ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయి ఎంసెట్ రాసిన విద్యార్థులు బాధపడుతూంటే, మరోవైపు పీజీ వైద్య పూర్తి చేసినా సూపర్‌స్పెషాలిటీకి ప్రవేశ పరీక్షకు అనుమతించకపోవడంపై పీజీ వైద్యులు తల్లడిల్లుతున్నారు.
* సూపర్ స్పెషాలిటీ అర్హత పరీక్షకు ఆర్‌జీయూహెచ్‌ఎస్ తిరస్కరణ
* స్విమ్స్, నిమ్స్ ప్రవేశాలకు అనుమతిచ్చినా కౌన్సెలింగ్‌కు నో
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయి ఎంసెట్ రాసిన విద్యార్థులు బాధపడుతూంటే, మరోవైపు పీజీ వైద్య పూర్తి చేసినా సూపర్‌స్పెషాలిటీకి ప్రవేశ పరీక్షకు అనుమతించకపోవడంపై పీజీ వైద్యులు తల్లడిల్లుతున్నారు. ఈ పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ పీజీలకే ఉండటం విస్మయపరిచే అంశం. 2010-13 బ్యాచ్‌లో పీజీ పూర్తిచేసుకున్న వైద్యులకు సూపర్ స్పెషాలిటీ అర్హత ప్రవేశ పరీక్షకు కర్ణాటకతో పాటు మన రాష్ట్రంలోని స్విమ్స్, నిమ్స్‌లు నిరాకరించాయి. 2013లో పీజీ పూర్తిచేసిన వారిని గ్రామీణ సర్వీసులకు వెళ్లాలని, లేదంటే సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని ప్రభుత్వం మొండికేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఈ వివాదంపై 2013 నవంబర్‌లో పీజీ పూర్తి చేసిన వైద్యులు హైకోర్టుకెళ్లారు. ఈ కేసుపై ధర్మాసనం గ్రామీణ సర్వీసుకు, సర్టిఫికెట్లకు లింకు పెట్టడం సరికాదని, సర్టిఫికెట్లు తక్షణమే ఇవ్వాలని చెప్పింది. అయినా సరే ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో సుమారు 300 మందికిపైగా పీజీ వైద్యులు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)లో రిజిస్ట్రేషన్ చేయించుకోలేక పోయారు.
ఎంసీఐ రిజిస్ట్రేషన్ లేని కారణంగా కర్ణాటకలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ (ఆర్‌జీయూహెచ్‌ఎస్) రాష్ట్ర పీజీలను సూపర్ స్పెషాలిటీ కోర్సుల ప్రవేశ పరీక్షకు అనుమతించలేదు. ఈనెల చివరి వారంలో నిమ్స్, స్విమ్స్ ఇన్‌స్టిట్యూట్‌లలో జరిగే సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్ష రాయడానికి అనుమతించినప్పటికీ, కౌన్సెలింగ్ నాటికి ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేనని షరతు విధించారు. జూలైలో జరిగే జిప్‌మెర్ సూపర్ స్పెషాలిటీకి కూడా అనుమతించే అవకాశం లేదని పీజీ వైద్యులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం కూడా మొండికేసింది. ఇప్పటికే జూనియర్ వైద్యుల తరఫున హైకోర్టులో ప్రభుత్వం కోర్టు ఉల్లంఘన పిటిషన్ వేసింది. పీజీ వైద్యులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా అధికారులు స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.