ఇంజనీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నుంచి సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నుంచి సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంఈ/ ఎంటెక్/ ఎంఆర్క్/ ఎం.ఫార్మసీ/ ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 349 ఎంటెక్ కాలేజీల్లో 41,178 సీట్లు ఉండగా... 188 ఫార్మసీ కాలేజీల్లో 15,452 సీట్లు ఉన్నాయి. గేట్/జీప్యాట్‌లో అర్హత సాధించిన వారు 6, 7 తేదీల్లో సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకావాలి. అనంతరం నిర్ణీత ర్యాంకుల వారీగా 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఇక పీజీఈసెట్‌లో అర్హత సాధించిన వారికి 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సర్టిఫికెట్ల తనిఖీ ఉంటుంది. 12వ తేదీ నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. అనంతరం సీట్ల కేటాయింపు చేస్తారు.
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌పై ఢిల్లీకి అధికారులు..
ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విన్నవించేందుకు ఏపీ ఉన్నత విద్యా మండలి న్యాయ విభాగం అధికారులు గురువారం ఢిల్లీకి వెళ్లారు. అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్‌తో (ఏఓఆర్) చర్చించి శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు విద్యా మండలి వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టులో వేసిన ఇంప్లీడ్ పిటిషన్, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 31లోగా కౌన్సెలింగ్ మొత్తం పూర్తి కావాల్సి ఉందని, అలాంటపుడు రెండో విడత కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ఏపీ ఉన్నత విద్యా మండలికి నోటీసులు జారీ చేశారు. తెలంగాణ సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యార్ కూడా ఇదే అంశాన్ని పేర్కొంటూ లేఖ రాశారు. దీంతో రెండో దశ కౌన్సెలింగ్ కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది.