రయాణిస్తున్నప్పుడుఎడమవైపు మాత్రమే ఉండాలి.
♦ బోగీలో హ్యాండ్‌రైల్‌ను పట్టుకొని నిలబడాలి.
♦ చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు కూర్చునేందుకు మీ వంతుగా సహకరించాలి.
♦ చిన్నారులను తీసుకొచ్చే బేబీ బగ్గీస్, వీల్‌చైర్లలో వచ్చేవారు విధిగా ఎలివేటర్లలో ప్లాట్‌ఫాం మీదకు వెళ్లాలి.
♦ ఎస్కలేటర్ దిగిన వెంటనే దానికి దూరంగా జరగాలి.
♦ టిక్కెట్ కౌంటర్, టిక్కెట్ విక్రయ యంత్రాలు, ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ గేట్ల వద్ద మీ వంతు వచ్చే వరకు క్యూలైన్‌లో నిలబడాలి.
♦ రైలు ప్లాట్‌ఫాంపై నిలిచిన తరవాతనే బోగీలోనికి ప్రవేశించాలి.
♦ రైలులో ప్రయాణిస్తున్నప్పడు సిబ్బంది టోకెన్లు, స్మార్ట్ కార్డులు చూపమన్నప్పుడు వారికి సహకరించాలి. టిక్కెట్ లేని ప్రయాణికులపై కఠిన చర్యలు తప్పవు.
చేయకూడని పనులివే..
♦ స్టేషన్లు, పరిసరాల్లోను, బోగీల్లోనూ ఉమ్మివేయడం, సిగరెట్లు తాగడం, పాన్ నమలడం చేయరాదు. ఆల్కహాల్ తాగడం పూర్తిగా నిషిద్ధం.
♦ రైలుల్లోకి ప్రవేశించిన తరవాత ఫొటోలు తీయరాదు.
♦ ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో నిషిద్ధ ప్రాంతాల్లో కూర్చోరాదు.
♦ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు తినుబండారాలు, ఆహారం తీసుకోరాదు.
♦ మీ పెంపుడు జంతువులను మెట్రో రైళ్లలో తీసుకెళ్లడం నిషిద్ధం.
♦ ప్రమాదకర వస్తువులు, అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్న వస్తువులను స్టేషన్ పరిసరాల్లోకి, బోగీల్లోకి అనుమతించరు.
♦ ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాటిపై వాలడం, ఎస్కలేటర్ల పనితీరును అడ్డుకోరాదు.
♦ ప్లాట్‌ఫాంపై రైలు కోసం వేచివుండే సమయంలో పసుపురంగు లైన్‌ను దాటి రావద్దు.
♦ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు బలవంతంగా రైలు డోర్లు తెరవరాదు. డోర్లకు ఆనుకొని నిల్చోరాదు. రైలు కోసం పరిగెత్తరాదు.
♦ మీ చిన్నారులను నిర్లక్ష్యంగా ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో విడిచిపెట్టరాదు.
♦ ట్రాక్‌పై ఏర్పాటు చేసిన ఓవర్‌హెడ్ వైర్లను ఎట్టిపరిస్థితుల్లో తాకరాదు.
♦ మెట్రో రైలు పరిసరాల్లోకి భద్రతా ధ్రువీకరణ లేని ఆయుధాలు తీసుకురావద్దు.
♦ చూపులేని వారి కోసం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టైల్స్‌పై ఇతరులు నడవరాదు.
♦ అత్యవసర కమ్యూనికేషన్ సాధనలతో రైలు డ్రైవర్‌తో సంభాషించరాదు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే వారితో సంప్రదించాలి.
♦ మెట్రోస్టేషన్ రైలు, పరిసరాల్లో హాకర్స్‌కు ప్రవేశం నిషిద్ధం.
♦ బోగీ డోర్లు తెరచుకునే.. మూసుకునే సమయాల్లో వాటి మధ్యలో నిలవరాదు.
♦ బోగీలకు ఎలాంటి నోటీసులు అంటించరాదు.
♦ స్టేషన్, బోగీ పరిసరాలను పాడుచేసిన వారు శిక్షార్హులు.
♦ రైలు గమనాన్ని అడ్డుకునే చర్యలపై కఠిన చర్యలు తప్పవు.
♦ మీ దగ్గర ఉన్న స్మార్ట్‌కార్డు లేదా టోకెన్‌ను తోటి ప్రయాణికులతో పంచుకోవద్దు.
Comments
Please login to add a commentAdd a comment